• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అమెరికాలో తెలుగు కావ్యసుధా రసం

By Pratap
|

Telugu poems reverbarates in USA
డాల్లస్ ఫోర్ట్ వర్త్: ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక సమర్పించిన "నెల నెలా తెలుగు వెన్నెల" 61 వ సదస్సు ఆగష్టు 19, ఆదివారం అర్వింగ్ లోని ఓరీస్ ఇండియన్ రెష్టారెంటులో టాంటెక్స్ సంయుక్త కార్యదర్శి, తెలుగు సాహిత్య వేదిక సమన్వయకర్త జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం అధ్యక్షతన వైభవంగా జరిగినది. ద్విభాషా కోవిదులైన శ్రీ భారతం శ్రీమన్నారాయణ, అవధాన కేసరి డా. నరాల రామారెడ్డి, ‘అభినవ ఘంటసాల'డా. అక్కిరాజు సుందరరామకృష్ట వంటి సాహితీవేత్తలు ముఖ్యఅతిథులుగా సభ ఎంతో శోభాయమానంగా జరిగింది. డాల్లస్ ప్రాంతీయ తెలుగు భాషాభిమానులు అత్యంత ఆసక్తి తో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నన్నయ మహాభారతం నుండి అన్నవరపు రంగనాయకులు ఆలాపించిన పద్యాలతో కార్యక్రమం మొదలైనది.

సాహిత్య వేదిక కార్యవర్గ సభ్యుడు బిల్లా ప్రవీణ్ శ్రీ భారతం శ్రీమన్నారాయణను సభకు పరిచయం చేస్తూ, "వీరు ఆధునిక భావాలు కల్గి , సమాజంలో అందరిని సమ దృష్టి తో చూడగల్గిన సహృదయులు అని, ‘అపర శ్రీనాధ', ‘మహాకవి శేఖర', ‘ఉభయ భాషా పితామహ', ‘సంస్కృతాంధ్ర కవితా వాచస్పతి' - వీరికి సాహితీ అభిమానులిచ్చిన బిరుదులు" అని సభకు తెలిపారు. వీరి రచనలలో కొన్ని "శ్రీ వెంకటేశ స్తవము", "శ్రీ మాతృ గీతామృతము", "రమణాయనము" ,"కళ్యాణం-కమనీయం"అని తెలుపుతూ, భారతం శ్రీమన్నారాయణని వేదికమీదకు ఆహ్వానించగా, ఎం.వి.యల్. ప్రసాద్ పుష్పగుచ్చంతో ప్రసంగకర్తకు స్వాగతం పలికారు. శ్రీమన్నారాయణ తమ స్వీయకావ్యమైన "వివేక భారతము" ను సభకు పరిచయం చేసారు.

కారణజన్ముడు, అవతారమూర్తి, భారతీయ సంస్కృతిని ప్రపంచానికి పునః పరిచయము చేసిన దివ్యమూర్తియైన వివేకానందుని జీవిత చరిత్రను పద్యకావ్యంగా రాయగలగటం తనకెంతో ఆనందంగా ఉన్నదని తెలిపారు. తెలుగు సామెతలు నుడికారాలతో నిండి, సుమారు 850 పద్యాలతో కూడిన ఈ రమణీయ కావ్యం నుంచి కొన్నింటిని ఎంచుకుని వాటి విశేషాలను సభాసదులకు వివరించారు. వివేకానందుని శివుని అవతారంగా అభివర్ణిస్తూ వారు రాసిన సీసపద్యాలు, సభికులను విశేషముగా అలరించాయి. "దొడ్డి గుమ్మము వైపును ద్రోవ గాగ జొచ్చు నొకడు; మఱోక్కడు చొచ్చు వీధి వంక నున్న సింహద్వారపథము పట్టి, యిరువురును జేరుకొనువారె ఇంటిలోకి" అనే చక్కటి తేటగీతితో తమ ప్రసంగాన్ని ముగించారు. టాంటెక్స్ పూర్వద్యక్షులు కూచిభొట్ల ఆనంద మూర్తి, కూచిభొట్ల లలిత మూర్తి భారతం శ్రీమన్నారాయణ గారిని దుశ్శాలువతో సత్కరించారు.

పిమ్మట సాహిత్య వేదిక కార్యవర్గ సభ్యుడు డా. జువ్వాడి రమణ ముఖ్యఅతిథి డా. నరాల రామారెడ్డిని సభకు పరిచయం చేస్తూ " వీరు అతిపిన్నవయసులోనే కుమారసంభవం లాంటి సంస్కృత కావ్యాలను చదివారని, 15 సంవత్సరాల లేత ప్రాయంలో అవధానప్రక్రియను మొదలుపెట్టి సుమారు వెయ్యికి పైగా అవధానాలను ప్రపంచవ్యాప్తంగా చేసారని, ‘అవధాన కేసరి', ‘అవధాన కంఠీరవ' లాంటి బిరుదులతో పాటు దేశవిదేశాలలో ఎన్నో పురస్కారాలను అందుకున్నారని, ‘గాథాసప్తశతి' నుంచి హృదయోల్లాసం కలిగించే కవితాత్మకమైన మూడు వందల గాథలను ఎన్నుకొని ‘గాతాత్రిశతి' పేరిట సరస మధుర పద్య ప్రభందానుబంధం గావించారని" సభకు వివరించి డా. నరాల రామిరెడ్డిని వేదికమీదకు ఆహ్వానించగా, డా. పులిగండ్ల విశ్వనాథం ముఖ్య అతిథిని పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు.

డా. నరాల రామిరెడ్డిగారు "అవధానంలో ఆధునికత్వం" అనే అంశంపై ప్రసంగించారు. అవధానానికి ముఖ్యంగా ధార (flow), ధారణ (memory), ధిషణ(intellect), ధోరణి (style), ధైర్యం అను ఐదు 'ధ'కారాలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. అవధాని ప్రతిభకీ సమయస్ఫూర్తికీ, "దత్తపది" , "సమస్యాపూరణ" అనే అంశాలు ముఖ్యమైన గీటురాళ్లు అని తెలుపుతూ గతంలో వారు చేసిన అవధానాలలోని కొన్నిపూరణలను ఉదాహరణలుగా ఉటంకించారు. అవధానం అనేది అర్వాచీన సాహిత్యప్రక్రియ కాకపోయిన అవధాని అనే వాడికి అధునిక దృక్పథం, సమకాలీన సమాజంలోని సాధకబాధకాల గూర్చి విశేష అవగాహణ ఉండటం ఎంతో అవసరమన్నారు. కార్గిల్ యుద్ధాన్ని గురించి, ఓ మహిళా శ్రమజీవిని గురించి ఇంకా మరెన్నో వైవిధ్యభరితమైన సమస్యలకు సంబంధించిన వారి పూరణలు, సభాసదులను ఆద్యంతం అలరించి మంత్రముగ్ధులను చేసాయి. ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం ఉత్తరాధ్యక్షుడు మండువ సురేష్, ఉపాధ్యక్షుడు కాకర్ల విజయ మోహన్ ముఖ్య అతిథి డా. నరాల రామారెడ్డిని దుశ్శాలువతో సత్కరించారు.

పిమ్మట సాహిత్య వేదిక సమన్వయకర్త జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం ముఖ్యఅతిథి డా. అక్కిరాజు సుందర రామకృష్ణని సభకు పరిచయం చేస్తూ వీరు" బహుముఖ ప్రజ్ఞాశాలి అని, సంగీత, సాహిత్య, నాటక, చిత్ర, విద్యా రంగాలలో ఆరితేరిన వారని, కృష్ణ తులాభారం , తెనాలి రామలింగడు లాంటి పౌరాణిక నాటకాలలో వీరి పాత్ర బహుళ జానాదరణ పొందాయని తెలిపారు. "అమ్మతోడు", "విశ్వంతో ముఖాముఖీ" , "భీమలింగ శతకం", "శనీశ్వర శతకం" వంటి వైవిధ్య రచనలెన్నో చేసారని వివరించి డా. అక్కిరాజుని వేదికమీదకు ఆహ్వానించగా, ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం కోశాధికారి ఉప్పలపాటి కృష్ణారెడ్డి ముఖ్య అతిథికి పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు.

