మెటా న్యూ ఏఐ టూల్: 24/7.. రోజువారీ అన్ని పనులూ చేస్తుంది.. !!
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ లో సోషల్ మీడియా దిగ్గజం మెటా ఓ నూతన టూల్ ను డెవలప్ చేసింది. సాధారణ చాట్‌బాట్‌ల తరహాలో ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడమే కాకుండా, యూజర్ల రియల్ టైమ్ పనులను ఆటోమేటెడ్ గా పూర్తి చేయగల అడ్వాన్స్‌డ్ ఏఐ ఏజెంట్.. మ్యూజ్ (Muse) ను లాంచ్ చేసింది. ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో మరింత పైచేయి సాధించే క్రమంలో మెటా తీసుకువచ్చిన ఈ అప్లికేషన్.. డిజిటల్ అసిస్టెంట్ పరిధిని మరింత విస్తరించినట్టయింది.
ఈ మ్యూజ్ సహాయంతో యూజర్లు రోజువారీ పనులను సులభంగా పూర్తి చేయవచ్చు. ఈమెయిల్స్ రాయడం, ట్రావెలింగ్ టికెట్లు బుకింగ్, రోజువారీ క్యాలెండర్ మేనేజ్మెంట్, ఆన్‌లైన్ షాపింగ్ వంటి పనులన్నింటినీ మ్యూజ్ స్వయంగా చేయగలదు. జస్ట్.. ఒక్క మాట చెబితే చాలు.. వీటన్నింటినీ మన ముందు ఉంచగలదు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న చాట్‌బాట్‌లకు పూర్తి భిన్నం. అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడమే కాకుండా, దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనకు తెలిసిన భాషల్లో అందిస్తుంది.

ప్రస్తుతం అమెరికాలో సీనియర్ సిటిజన్లకు మాత్రమే పరిమితంగా అందుబాటులోకి వచ్చిన ఈ మ్యూజ్ ఏఐ టూల్ త్వరలో అన్ని దేశాల్లోనూ లాంచ్ చేయనున్నట్లు మెటా చీఫ్ మార్క్ జుకర్‌బర్గ్ తెలిపారు. మ్యూజ్ ఆవిష్కరణ సందర్భంగా ఆయన మాట్లాడారు. యూజర్ల వ్యక్తిగత అవసరాలను స్పష్టంగా అర్థం చేసుకునేలా దీన్ని తీర్చిదిద్దినట్లు చెప్పారు. భవిష్యత్తులో మానవాళికి సహాయకారిగా ఉండే పర్సనల్ సూపర్ ఇంటెలిజెన్స్ దిశగా ఓ ముందడుగు వేసినట్లుగా అభివర్ణించారు.
మానవ ప్రమేయం చాలా తక్కువగా అవసరం అయ్యే ఈ ఏఐ ఏజెంట్.. యూజర్ల ప్రొడక్టివిటీని పెంచుతుందని, సమయాన్ని ఆదా చేస్తుందని పేర్కొన్నారు. ఈ టూల్ లాంగ్వేజ్ మోడల్ ఆధారంగా పనిచేస్తుందని, యూజర్లు దీన్ని ఓ ప్రత్యేక యాప్ ద్వారా లేదా నేరుగా వాట్సాప్ చాట్ విండో ద్వారా కూడా యాక్సెస్ చేయవచ్చని వివరించారు. డిజిటల్ అసిస్టెంట్ గా వ్యవహరిస్తుందని, యాప్‌ను క్లోజ్ చేసిన కూడా.. మనం ఇచ్చిన సూచనల ఆధారంగా బ్యాక్‌గ్రౌండ్‌లో అది పని చేస్తూనే ఉంటుందని పేర్కొన్నారు.
సెక్యూరిటీ, ప్రైవసీకి పెద్దపీట వేశారిందులో. దీనికోసం మ్యూజ్ సెక్యూర్ వీఎమ్ (Muse Secure VM) అనే ఓ ఐసోలేటెడ్ లైనక్స్ కంప్యూటర్ వ్యవస్థను వినియోగించినట్లు జుకర్ బర్గ్ తెలిపారు. యూజర్ల వ్యక్తిగత డేటా, లాగిన్ వివరాలు ఈ వర్చువల్ మెషీన్‌లోనే పూర్తిగా భద్రంగా ఉంటాయని, ఏయే అప్లికేషన్లకు మ్యూజ్ యాక్సెస్ కలిగి ఉండాలనేది పూర్తిగా యూజర్ల నిర్ణయాధికారం మీదే ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు.
డేటా దుర్వినియోగం కాకుండా ఉండటానికి మెటా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఆన్‌లైన్ లావాదేవీల విషయంలో మ్యూజ్.. యూజర్ల నుంచి అప్రూవల్ పొందిన తర్వాతే దానికి సంబంధించిన ప్రక్రియను కొనసాగిస్తుంది. సోషల్ మీడియా యాడ్స్ ద్వారా లభించే ఆదాయం కాకుండా డిజిటల్ అసిస్టెంట్స్, ఏఐ ద్వారా నూతన ఆదాయ మార్గాలను సృష్టించుకోవడంలో భాగంగా మెటా దీన్ని డెవలప్ చేసినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications
