గంటా కాపు అస్త్రం రివర్స్ - టీడీపీకి మరో తంటా
విశాఖపట్నం: తెలుగదేశం విశాఖపట్నం నార్త్ నియోజకవర్గం శాసన సభ్యుడు, మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ రావు వ్యవహారం ఆ పార్టీకి కొత్త ఇబ్బందులను సృష్టిస్తోంది. ఉత్తరాంధ్రకు చెందిన కాపు ఓటుబ్యాంకును ప్రసన్నం చేసుకోవడానికి ఒకవంక టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు వ్యూహాలను పన్నుతోండగా- దాన్ని చిత్తు చేసేలా వ్యవహరిస్తోన్నారు గంటా శ్రీనివాస్. ఈ విషయంలో టీడీపీని ఆత్మరక్షణలోకి నెట్టేస్తోన్నారు.

పార్టీని వీడబోతోన్నారంటూ..
మొన్నటికి మొన్న గంటా శ్రీనివాస్ పార్టీని వీడబోతోన్నారంటూ వచ్చిన వార్తలు తెలుగుదేశం పార్టీలో తీవ్ర అయోమయానికి, గందరగోళానికి దారి తీశాయి. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమిపాలైనప్పటి నుంచీ పార్టీకి దూరంగా ఉంటూ వస్తోన్న ఈ విశాఖ నార్త్ ఎమ్మెల్యే.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతోన్నారంటూ వచ్చిన వార్తలు చంద్రబాబును సైతం కంటి మీద కునుకు లేకుండా చేశాయి. చివరికి తానే స్వయంగా రంగంలోకి దిగి- ఆయనను బుజ్జగించాల్సిన పరిస్థితి వచ్చిందప్పట్లో.

కాపు ఓటుబ్యాంకు..
ఇప్పుడు తాజాగా కాపు సామాజిక వర్గం ఆగ్రహావేశాలకు గురవుతున్నారు గంటా శ్రీనివాస్. ఆయన చేసిన వ్యాఖ్యలు ఆ సామాజిక వర్గంలో కలకలం రేపుతున్నాయి. విమర్శలకు దారి తీస్తోన్నాయి. దీనిపై మళ్లీ వివరణ ఇచ్చుకోవాల్సిన దుస్థితిని ఎదుర్కొంటోన్నారు చంద్రబాబు. విశాఖపట్నంతో పాటు ఉత్తరాంధ్రకు చెందిన కాపుల ఓట్లను ఆకర్షించే పనిలో చంద్రబాబు తలమునకలై ఉండగా..- దాన్ని చెదరగొట్టే పనికి గంటా శ్రీనివాస్ పూనుకున్నట్టే కనిపిస్తోంది.

కాపునాడు భ్రష్టు..
గంటా శ్రీనివాస్ కాపు సామాజిక వర్గాన్ని భ్రష్టు పట్టిస్తోన్నారంటూ విశాఖపట్నం జిల్లా కాపునాడు అధ్యక్షుడు తోట రాజీవ్ హెచ్చరించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కాపులను ఓటుబ్యాంకుగా వాడుకోవడానికి ఆయన కుట్ర పన్నుతున్నారని ఆరోపించారాయన. కాపు కుల సంఘం పెద్దలకు వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీల్లో టికెట్ల ఆశను చూపించి- తనకు అనుకూలంగా మార్చుకుంటోన్నారని ధ్వజమెత్తారు.

నాలుగు సార్లు ఎలా గెలిచారు..
కాపుల్లో ఐక్యత లేదంటూ గంటా శ్రీనివాస్ వ్యాఖ్యానించడాన్ని తోట రాజీవ్ తప్పుపట్టారు. ఆ ఐక్యత అనేదే లేకపోతే ఆయన నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎలా గెలిచారని ప్రశ్నించారు. గంటా తన వ్యక్తిగత లబ్ది కోసం కాపుల్లో చీలికను తెచ్చే ప్రయత్నం చేస్తోన్నారని విమర్శించారు. రెండుసార్లు మంత్రిగా చేసిన గంటా కాపుల ప్రయోజనాలను పట్టించుకోలేదని ఆరోపించారు. తాను గెలిచిన విశాఖపట్నం నార్త్ నియోజకవర్గం ఓటర్లను గంటా గాలికి వదిలేశారని, ఇక తమ సామాజిక వర్గాన్ని, విశాఖను ఏం ఉద్ధరిస్తారని ప్రశ్నించారు.

రాజ్యాధికారం అప్పుడే..
కాపులందరూ సంఘటితమై, ఒక పార్టీకి మద్దతు పలికినప్పుడే రాజ్యాధికారం అందుతుందని, అలాంటిది ఏ పార్టీకి లేకుండా మూడు ముక్కలుగా చేయడానికి గంటా శ్రీనివాస్ కుట్ర పన్నారని తోట రాజీవ్ ఆరోపించారు. గంటా శ్రీనివాస్ తన స్వార్ధ ప్రయోజనాల కోసం కాపు జాతిని చిన్నాభిన్నం చేస్తున్నారని మండిపడ్డారు. వంగవీటి మోహన రంగా వర్థంతిని కూడా రాజకీయం చేశారని, జనసేన వీడిన నేతలను ఏకం చేసి కాపు పార్టీ పెట్టడం ఎలా సాధ్యపడుతుందని ఆయన నిలదీశారు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications