జంగా రాఘవరెడ్డికి నాయిని రాజేందర్ రెడ్డి షాక్; కాంగ్రెస్ హై కమాండ్ కు అల్టిమేటం!!
వరంగల్ పశ్చిమ కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుల మధ్య వర్గ విభేదాలు మరొక మారు భగ్గుమన్నాయి. గత కొంతకాలంగా జంగా రాఘవరెడ్డి వర్సెస్ నాయిని రాజేందర్ రెడ్డి అన్నట్టుగా నడుస్తున్న హనుమకొండ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల అంతర్గత పోరు చిలికి చిలికి గాలివానగా మారింది. చివరకు నాయిని రాజేందర్ రెడ్డి జంగా రాఘవరెడ్డి ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేస్తూ తీర్మానం చేసి అధిష్టానానికి పంపే దాకా వెళ్ళింది అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఒకపక్క తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంటే, పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాల్సిన నాయకులు, ఆ పని మరిచిపోయి తగవులు ఆడుకోవడం, తన్నుకోవడం కాంగ్రెస్ పార్టీలో నిత్య కృత్యంగా మారింది. జనగామ మాజీ డిసిసి ప్రెసిడెంట్ జంగా రాఘవరెడ్డి వరంగల్ పశ్చిమ లో పాగా వేయాలని ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో, ఆయనను అడ్డుకోవడం కోసం నాయిని రాజేందర్ రెడ్డి బాహటంగానే ప్రతిఘటిస్తున్నారు. తనదైన శైలిలో తీవ్ర విమర్శలు చేస్తూ రాఘవరెడ్డి సంగతి ఏంటో తేల్చాలని రాష్ట్ర నాయకత్వం ముందు ఈ వివాదాన్ని అనేకమార్లు పెట్టారు. అయినప్పటికీ రాఘవరెడ్డి పంధా మారకపోవడంతో నాయిని రాజేందర్ రెడ్డి మరోమారు ఆయనపై మండిపడ్డారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ తో కలిసి తనకు వ్యతిరేకంగా వాల్ పోస్టర్లు అతికించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు జిల్లా అధ్యక్షుడిని తన అనుమతి లేకుండా జిల్లాలో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడని, వరంగల్ పశ్చిమ టిక్కెట్ తనకే వస్తుందని ప్రచారం చేసుకుంటున్నాడని మండిపడ్డారు. గతంలోనూ తాను జంగా రాఘవరెడ్డి పై అధిష్టానానికి ఫిర్యాదు చేశానని పేర్కొన్న నాయిని రాజేందర్ రెడ్డి పార్టీ పెద్దలు ఆయనకు షోకాజ్ నోటీస్ కూడా ఇచ్చారంటూ గుర్తు చేశారు.
జంగా రాఘవరెడ్డి వల్ల పార్టీ తీవ్రంగా నష్టపోతుందని పేర్కొన్న నాయిని రాజేందర్ రెడ్డి ఈ మేరకు సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కి నష్టం వాటిల్లే విధంగా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా, ఇతర పార్టీలకు మేలు చేసే విధంగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న జంగా రాఘవరెడ్డి ప్రాథమిక సభ్యత్వాన్ని తొలగిస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు తీర్మానం చేశామని, ప్రతిని అధిష్టానానికి పంపించామని, అక్కడ స్పందనను బట్టి తన రాజకీయ కార్యాచరణను ప్రకటిస్తానని వెల్లడించారు. ఇక ఇదే సమయంలో ఆయనో, తానో తేల్చాలని అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు. మరి ఈ వ్యవహారంలో అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటుంది? ఇద్దరి మధ్య గొడవ సద్దుమణగటం కోసం కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది? అన్నది తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications