తేడా వస్తే క్లోజ్ చేసుడే: చిట్ ఫండ్స్ సంస్థలకు క్లాస్ పీకిన వరంగల్ సీపీ!!
తేడా వస్తే క్లోజ్ చేసుడేనని చిట్ ఫండ్స్ సంస్థలకు క్లాస్ పీకిన వరంగల్ సీపీ చిట్ ఫండ్స్ ఖాతాదారులకు సకాలంలో చెల్లింపులు చెయ్యాలని సూచించారు.
వరంగల్ కమీషనరేట్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం వరంగల్ సిపి ఏ.వి రంగనాథ్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ట్రాఫిక్ ని క్రమబద్ధీకరించడానికి, కఠినంగా ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్న సిపి, వరంగల్ కమీషనరేట్ పరిధిలో భూ కబ్జాలు చేసే అక్రమార్కులకు చెక్ పెడుతున్నారు. ప్రజలకు నేరుగా అందుబాటులో ఉంటూ, ప్రజాసమస్యల పరిష్కారం కోసం వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇక ఇదే క్రమంలో వరంగల్ కమీషనరేట్ పరిధిలో ఇటీవల కాలంలో చిట్ ఫండ్ సంస్థల ఆగడాలపై అనేక ఫిర్యాదులను అందుకున్న నేపథ్యంలో చిట్ ఫండ్ వ్యవస్థలో అక్రమాలను నిర్మూలించడానికి రంగంలోకి దిగారు వరంగల్ సీపీ ఏ.వి రంగనాథ్.
చిట్ ఫండ్ కంపెనీల ఆగడాలపై రోజు రోజుకీ వరంగల్ పోలీస్ కమీషనర్ కు ప్రజల నుండి ఫిర్యాదులు వెల్లువగా మారడంతో, ఈ ఫిర్యాదులపై స్పందించిన పోలీస్ కమిషనర్ వరంగల్ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని చిట్ ఫండ్ సంస్థలకు చెందిన యాజమాన్యంతో వరంగల్ పోలీస్ కమీషనరేట్ కార్యాలయములో సమావేశాన్ని నిర్వహించి వారికి క్లాస్ పీకారు. చిట్ ఫండ్ ఖాతాదారులకు చేయవలసిన చెల్లింపులు ముందుగా సూచించిన సమయంలోనే చెల్లించాల్సిందిగా వరంగల్ పోలీస్ కమీషనర్ చిట్ ఫండ్ సంస్థల యాజమాన్యానికి సూచించారు.

వరంగల్ కమీషనరేట్ పరిధిలో ఎన్ని చిట్ ఫండ్ సంస్థలు ఉన్నాయి. ఆయా చిట్ ఫండ్ సంస్థలలో ఎంతమంది చిట్ ఫండ్ ఖాతాదారులు ఉన్నారు. వారికి చిట్ ఫండ్ సంస్థలు ఏ విధంగా చెల్లింపులు జరుపుతున్నాయి. అలాగే గతంలో చిట్ ఫండ్ సంస్థలపై నమోదయిన కేసుల్లో ఎంత మంది బాధితులకు చిట్ ఫండ్ యాజమాన్యం చెల్లింపులు చేసింది అన్న వివరాలను పోలీస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే అత్యధికంగా చెల్లింపులు చేయాల్సిన చిట్ ఫండ్ సంస్థల వివరాలను పోలీస్ కమీషనర్ తెలుసుకున్నారు.
చిట్ ఫండ్ సంస్థల నుంచి వచ్చిన నిర్వాహకులతో ఖాతాదారులకు డబ్బు చెల్లింపుకు జాప్యం వెనుక గల కారణాలను కూడా పోలీస్ కమీషనర్ చిట్ ఫండ్ యాజమాన్యాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీస్ కమీషనర్ మాట్లాడుతూ చిట్ ఫండ్ ఖాతాదారుల సమస్యలను పరిష్కరించే దిశగా ప్రత్యేక దృష్టి సారించినట్టు వెల్లడించారు. చిట్ ఫండ్ కంపెనీల కార్యకలాపాల గురించి, అలాగే ఇప్పటివరకు చిట్ ఫండ్ ఖాతాదారుల నుండి రావాల్సిన మొత్తానికి సంబంధించిన చిట్ ఫండ్ కంపెనీల వారిగా వివరాలను సేకరించి సంబంధిత పోలీస్ అధికారులకు అందజేయాలని సూచించారు.

చిట్ ఫండ్ కంపెనీలు డబ్బు చెల్లించించాల్సిన ఖాతాదారులకు సంబంధించి చిట్ ఫండ్ సంస్థలు అందజేసిన వివరాలను వరంగల్ పోలీస్ కమీషనరేట్ వెబ్ సైట్లో వుంచబడుతుందని, చిట్ ఫండ్ సంస్థలు ఇచ్చిన సమాచారంలోని బాధితులు కాకుండా మరే ఇతర బాధితులు ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందని, కావున సంస్థలు ఖచ్చితమైన సమాచారాన్ని అందజేయాలని పోలీస్ కమీషనర్ తెలిపారు.












Click it and Unblock the Notifications