విశాఖ-భీమిలీ బీచ్‌లో వింత కాంతి
విశాఖపట్నం: విశాఖపట్నం తీర ప్రాంతంలో ఆదివారం రాత్రి వింత వెలుగులు కనిపించాయి. విశాఖ నుంచి భీమిలీ వరకు తీర ప్రాంతం పొడవునా ఈ వెలుగులు సందర్శకులను కనువిందు చేశాయి. హోరుమని శబ్దం చేస్తూ తీరానికి చేరుకునే అలలు నీలం రంగులో మెరిసిపోయాయి. వెన్నెల కాంతుల్లో అలలు నీలం రంగులో మెరిసిపోవడాన్ని వింతగా తిలకించారు విశాఖ వాసులు.
తమ సెల్ ఫోన్లకు వారు పని చెప్పారు. నీలం రంగును సంతరించుకున్న అలలను తమ సెల్ కెమెరాల్లో బంధించారు. అలలు తాకిన ప్రదేశం కూడా నీలంగా మారిపోవడం సందర్శకులను ఆశ్యర్యానికి గురి చేసింది. రాత్రి 8 గంటల తరువాత విశాఖ-భీమిలీ బీచ్‌లో ఈ వింత వెలుగు కనిపించింది. తీర ప్రాంతం పొడవునా అదే తరహా కాంతులు అలముకున్నాయి.

సముద్రం మీదుగా వీచే గాలుల్లో కూడా అసాధారణ తేడా కనిపించిందని సందర్శకులు చెబుతున్నారు. కొద్దిసేపు చల్లగా, క్షణాల్లోనే వేడి గాలులు వీచాయని, ఇలా ఎప్పుడూ చోటు చేసుకోలేదని సందర్శకులు వెల్లడించారు. బయోలూమినెస్సీన్స్ వల్లే సముద్రం ఇలా నీలం రంగును సంతరించుకుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
సముద్ర జలాల్లో ఉండే ఓ రకమైన బ్యాక్టీరియాలతో పాటు, యాల్జీ, జెల్లిఫిష్, సముద్రపు పురుగులు, సముద్రాల్లో జీవించే నక్షత్రపు పురుగుల వల్ల ఈ నీలంరంగు అలముకుని ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు. వాతావరణంలో చోటు చేసుకునే పెను మార్పుల వల్ల కూడా ఇలాంటి పరిస్థితులు తలెత్తడానికి ఓ కారణమౌతాయని అంచనా వేశారు.

సాధారణంగా ఇలాంటి దృశ్యాలు ప్యూర్టోరికో, శాన్ డియాగో, ఫ్లోరిడా, జపాన్ తీర ప్రాంతాల్లో తరచూ కనిపిస్తుంటాయి. 2019లో ఇవే రకమైన నీలం రంగు కాంతులు చెన్నై తీరంలో ఏర్పడ్డాయి. గోవా, కర్ణాటక, మహారాష్ట్ర, అండమాన్, పశ్చిమబెంగాల్, లక్షద్వీప్ సముద్ర తీరాల్లోనూ ఇలాంటి దృశ్యాలను ఇదివరకు కనిపించాయి.
ఉడుపి జిల్లాలోని మట్టు బీచ్, అండమాన్ నికోబార్‌లోని రాధానగర్ బీచ్, గోవాలోని పాలోలెమ్ బీచ్, పశ్చిమ బెంగాల్ ఈస్ట్ మిడ్నాపూర్‌లోని మందార్‌మణి బీచ్, లక్షద్వీప్‌లోని బంగ్రం బీచ్‌లల్లో తరచూ అలలు ఇలా నీలం రంగులో మారుతుంటాయి. ఇప్పుడు తాజాగా విశాఖపట్నం-భీమిలీ తీరంలో మెరిశాయి. దీన్ని వింతగా తిలకించారు స్థానికులు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.












Click it and Unblock the Notifications