తరువాత డా. అక్కిరాజు సుందరరామకృష్ణ - "తెలుగు పద్యం - రంగ స్థలం, చలన చిత్రం" అనే అంశంపై ప్రసంగించారు. పద్యం అనేది జనబాహుళ్యానికి అర్థమయ్యేట్టు ఉండి పాడుకోటానికి వీలుగా ఉండాలని, జాషువా, ధాశరథి, కరుణశ్రీ లాంటి ఆధునిక పద్యకవుల ఆణిముత్యాలు దీనికి మంచి ఉదాహరణలు అని అభిప్రాయపడ్డారు. ముందుగా అక్కిరాజు స్వీయరచనలైన శనీశ్వర శతకము, రాజరాజరాజేశ్వరి శతకము కావ్యాలనుంచి కొన్ని పద్యాలను శ్ర్యావ్యముగా ఆలపించారు. పద్యాలకు వాడాల్సిన రాగాలు సందర్భాన్ని బట్టి మారుతుంటాయని, నాటకాలకూ సినిమాలకూ మధ్య రాగాలకు సంబంధించి ఎంతో వ్యత్యాసం ఉంటుందని వివరిస్తూ ఉదాహరణగా ఎన్నో ప్రఖ్యాతి గాంచిన పద్యాలను ఆలాపించి సభికులను విశేషంగా అలరించారు. టాంటెక్స్ పూర్వాధ్యక్షులు జగన్నాథ రావు, అమెరికా దేశపు మొట్టమొదటి అవధాని, డాల్లస్ నివాసి డా. పుదూర్ జగదీశ్వరన్ ముఖ్య అతిథి డా. అక్కిరాజు సుందర రామకృష్ణని దుశ్శాలువతో సత్కరించారు.

ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం అధ్యక్షులు శ్రీమతి గీత దమ్మన్న, పాలకమండలి ఉపాధిపతి డా. సి.ఆర్.రావు, సాహిత్య వేదిక కార్య వర్గ సభ్యులు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, డా. ఊరిమిండి నరసింహారెడ్డి, మల్లవరపు అనంత్, కాజ సురేష్, డా. జువ్వాడి రమణ, మద్దుకూరి చంద్రహాస్, బిల్లా ప్రవీణ్ ఈ సదస్సులో ప్రధాన ప్రసంగం గావించిన ముగ్గురు అతిథులకు జ్ఞాపికలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో టాంటెక్స్ కార్య వర్గ సభ్యులు చామకూర బాల్కి, చిట్టిమల్ల రఘు పాల్గొన్నారు.

స్థానిక తెలుగు భాషా సాహితీ ప్రియుడు కెసి చేకూరి ఇటీవలే పరమపదించిన భాషా నిపుణుడు, తెలుగు సాహిత్యం లో అగ్రగణ్యుడు ఆచార్య భద్రిరాజు కృష్ణముర్తి, బహుభాషా సాహితీవేత్త, కేంద్ర సాహిత్య అకాడమి పురస్కార గ్రహీత సామల సదాశివ సేవలను కొనియాడుతూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఒక నిమిషం పాటు మౌనం వహించారు.

వందన సమర్పణలో భాగంగా జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం విచ్చేసిన అతిథులకు, పాల్గొన్న భాషా సాహితీ ప్రియులకు, సదస్సు విజయానికి చక్కని వాతావరణం కల్పించిన ఒరీస్ ఇండియన్ రెష్టారెంటు యాజమాన్యానికి కృతజ్ఞతా పూర్వక అభినందనలు తెలియజేయడంతో తెలుగు సాహిత్య వైభవాన్ని అందరికీ పంచిన "నెల నెలా తెలుగు వెన్నెల" 61వ సదస్సుకు తెరపడింది.

English summary
As a part of TANTEX Nela Nela Vennela three eminent persinalities explained the importance Telugu Padyam and they also recited Telugu poems from their own writings.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X