• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సీమ కథాకేతనం ఎగరేసిన కేతు

By Staff
|

చికాగో: తెలుగునాట వివిధ ప్రాంతాల మధ్య వున్న అభివృద్ధి అసమానతల్ని సహనంతో అర్థం చేసుకునే కథలు ఇటీవలి మంచి పరిణామని, ఇలాంటి కథల వల్ల ఆయా ప్రాంతాల మంచిచెడులతో పాటు వాటి మధ్య సాంస్కృతిక సంబంధాలు గట్టిపడతాయని ప్రముఖ కథా రచయిత ప్రొఫెసర్‌ కేతు విశ్వనాథరెడ్డి చికాగోలో శనివారం జరిగిన సాహితీ మిత్రుల సభలో అన్నారు. కేతు విశ్వనాథ రెడ్డి అమెరికా పర్యటన సందర్భంగా చికాగోలో సాహితీ మిత్రులు కేతు కథా సాహిత్య చర్చకి ఏర్పాటు చేసిన ఈ సభకు చికాగో నుంచి మాత్రమే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో అమెరికా తెలుగువారు హాజరయ్యారు. సభకు రాణీ సంయుక్త అధ్యక్షత వహించారు.

చాలా కాలంపాటు సీమ, తెలంగాణలది తక్కువ రకం భాష అనే అభిప్రాయంతో ఆ భాషల్ని కేవలం హాస్య పాత్రలకి మాత్రమే వుపయోగించేవారనీ, తను కథలు రాసే తొలినాళ్లలో కూడా ఇలాంటి భావన వుండేదని, దానికి లోపల్లోపల చాలా బాధపడి, బాధపడడం వల్ల కాక ఆ భాషకి సాహిత్య గౌవరం తీసుకురావడం వల్లనే అలాంటి భావన పోతుందన్న స్థిరాభిప్రాయంతో తాను సీమ భాషని ప్రత్యేకించి కథల్లో వాడడం మొదలెట్టానని కేతు అన్నారు. అయితే సాహిత్యం వల్ల సమాజం మారిపోతుందన్న భ్రమ తనకి లేదని, కాని తను చూసిన జీవితాన్ని మరింత అర్థం చేసుకోవడానికి, ఇతరులకు అర్థం చేయించడానికి కథ రాశానని ఆయన చెప్పారు. చిన్పప్పటి నుంచీ ఎదురైన అనుభవాలు వొట్టి కథలుగానే చెప్పడమా, అనుభవాలతో పాటు సంస్కారాన్ని, సంస్కారంతో పాటు దృక్పథాన్ని ఎంత మేరకి చెప్పాలన్నది ప్రధానమైన సమస్య అని, కాని కథ రాసేటప్పుడు అవన్నీ కలగలసిపోతాయని ఆయన తన కథా రచనానుభవాన్ని వివరించారు. తను ప్రధానంగా చేసిన పని సీమ అనుభవాన్ని చర్చకి పెట్టడమేనని, ఆ ప్రయత్నం సఫలమైందనడానికి అమెరికా తెలుగువాళ్లలో జరుగుతున్న చర్చే నిదర్శనమని ఆయన అన్నారు.

ఇక దృక్పథపరంగా - స్త్రీలనీ, దళితుల్ని, ముస్లింలని ఓటు బ్యాంకులుగా కాకుండా మనుషులుగా చూడడం అవసరమనీ, తను రాసిన కథల్లో సీమ అనుభవాలతో పాటు ఈ విధమైన ఇతివృత్తాలు తీసుకోవడం ఒక ఉద్వేగపూరితమైన బాధ్యతగా భావించానని ఆయన చెప్పారు. ఎక్కడ వున్నా, ఎలా వున్నా జీవితాన్ని మరింత ప్రేమించే సంస్కారాన్ని పెంచడమే రచయితగా తన వుద్దేశమని ఆయన అన్నారు.

కేతు విశ్వనాథరెడ్డి కథలపై జరిగిన చర్చలో పాల్గొంటూ ప్రముఖ విమర్శకుడు, అనువాదకుడు ప్రొఫెసర్‌ వేల్చేరు నారాయణరావు - రాయలసీమ భాషకి సాహిత్యంలో ఒక శాశ్వతత్వాన్ని తీసుకువచ్చిన రచయిత కేతు అని అభినందించారు. ఏదో రాజకీయ దృక్పథం కథల్లో రాసి తీరాలని భావిస్తున్న కాలంలో కేతు కథల్లో వాడిన సీమ తెలుగు తన ప్రాణానికి హాయిగా వినిపిస్తుందని, చాలా రకాల రాజకీయ వాదాల ఆవేశాలు తగ్గిపోయాక కూడా మిగిలే గొప్ప కథలు కేతు రాశారని ఆయన అన్నారు. కథా సాహిత్యంతో పాటు వివిధ వచన ప్రక్రియల్లో చేసిన రచనలు కేతుని తెలుగు సాహిత్యంలో, సంస్కృతిలో విశిష్ట మేధావిగా నిలబెడతాయని వేల్చేరు అన్నారు.

