వరంగల్ వర్ష బీభత్సం: నీటమునిగిన వందకు పైగా కాలనీలు; నగరంలో చాలాచోట్ల రాకపోకలు బంద్!!
వరంగల్ జిల్లాలో వర్ష బీభత్సం కొనసాగుతుంది.నిన్న రాత్రి నుండి మబ్బుకు చిల్లు పడినట్టే కుండపోతగా వర్షం కురుస్తోంది. గత నాలుగు రోజులుగా వరంగల్ జిల్లాలో కురుస్తున్న భారీ నుండి అతి భారీ వర్షాలతో ఓరుగల్లు అతలాకుతలమవుతోంది. వరంగల్ వాసులు చిగురుటాకుల్లా వణుకుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారుతోంది.
పస్రా నుండి తాడ్వాయి వెళ్ళే మార్గంలో గుండ్లవాగు రోడ్ కోతకు గురై నిలిచిపోయిన రాకపోకలు..!! pic.twitter.com/YtGSr8wWMB
— oneindiatelugu (@oneindiatelugu) July 27, 2023
వరంగల్ నగరంలోని బట్టల బజార్, పాపయ్యపేట చమన్, పాత బీటు బజార్, సుశీల్ గార్డెన్ పరిసర ప్రాంతాలు, వరంగల్ చౌరస్తా ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. వరంగల్ నగరంలోని హనుమకొండ కాజీపేట వరంగల్ ట్రైసిటీలు వర్షపు నీటిలో తేలియాడుతున్నట్టుగా కనిపిస్తున్నాయి. కరీంనగర్ హనుమకొండ ప్రధాన రహదారిలోని నయీం నగర్ నాలా ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి.

ఇప్పటికే వందలాది కాలనీలు నీట మునిగాయి. వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని కాశికుంట, ఎస్ఆర్ఆర్ తోట, సాకరాశి కుంట,డీకే నగర్, సాయి నగర్, ఎన్టీయార్ నగర్, ఎస్సార్ నగర్, అండర్ రైల్వే గేట్, గాంధీనగర్, గిరిప్రసాద్ నగర్, కాశిబుగ్గ, సంతోషమాత కాలనీ, బృందావన్ కాలనీలు మునిగిపోయాయి. రామన్నపేట, ఎల్.బి. కళాశాల ప్రాంతాలలో భారీగా వరద నీరు చేరుకుంది.
హంటర్ రోడ్ లోని అనేక కాలనీలు నీటమునిగాయి. అమరావతి నగర్ గోపాల్ పూర్ చెరువు ఉదృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఆ సమీప కాలనీలలో ఆందోళన నెలకొంది. మధురనగర్ కాలనీ, 19వ డివిజన్ లోని వివేకానంద కాలనీ, సాయి గణేష్ కాలనీ, శాంతినగర్ ప్రాంతాలు కూడా వరద ముంపుకు గురయ్యాయి. మొత్తం నగర వ్యాప్తంగా వందల కాలనీలు ముంపులో ఉన్నాయి.
నగరంలోని ప్రధాన రహదారుల పైన కూడా నాలాలు పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో ఎక్కడికి ఎక్కడ రాకపోకలు నిలిచిపోయాయి. నగరవ్యాప్తంగా పరిస్థితి దారుణంగా మారింది. వందల సంఖ్యలో కాలనీలు ముంపుకు గురికాగా ముంపు కాలనీల ప్రజలను ట్రాక్టర్ల సహాయంతో పునరావాస కేంద్రాలకు తరలించి వారికి అక్కడ వసతి కల్పిస్తున్నారు.
అయితే ఇదిలా ఉంటే హనుమకొండ జిల్లా కమలాపూర్,ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాల్లో బుధవారం రాత్రి నుండి కుండపోత వర్షం కురుస్తున్న కారణంగా కమలాపూర్ పోలీస్ స్టేషన్లోకి వర్షం నీరు చేరింది. పోలీస్ స్టేషన్ లోపలికి చేరిన వర్షపు నీటిని పోలీసు సిబ్బంది ఎత్తిపోస్తున్నారు. గతంలో ఎప్పుడు ముంపుకు గురికాని అనేక ప్రాంతాలు కూడా ఈసారి వర్షం దెబ్బకు ముంపుకు గురవుతున్న పరిస్థితి ఉంది.












Click it and Unblock the Notifications