తల్లికి వందనంపై గంటా శ్రీనివాస్ క్లారిటీ: ఓ కొత్త నిర్ణయం
Ganta Srinivas: వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో విశాఖపట్నంలో భారీగా భూదోపిడీ చోటు చేసుకుందని, దీనిపై కఠిన చర్యలను తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరాలని నిర్ణయించినట్లు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో కబ్జాలకు పాల్పడిన నాయకుల లెక్క తెలుస్తామని తేల్చి చెప్పారు.
సాక్షాత్తు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, సహా గత ప్రభుత్వ పెద్దలు విశాఖ కేంద్రంగా జరిపిన భూ దోపిడీ, ఆక్రమణలను వెలుగులోకి తీసుకొస్తామని అన్నారు. విశాఖ ఫైల్స్ పేరుతో ఆ వివరాలను త్వరలోనే విడుదల చేస్తామని ఆయన చెప్పారు. భూములను కోల్పోయిన వారికి తాము అండగా నిలబడతామని అన్నారు.

ఏకపక్షంగా డిజైన్ చేసిన భోగాపురం- భీమిలి బీచ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను కూడా మార్చేలా చర్యలు తీసుకుంటామని గంటా శ్రీనివాస్ వివరించారు. అలైన్‌మెంట్ విషయంలో భూములను కోల్పోయిన వారికి న్యాయం చేస్తామని చెప్పారు. భూ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు.
రాజధాని అమరావతిని గత ప్రభుత్వం స్మశానంగా మార్చిందని గంటా ధ్వజమెత్తారు. 2014లో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజధాని నిర్మాణం కోసం వేలాదిమంది రైతుల వేల ఎకరాలను అందజేశారని, గత అయిదేళ్లల్లో వాళ్లు ఎంతగానో నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు.
తమ ప్రభుత్వ హయాంలోనే 72 శాతం పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయని, జగన్ సర్కార్.. మిగిలిన పనులను కూడా పూర్తి చేయకుండా కాలయాపన చేసిందని, అయిదు సంవత్సరాలు వృధాగా పోయాయని మండిపడ్డారు. ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయడానికి విదేశీ నిపుణులను సైతం చంద్రబాబు తీసుకొచ్చారని గుర్తు చేశారు.
అలాగే- ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటామని గంటా అన్నారు. తల్లికి వందనం పథకం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికీ నిధులు అందిస్తామని తేల్చి చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానాలు వద్దని కోరారు. నకిలీ జీఓలతో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తోందని, లబ్దిదారులను గందరగోళానికి గురి చేస్తోందని విమర్శించారు.
రాష్ట్రానికే తలమానికంగా ఉంటూ వస్తోన్న విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని చంద్రబాబు.. ప్రైవేటుపరం కాకుండా అడ్డుకున్నారని గంటా శ్రీనివాస్ పేర్కొన్నారు. వంద శాతం మేర పెట్టుబడులను ఉపసంహరించడానికి కేంద్ర ప్రతిపాదనలు రూపొందించినా చంద్రబాబు వల్ల అవి అమలు కావని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications