2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అనుసరించే పంచ సూత్రాలు ఇవే
విశాఖపట్నం: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరికలు ఊపందుకున్నాయి. పలువురు స్థానిక నాయకులు వైఎస్ఆర్సీపీలో చేరుతున్నారు. సీనియర్ నాయకుల సమక్షంలో కండువా మార్చుకుంటోన్నారు. ఎన్నికలు సమీపిస్తోన్న కొద్దీ పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని అంచనా వేస్తోంది వైసీపీ అధిష్ఠానం. ఇప్పటికే ప్రతిపక్ష తెలుగుదేశానికి చెందిన మాజీ ఎమ్మెల్యేలు సైతం వైసీపీ తీర్థాన్ని పుచ్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నారనే వార్తలు ఉన్నాయి.

విశాఖ నుంచి..
ఈ పరిణామాల మధ్య విశాఖపట్నానికి చెందిన పలువురు స్థానిక నాయకులు ఇవ్వాళ వైసీపీలో చేరారు. ఆ పార్టీ సీనియర్ నాయకుడు, తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకొన్నారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడారు. తమ ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను చూసి యువత పెద్ద ఎత్తున ఆకర్షితులవుతున్నారని, వైసీపీలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారని అన్నారు.

అవినీతి రహితంగా..
దేశంలో ఏ ప్రభుత్వం కూడా అమలు చేయని సంక్షేమ పథకాలను తాము ప్రవేశపెట్టామని, వాటిని సమగ్రంగా, సమర్థవంతంగా లబ్దిదారులకు చేరవేస్తోన్నామని అన్నారు. ఒక్క రూపాయి కూడా లంచం ఇవ్వాల్సిన పరిస్థితి లబ్దిదారులకు లేదని చెప్పారు. పూర్తి పారదర్శకతతో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని పేర్కొన్నారు. కులం, మతం, పార్టీ, ప్రాంతాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందుకుంటోన్నారని చెప్పారు.

ఆ అయిదు..
తాము అనుసరిస్తోన్న పారదర్శకత, అవినీతి రహిత పరిపాలనే- 2024లో కూడా తమకు అధికారాన్ని అప్పగిస్తుందని వైవీ సుబ్బారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళలు.. తమ పార్టీకి మూలాధారాలని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 80 శాతం మందికి సంక్షేమ పథకాల లబ్ది అందుతోందని పేర్కొన్నారు వైవీ సుబ్బారెడ్డి. విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నో పథకాలను అమలు చేస్తోన్నారని గుర్తు చేశారు.

మరో 15 ఏళ్లు..
2024 ఎన్నికలు మాత్రమే కాదని, వచ్చే 15 సంవత్సరాల పాటు రాష్ట్రంలో వైఎస్ జగనే ముఖ్యమంత్రిగా ఉండేలా అండగా నిలుద్దామని అన్నారు. ప్రతి ఒక్కరు తమ ప్రభుత్వానికి మద్దతు పలకాలని సూచించారు. చెప్పిన హామీలతో పాటు చెప్పనివి కూడా తమ ప్రభుత్వం అమలు చేస్తోందని గుర్తు చేశారు. గ్రామ సచివాలయాలు, వలంటీర్లు వ్యవస్థను గత ప్రభుత్వాలు అసలు ఊహించి ఉండవని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.

విశాఖలో అన్ని స్థానాలు..
2024 సార్వత్రిక ఎన్నికల్లో విశాఖపట్నంలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ జెండా ఎగురవేస్తామని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. 175 నియోజకవర్గాలను గెలిచే దిశగా అందరం కలిసి పని చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. 175 నియోజకవర్గాల్లో గెలిచేలా, మన ప్రభుత్వం అనే భావన ప్రజలందరిలోనూ ఉందని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications