Startup Revolution: ఉద్యోగాల కోసం కాదు.. కంపెనీలు పెట్టేందుకే! టాప్ కాలేజీల్లో కొత్త ట్రెండ్..!
భారత్ లో సరికొత్త స్టార్టప్ విప్లవానికి (Startup Revolution) ప్రీమియర్ విద్యాసంస్థలు దిక్సూచిగా మారుతున్నాయి. దేశంలో వేగంగా వృద్ధి చెందుతున్న స్టార్టప్‌ల వ్యవస్థాపకులలో అత్యధికులు ఐఐటీ మద్రాస్, ఐఐఎం అహ్మదాబాద్ విద్యార్థులేనని తాజా నివేదిక వెల్లడించింది. '2026 ఏఎస్‌కే ప్రైవేట్ వెల్త్ హురున్ ఇండియా చీతా ఇండెక్స్' ప్రకారం, అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో ఐఐటీ మద్రాస్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిలో ఐఐఎం అహ్మదాబాద్ అగ్రస్థానంలో నిలిచాయి. వచ్చే ఐదేళ్లలో 'యూనికార్న్'లుగా ఎదిగేందుకు సిద్ధంగా ఉన్న స్టార్టప్‌లను ఈ నివేదికలో చీతాలుగా పేర్కొన్నారు. 2021లో కేవలం 54గా ఉన్న ఈ చీతా స్టార్టప్‌ల సంఖ్య 2026 నాటికి 110కి చేరింది. ఈ స్టార్టప్‌ల మొత్తం విలువ సుమారు రూ.3 లక్షల కోట్లుగా ఉంది. ఇవి దేశవ్యాప్తంగా దాదాపు 1.10 లక్షల మందికి పైగా ఉపాధి కల్పిస్తున్నాయి.
అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో ఐఐటీ మద్రాస్ నుంచి అత్యధికంగా 13 మంది స్టార్టప్ వ్యవస్థాపకులు ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో ఐఐటీ బాంబే నుంచి 10 మంది, ఢిల్లీ యూనివర్సిటీ నుంచి 9 మంది ఉన్నారు. బిట్స్ పిలానీ, ఐఐటీ ఢిల్లీ, అన్నా యూనివర్సిటీల నుంచి ఎనిమిది మంది చొప్పున వ్యవస్థాపకులు విజయవంతంగా స్టార్టప్‌లను నడిపిస్తున్నారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ విషయానికి వస్తే ఐఐఎం అహ్మదాబాద్ అగ్రస్థానంలో నిలిచింది. ఇక్కడి నుంచి ఏడుగురు వ్యవస్థాపకులు విభిన్న రంగాలు ఎంచుకున్నారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB) నుంచి ఆరుగురు, ఐఐఎం లక్నో నుంచి ఐదుగురు వ్యవస్థాపకులు ఈ జాబితాలో నిలిచారు. పార్క్ ప్లస్ వ్యవస్థాపకుడు అమిత్ లఖోటియా, స్టాంజా లివింగ్ వ్యవస్థాపకుడు సందీప్ దాల్మియా ఇక్కడి పూర్వ విద్యార్థులే.

అలాగే భారతదేశంలో స్టార్టప్ కేంద్రంగా బెంగళూరు తన హవాను కొనసాగిస్తోంది. అత్యధికంగా 36 చీతా స్టార్టప్‌లతో బెంగళూరు మొదటి స్థానంలో నిలవగా, జాతీయ రాజధాని ప్రాంతం (NCR) 25 స్టార్టప్‌లతో రెండవ స్థానంలో, ముంబై 16 స్టార్టప్‌లతో మూడవ స్థానంలో ఉన్నాయి. పూణె, చెన్నై, అహ్మదాబాద్ కూడా స్టార్టప్ కేంద్రాలుగా వేగంగా ఎదుగుతున్నాయి. ఒకప్పుడు కేవలం సాఫ్ట్‌వేర్, ఈ-కామర్స్ రంగాలకే పరిమితమైన భారత స్టార్టప్ రంగం ఇప్పుడు విభిన్న రంగాలకు విస్తరిస్తోంది. ఫిన్ టెక్, సాస్ (SaaS) రంగాలు అగ్రస్థానంలో ఉన్నప్పటికీ, క్లీన్‌టెక్, ఏరోస్పేస్, డిఫెన్స్ వంటి అత్యాధునిక సాంకేతిక రంగాలలో కొత్త స్టార్టప్‌లు దూసుకుపోతున్నాయి. స్కైరూట్ ఏరోస్పేస్, ఆస్ట్రోటాక్ వంటి సంస్థలు నేరుగా యూనికార్న్ హోదాను సాధించడం విశేషం.
కేవలం ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో చదవడం మాత్రమే కాకుండా, మార్కెట్ అవసరాలను గుర్తించి వినూత్న పరిష్కారాలను చూపడమే స్టార్టప్‌ల విజయ రహస్యమని నివేదిక స్పష్టం చేస్తోంది. సరైన ప్రణాళిక, కస్టమర్ల నమ్మకం, కొత్త ఆవిష్కరణలే ఈ యువ పారిశ్రామికవేత్తలను అంతర్జాతీయ స్థాయిలో విజయపథంలో నడిపిస్తున్నాయి.














Click it and Unblock the Notifications
