హిందూపురంలో వైసిపి నేత దారుణ హత్య - సొంత పార్టీ నేతలపైనే..!!
సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో వైసీపీ నేత హత్యకు గురయ్యారు. నియోజకవర్గ మాజీ సమన్వయకర్తగా వ్యవహరించిన చౌళూరు రామకృష్ణారెడ్డిని ప్రత్యర్ధులు హత్య చేసారు. ఆయన ఇంటి మందే ఆయన పైన కారం పొడి చల్లి.. వేట కొడవళ్లతో విచక్షణా రహితంగా నరికి హత్య చేసారు. ఈ హత్య పట్టణంలో సంచలనం రేకెత్తించింది. రామకృష్ణారెడ్డి తన స్వగ్రామం సమీపంలో కర్ణాటక సరిహద్దు వద్ద డాబా నిర్వహిస్తున్నారు. ఆయన డాబా మూసివేసి, తన ఇంటికి చేరుకున్నారు. కారు దిగుతున్న సమయంలో కొందరు దుండగులు ఒక్క సారిగా ఆయన పైన దాడికి దిగారు.
కారం పొడి చల్లి.. వేట కొడవళ్లతో 18 సార్లు దారుణంగా నరికారు. రామకృష్ణారెడ్డి ఈ దాడితో తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు ఆయన్ను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే ఆయన మరణించారు. విషయం తెలిసిన వెంటనే స్థానిక వైసీపీ నేతలు..కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆస్పత్రికి తరలి వచ్చారు. అయిదుగు వ్యక్తులు మాస్కులు ధరించి రెండు టూ వీలర్స్ పైన వచ్చారని స్థానికులు చెబుతున్నారు.

వచ్చిన వారిలో ఇద్దరు వాహనాల పైనే కూర్చొని ఉండగా, ముగ్గురు దాడికి దిగారని స్థానికుల నుంచి పోలీసులు సమాచారం సేకరించారు. ఆ తరువాత వారంతా పరారయ్యారు. ఈ దారుణ హత్యకు ఎమ్మెల్సీ ఇక్బాల్, ఆయన పీఏ గోపీకృష్ణ, చౌళూరి రవికమార్, హిందూపురం రూరల్ సీఐ జిటి నాయుడు లే కారణమని రామకృష్ణారెడ్డి తల్లి లక్ష్మీనారాయణమ్మ ఆరోపిస్తున్నారు.
ఎమ్మెల్సీ పీఏ పైన ఆరోపణలు చేయటంతో పాటుగా గ్రామీణ మండల సీఐ పైన బాలల హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసారని చెబుతున్నారు. ఆగస్టు 15న గ్రామంలో జెండా ఆవిష్కరణ సమయంలో ఎమ్మెల్సీ వర్గీయులకు - రామకృష్ణారెడ్డి మధ్య వివాదం చోటు చేసుకుంది. ఆ సమయంలో చంపుతామంటూ బెదిరించారంటూ ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. రామకృష్ణారెడ్డిని తాతా మాజీ ఎమ్మెల్యే. ఇప్పుడు ఈ హత్య పైన వస్తున్న ఆరోపణలతో పోలీసులు విచారణ ప్రారంభించారు.పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ లోనే వుంచారు. ఇప్పుడు ఈ హత్య జిల్లాలో కలకలం రేపుతోంది.












Click it and Unblock the Notifications