మొన్న ధూలిపాళ్ల నరేంద్ర.. నేడు పల్లా శ్రీనివాస్ టార్గెట్: విశాఖలో హైటెన్షన్: టీడీపీ నేతలు ఫైర్
విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్‌కు జగన్ సర్కార్ షాకిచ్చింది. ఆయనకు చెందిన భవనాన్ని గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది అర్ధరాత్రి కూల్చివేశారు. దీనితో విశాఖపట్నం, గాజువాకల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇప్పటికే టీడీపీకే చెందిన గుంటూరు జిల్లా పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూలిపాళ్ల నరేంద్రను అరెస్ట్ చేయడం పట్ల ఆ పార్టీ నేతలు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్‌పై నిప్పులు చెరుగుతున్నారు. ఆయనను అరెస్ట్ చేసిన రెండోరోజే పల్లా శ్రీనివాస్‌ను టార్గెట్ చేసిందంటూ మండిపడుతున్నారు.
పల్లా శ్రీనివాస్‌కు పాత గాజువాక ప్రాంతంలో ఓ వాణిజ్య సముదాయం ఉంది. అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారనే కారణంతో గ్రేటర్ విశాఖ అధికారులు అర్ధరాత్రి ఆ భవనాన్ని పడగొట్టారు. ఈ సమాచారం అందిన వెంటనే పల్లా శ్రీనివాస్ పాత గాజువాకకు చేరుకున్నారు. నోటీసులు ఇవ్వకుండా రాత్రి సమయంలో భవనాన్ని ఎలా కూల్చివేస్తారంటూ జీవీఎంసీ సిబ్బందిని నిలదీశారు. విశాఖపట్నానికి చెందిన పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు సంఘటనా స్థలానికి చేరుకోవడంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

గత ఏడాది జూలైలోనే ఆ భవన నిర్మాణానికి అనుమతులను పొందామని పల్లా శ్రీనివాస్ తెలిపారు. అనుమతుల ప్రకారమే నిర్మాణాన్ని చేపట్టామని తెలిపారు. నిబంధనలకు అనుగుణంగా రోడ్డు విస్తరణకు అవసరమైన స్థలాన్ని వదిలేసినట్లు చెప్పారు. భవిష్యత్‌లో ఈ రోడ్డును మరింత విస్తరించాల్సి ఉంటుందని, దానికి అవసరమైన స్థల సేకరణ కోసమే భవనాన్ని కూల్చివేస్తున్నారని ఆరోపించారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ అధికారుల వాదన దీనికి భిన్నంగా ఉంటోంది. నిబంధనలు ఉల్లంఘించి భవన నిర్మాణం చేసినట్లు జీవిఎంసీ అధికారులు చెబుతున్నారు.
రోడ్డుకు సెట్ బ్యాక్ వదల్లేదని, అందుకే దానికి అవసరమైనంత స్థలం వరకు మాత్రమే భవనాన్ని కూల్చివేశామని వివరణ ఇచ్చారు. కనీస సమాచారం గానీ, ముందస్తు నోటీసు గానీ ఇవ్వకుండా భవనాన్ని కూల్చివేయడం దారుణమని పల్లా శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా జగన్ సర్కార్.. అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని మండిపడ్డారు. తాము ముందస్తు నోటీసులు ఇచ్చామని జీవీఎంసీ అధికారులు చెప్పారు. నోటీసులు అందుకున్నట్లు తమకు సమాచారం కూడా ఇచ్చారని తెలిపారు. తమ డ్యూటీ తాము చేస్తున్నామని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications