నయా నిజాం కేసీఆర్, జనం సాగనంపుతారు, జేపీ నడ్డా విసుర్లు
సీఎం కేసీఆర్‌పై కమల దళం ఆరోపణలు కొనసాగుతున్నాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఫైరయ్యారు. బండి సంజయ్ చేపట్టి ప్రజా సంగ్రామ పాదయాత్ర 3 విడతలు విజయవంతంగా పూర్తయిన సంగతి తెలిసిందే. అందుకోసం హన్మకొండలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్‌లో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభ నిర్వహించింది.పవిత్ర ఓరుగల్లుకు రావడం తన అదృష్టం జేపీ నడ్డా అన్నారు.

అంధకారంలో రాష్ట్రం..
టీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ అంధకారంలో ఉందని నడ్డా మండిపడ్డారు. తెలంగాణను చీకటి నుంచి బయటపడేసేందుకే సంజయ్ పాదయాత్ర చేపట్టారని గుర్తుచేశారు. టీఆర్‌ఎస్ సర్కార్‌ను సాగనంపడమే పాదయాత్ర ఉద్దేశం అని చెప్పారు. బీజేపీ సభకు ఆంక్షలు పెట్టారని మండిపడ్డారు. 144 సెక్షన్ చూపి జనం రాకుండా అడ్డుకున్నారని.. హైకోర్టు అనుమతితో సభ నిర్వహిస్తున్నామని తెలిపారు.

నయా నిజాం..
తెలంగాణ రాష్ట్రాన్ని నయా నిజాం దోచేస్తున్నారని నడ్డా ఫైరయ్యారు. మీర్ ఉస్మాన్ అలీఖాన్ బాటలో కేసీఆర్ నడుస్తున్నారు. ప్రజలు త్వరలో కేసీఆర్‌ను ఇంటికి పంపిస్తారని చెప్పారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ బందీ చేశారని.. కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్‌కు ఏటీఎంలా మారిందన్నారు. మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తామని వరంగల్ జైలును కూల్చారని ఫైరయ్యారు.

రూ.200 కోట్లు మాత్రమే ఖర్చుచేసి..
జల్ జీవన్ మిషన్ కింద తెలంగాణకు కేంద్రం 3,500 కోట్లు కేటాయింపులు చేసిందని తెలిపారు. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం రూ. 200 కోట్లు ఖర్చు చేసిందన్నారు. ఎంఐఎంకు భయపడి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం లేదన్నారు. అవినీతికి పాల్పడ్డ కేసీఆర్‌లో భయం మొదలైందని జేపీ నడ్డా అన్నారు.

అమ్మవారి సేవలో..
అంతకుముందు జేపీ నడ్డా, బండి సంజయ్ ఇక్కడి భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. కాళికా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి వచ్చిన జేపీ నడ్డా తదితరులకు అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం తీర్థప్రసాదాలను అందజేశారు. తర్వాత నడ్డా బాలసముద్రంలో ప్రొఫెసర్ వెంకట నారాయణ నివాసానికి వెళ్లారు. అక్కడ మరికొందరు ప్రొఫెసర్లతో భేటీ అయ్యారు.












Click it and Unblock the Notifications