దక్కన్ క్రానికల్ ఆఫీస్‌పై టీడీపీ దాడి: నారా లోకేష్, జగన్ రియాక్షన్ ఇదే
Nara Lokesh: విశాఖపట్నంలో ప్రముఖ ఆంగ్ల దినపత్రిక దక్కన్ క్రానికల్ కార్యాలయంపై తెలుగుదేశం నాయకులు, కార్యకర్తల దాడి పట్ల ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. వేర్వేరుగా ట్వీట్లను పోస్ట్ చేశారు.
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వం యూటర్న్ తీసుకుందంటూ దక్కన్ క్రానికల్ ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించడం టీడీపీ నాయకుల ఆగ్రహానికి కారణమైంది. ఈ సాయంత్రం వాళ్లు డీసీ ఆఫీస్‌పై దాడి చేశారు. బోర్డును తగులబెట్టారు. దినపత్రిక కాపీలను కాల్చివేశారు.

ఈ దాడి పట్ల నారా లోకేష్ స్పందించారు. విశాఖపట్నం బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బ తీసేలా దక్కన్ క్రానికల్ ఈ కథనాన్ని ప్రచురితం చేసిందని అన్నారు. వైఎస్ఆర్సీపీ ఆదేశానుసారం ఈ కథనాన్ని వండి వార్చిందని విమర్శించారు. విశాఖపట్నం ఉక్కు కర్మాగారం తన పూర్వ వైభవాన్ని తిరిగి పొందేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు.
ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మవద్దని ఆయన ప్రజలను కోరారు. వైజాగ్ కార్యాలయంపై దాడిని ఖండిస్తోన్నానని నారా లోకేష్ చెప్పారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సంయమనం పాటించాలని సూచించారు. పక్షపాతంతో కూడిన వార్తలను రాసిన బ్లూ మీడియా సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.
ఈ ఘటనపై వైఎస్ జగన్ స్పందించారు. ఈ టీడీపీ నాయకులు, కార్యకర్తలు చేసిన ఈ దాడిని పిరికిపంద చర్యగా అభివర్ణించారు.
టీడీపీని గుడ్డిగా అనుసరించకుండా, నిష్పక్షపాతంగా వ్యవహరించే మీడియాను అణిచివేయడానికి టీడీపీ చేసిన మరో ప్రయత్నమని జగన్ వ్యాఖ్యానించారు. కూటమి పాలనలో ప్రతి రోజూ రాష్ట్రంలో అప్రజాస్వామ్య చర్యలు నమోదవుతున్నాయని, దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధ్యత వహించాలని అన్నారు.












Click it and Unblock the Notifications