ప్రముఖ విమర్శకులు డాక్టర్‌ అఫ్సర్‌ కేతు కథా చర్చని ప్రారంభిస్తూ రాయలసీమ సామాజిక నేపథ్యం కేతుని కథారచయితగా మలిచిందని, 1940-60ల మధ్య సామాజిక ఆర్థిక పరిణామాల్ని అర్థం చేసుకున్నప్పుడే కేతు కథా సాహిత్యం విలువ అర్థమవుతుందని అన్నారు. సీమ కరవునీ, ఆర్థిక దుస్థితిని మాత్రమే కాకుండా సీమలోని ఉమ్మడి సాంస్కృతిక జీవన విలువల్ని చెప్పడం ద్వారా సాహిత్యంలో సీమ అస్తిత్వానికి కేతు కొత్త నిర్వచనాన్ని ఇచ్చారని ఆయన అన్నారు. సీమ పల్లె - పట్నాల జీవనంలో కలగలిసిపోయిన ఆత్మీయ భావనని కేతు కథలు బలంగా చెబుతాయని, కేతు కథల్ని చదవడం అంటే సీమలోని ప్రతి వూరినీ, ప్రతి రైతు బిడ్డనీ చూసి వచ్చినట్టేనని ఆయన అన్నారు. వ్యావసాయిక జీవనంతో పాటు సీమలో వివిధ కులమతాల సాంస్కృతిక జీవితంలోని ఐక్యభావనని చెప్పడం, అవి సామాజిక సందర్భాల్లో ఎలాంటి పాత్ర పోషిస్తాయో చెప్పడం ద్వారా కేతు తెలుగు కథకి కొత్త కోణాల్ని తీసుకువచ్చారని ఆయన చెప్పారు.

తెలుగు సాహిత్యంపై కేతు ఇంగ్లీషులో రాసిన వ్యాసాల్ని చికాగో సాహితీ మిత్రుడు డాక్టర్‌ బి. రెడ్డి విశ్వనాథ విశ్లేషించారు. ఈ వ్యాసాలు చదివినప్పుడు సాహిత్య చరిత్రని చెప్పడంతో పాటు వాటి వెనుక వున్న దృక్పథాలు ఎంత ముఖ్యమో మనకు అర్థమవుతుందని రెడ్డి విశ్వనాథ అన్నారు.

కేతు కథల్లోని స్త్రీ పాత్రల్ని విశ్లేషిస్తూ ప్రముఖ రచయిత్రి కల్పనా రెంటాల కేతు నానమ్మ నుంచి తీసుకున్న స్ఫూర్తి ఆయన కథల్లోని ప్రతి స్త్రీ పాత్రలోనూ కనిపిస్తుందని అన్నారు. 1980కి ముందు కంటే ఆ తర్వాత రాసిన కథల్లో స్త్రీ పాత్రలు బలంగా వుండడానికి ఆయన స్త్రీవాదం నుంచి తీసుకున్న ప్రేరణ ప్రధానంగా కనిపిస్తుందని ఆమె అన్నారు. కేతు సృష్టించిన చాలా పాత్రలు ఆయన వ్యక్తిత్వంలో ఇంకిపోయి, తిరిగి కథల్లోకి జీవం పోసుకున్నట్టు వుంటాయని, కేతు కథాదృక్పథ విస్తృతి వల్ల కొత్తగా వస్తున్న వివిధ ధోరణులు ఆయన ఇతివృత్తాల్లో సహజంగా ప్రతిబింబిస్తాయని కల్పన అన్నారు.

వామికొండ కథలు రాస్తా: కేతు

చాలా కాలంగా రాయాలనుకొని, వాయిదా వేస్తూ వచ్చిన వామికొండ కథల్ని తిరిగి రాయడం మొదలు పెట్టాలన్న ప్రేరణ ఈ చర్చ తరవాత దొరికిందని తన కథలపై చర్చ అనంతరం సమాధానమిస్తూ కేతు అన్నారు. వామికొండ కథలు తన సాహిత్య వ్యక్తిత్వంలోని భిన్నమైన కోణాన్ని ఆవిష్కారిస్తాయన్న విశ్వాసం తనకి వుందని ఆయన అన్నారు. ఇలాంటలి ప్రేరణ ఇచ్చినందుకు ఆయన చికాగో సాహిత్య మిత్రులకి ధన్యవాదాలు తెలిపారు.

అమెరికాలో ఇటీవలి కాలంలో తెలుగు సాహిత్య చైతన్యం పెరిగిందనీ, చాలా చోట్ల ఇలాంటి సమావేశాలతో పాటు, తెలుగు సాహిత్య రీడింగ్‌ క్లబ్బులు ఇప్పుడు ఏర్పడుతున్నాయని రాణీ సంయుక్త అన్నారు. జూన్‌ నెలలో వేల్చేరు నారాయణరావు అనువాదాలపై చర్చ చికాగో సాహిత్య మిత్రుల తరవాతి కార్యక్రమంగా ఆమె ప్రకటించారు. సాహితీ మిత్రుల తరఫున వేల్చేరు కేతు విశ్వనాథరెడ్డిని సన్మానించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు, సాహిత్యాభిమానులు రవిరెడ్డి, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కవులు ముద్రకోల అశోక్‌, అనంత్‌ ఊటుకూరు తదితరులు కవితాపఠం చేశారు. ఈ సభకి తొలుత జయదేవ్‌ మెట్టుపల్లి స్వాగతం పలకగా, ప్రకాష్‌ తిమ్మాపురం వందన సమర్పణ చేశారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more