తెలంగాణపై ప్రధానికి ఎన్నారైల వినతి
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సానుకూలంగా ప్రతిస్పందించాలని అమెరికాలోని తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం (టిడియఫ్) ట్రస్టీస్ చైర్మన్ టి. రామచంద్రారెడ్డి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను కోరారు. ఈ మేరకు ముంబాయిలో జరిగిన ఆసియా సొసెటీ సమావేశంలో ఆయన ప్రధానికి ఒక వినతిపత్రం అందజేసినట్లు టిడియఫ్ అధ్యక్షుడు మధు కాకులవరం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ వినతిపత్రంపై టి. రామచంద్రారెడ్డితో పాటు మధు కె. రెడ్డి సంతకాలు చేశారు. 2004 సెప్టెంబర్‌లో అమెరికా పర్యటన సందర్భంగా ప్రధానికి తెలంగాణ ఎన్నారైలు ఈ అంశంపై ఒక వినతిపత్రాన్ని అందజేసిన విషయాన్ని వారు గుర్తు చేశారు. ఒక రాష్ట్రంగా ఏర్పడడానికి కావాల్సిన సామర్థ్యం, వనరులు తెలంగాణకు ఉన్నాయని వారన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఎజెండాపై తెలంగాణ ప్రజలు గత ఎన్నికల్లో యుపిఎను గెలిపించారని, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం నిరీక్షిస్తున్నారని వారన్నారు. ప్రస్తుత ప్రభుత్వం వేగంగా నిర్మిస్తున్న పోతిరెడ్డిపాడు, పోలవరం ప్రాజెక్టుల వల్ల తెలంగాణకు నష్టం జరుగుతుందని వారు ప్రధానికి ఫిర్యాదు చేశారు. పోలవరం వల్ల తెలంగాణలోని 250 గిరిజన గ్రామాలు ముంపునకు గురవుతాయని, ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణలో ఒక ఎకరం కూడా నీరు పారదని వారన్నారు. తెలంగాణలో తలపెట్టిన ప్రాజెక్టుల నిర్మాణానికి చొరవ తీసుకోవాలని వారు ప్రధానిని కోరారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవాలని వారు ప్రధానికి విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications