• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అమెరికాలో కరుణశ్రీ కవిత్వంపై...

By Pratap
|
Talk on Karunasri literature in USA
డల్లాస్: ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక సమర్పించిన "నెల నెలా తెలుగు వెన్నెల" 66 వసదస్సు ఆదివారం జనవరి 20వ తేది స్థానిక ప్యారడైజ్ బిర్యాని పాయింట్ లో ఆ సంస్థ నూతన కార్యదర్శి, 2012 సంవత్సరపు సాహిత్యవేదిక సమన్వయ కర్త జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరిగింది. ప్రవాసంలో నిరాటంకంగా 66 నెలల పాటు ఉత్తమ సాహితీ వేత్తల నడుమ సాహిత్య సదస్సులు నిర్వహించడం ఈ సంస్థ విశేషం. డల్లాస్ ప్రాంతీయ భాషాభిమానులు, సాహితీ ప్రియులు అధిక సంఖ్యలో అత్యంత ఆసక్తితో ఈ సమావేశానికి విచ్చేసారు.

ఇటీవలే స్వర్గస్తులైన డా. పెమ్మరాజు వేణు గోపాలరావు ఆత్మకు శాంతి చేకూరాలని సభలో ఒక నిమిషం మౌనం పాటించారు. ఉత్తర అమెరికాలో తెలుగు సాహిత్యానికి భీష్మాచార్యుల వంటి గొప్ప రచయిత, కవి, తొలి అమెరికా తెలుగు పత్రిక సంస్థాపకులు, నాటక రంగ నిష్ణాతులు, నృత్య నాటక నిర్మాత, దర్శకులు, చిత్ర కారులు, ప్రపంచ ప్రసిధ్దిగాంచిన న్యూక్లియర్ శాస్త్రవేత్త అయిన డా. పెమ్మరాజు అకాల మరణం తెలుగు వారికి తీరని లోటు అని పలువురు ఆవేదన వ్యక్తపరుస్తూ వారితో తమకున్న అనుబంధాన్ని తెలియజేసారు. వెండితెర రారాజు, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, నటరత్న పద్మశ్రీ నందమూరి తారాకరామారావు 17వ వర్ధంతి సందర్భంగా కేసి చేకూరి తెలుగు జాతికి, భాషకు ఆయన చేసిన సేవలను కొనియాడి ఘనంగా నివాళులర్పించారు.

సాహిత్య సభ మొదటి భాగం స్వీయ రచనా పఠనంతో అత్యంత ఆసక్తికరంగా ముగిసింది. స్థానిక సాహితీ ప్రియులైన షేక్ నసీం, అలిశెట్టి ప్రభాకర్ కవితలను వినిపించగా, మద్దుకూరి విజయ్ చంద్రహాస్,నందివాడ ఉదయభాస్కర్ - డా. పెమ్మరాజు ప్రముఖ రచనలను గుర్తు చేసారు. స్వయాన "కరుణశ్రీ" జంధ్యాల పాపయ్య శాస్త్రి మనుమడు, స్థానిక సాహితీ ప్రియుడు జంధ్యాల శ్రీనాథ్ తమ తాతగారి సాహితీ ప్రస్థానం లో కొన్ని ప్రధాన ఘట్టాల దృశ్యమాలికను ప్రవేశ పెట్టారు. వైవిధ్య భరితమైన కవితలను తనదైన శైలి లో వినిపించి "తాతకు తగ్గ మనుమడు" అనిపించి, ఇటీవలే జరుపుకొన్న "కరుణశ్రీ" శత జయంతిని మళ్ళీ గుర్తు చేసారు.

పాలక మండలి పూర్వాధిపతి డా. ఆళ్ళ శ్రీనివాస్ రెడ్డి, డా. జువ్వాడి రమణ ప్రదర్శించిన "కరుణశ్రీ" కవితా ధారణ శక్తి అందరినీ విశేషంగా ఆకట్టు కొంది. కుమార్ వర్మ విరచిత "గాలి గోపురం" నుండి కవిత్వంలో శబ్దం యొక్క ప్రభావంపై మల్లవరపు అనంత్ విశ్లేషణతో స్వీయరచనా పఠనం నూతనోత్సాహంతో ముగిసింది.

టాంటెక్స్ నూతన ఉపాధ్యక్షుడు డా. ఊరిమిండి నరసింహారెడ్డి - కార్యక్రమ ముఖ్య అతిథిని పరిచయం చేస్తూ "వయసులో ఏడు పదులు నిండి నప్పటికీ ఏడేళ్ళ బాలుడి ఉత్సాహం ఆయనలో చూడొచ్చు. ప్రవాసంలో తెలుగు వారి బాగోగులు, తెలుగుభాషా సంస్కృతుల అభ్యున్నతి పట్ల ఆయనకున్న ఆసక్తి అనిర్వచనీయం. వాడ వాడలా "వైవి రావు" గా పిలవబడే ఈయనే మన "అమెరికా గుడివాడ" (టెంపుల్ -టెక్సస్) నివాసి, డా. యిమడబత్తుని వెంకటేశ్వర రావు" అని అన్నారు.

భద్రాచల రాముని సన్నిధిలో ప్రాధమికోన్నత విద్య, "కరుణశ్రీ" జంధ్యాల పాపయ్య శాస్త్రి శిష్యరికం, రెండు ఇంజనీరింగ్ పట్టాలు, జన్మభూమిలో పది సంవత్సరాల ఉద్యోగానుభవం... ఇవన్నీ ఒక ప్రవాహంలా చకచకా జరిగిపోయాయి. డెబ్బయ్యో దశకంలో ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికాలో అడుగుపెట్టిన వైవిరావు 1976 లో టెక్సస్ "వ్యవసాయ మరియు యాంత్రిక" విశ్వవిద్యాలయం నుండి డాక్టరేటు పట్టా పుచ్చుకున్న అనంతరం దాదాపు మూడు దశాబ్దాల కాలం పాటు టెక్సస్ రాష్ట్రంలో తయారీ పరిశ్రమకు వివిధ ఉన్నత హోదాలలో ఉత్తమ సేవలందించారు" అని అన్నారు.

"2006 లో వృత్తి కి స్వస్తి చెప్పి తమ సహధర్మచారిణి శ్రీమతి అంజలితో కలిసి ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సాహిత్య కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ, ఇతర నగర దేవాలయ నిర్మాణాలలో కీలక సలహాదారుగా సేవలందిస్తూ, ప్రపంచమంతా పర్యటిస్తూ, యోగసాధన, సజ్జన సాంగత్యా లతో తమ శేష జీవితాన్ని గడుపుతూ మన గుడివాడ "టెంపుల్ రావ్" తెలుగు వారి హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకొన్నారు" అని వివరించారు. డా. వైవి రావుని వేదికమీదకు ఊరిమిడి నరసింహారెడ్డి ఆహ్వానించగా, శ్రీ పులిగండ్ల విశ్వనాథం మరియు వారి శ్రీమతి శాంత గారు పుష్పగుచ్చంతో ప్రసంగకర్తకు స్వాగతం పలికారు.

"కరుణశ్రీ: నాపరిచయం, జ్ఞాపకాలు" అనే అంశం మీద డా. వైవి రావు తమ ప్రసంగాన్ని ప్రారంభించారు. గుంటూరు లోని ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో తమ మధ్యంతర విద్యాకాలంలో "కరుణశ్రీ" జంధ్యాల పాపయ్యశాస్త్రి స్వయాన తమకు తెలుగును బోధించిన గురువని, వారి కవిత్వము సులభమైన శైలిలో, సమకాలీన ధోరణిలో, చక్కని తెలుగు నుడికారముతో విన సొంపై యుండునని, అందునా కరుణ రస ప్రధానముగా చాలా కవితలు వ్రాసి, "కరుణశ్రీ" గా ప్రసిద్దులైనారని తమ చిన్ననాటి జ్ఞాపకాలను సోదాహరణంగా వివరించారు. ఖండకావ్యాలు తమ సొంతం చేసుకొని తమ ఎనిమిది దశాబ్దాల జీవితకాలంలో అత్యంత జనాదరణ పొందిన తెలుగు కవులలో ప్రముఖులైన కరుణశ్రీ మృదు మధురభాషిగా డా. వైవిరావు కొనియాడారు.

"రాష్ట్ర భాషా విశారద, ఉభయ భాషా ప్రవీణ "కరుణశ్రీ" తమ సుదీర్ఘ ఉపాధ్యాయ వృత్తిని అత్యంత ఆసక్తి తో నిర్వహించే వారని, విద్యార్ధి అవసరాలను క్షుణ్ణంగా పరిశీలించి ఎప్పటికప్పుడు చేయూత నందించడం లో వెనుకాడని స్నేహాశీలి" అని డా. వైవి రావు తమ అనుబంధాన్ని తెలియజేసారు. ఒక ప్రశ్నకు సమధాన మిస్తూ "కరుణశ్రీ" కవితలు సూర్య చంద్రులున్నంత కాలం తెలుగు వారి హృదయాలలో పదిలంగా ఉంటాయని అభిప్రాయపడ్డారు.

ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) నూతన అధ్యక్షుడు మండువ సురేష్, పాలక మండలి అధిపతి డా. సి.ఆర్ రావు సంయుక్తంగా దుశ్శాలువతో ముఖ్య అతిథి డాక్టర్. వైవి రావు గారిని సన్మానించారు. తెలుగు సాహిత్య వేదిక కార్యవర్గ సభ్యులు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, మల్లవరపు అనంత్, మద్దుకూరి విజయ్ చంద్రహాస్, షేక్ నసీం, కాజ సురేష్, డా. జువ్వాడి రమణ, శ్రీమతి సింగిరెడ్డి శారద మరియు డా. ఊరిమిండి నరసింహారెడ్డి సంయుక్తంగా ముఖ్య అతిధిని ఙ్ఞాపికతో సత్కరించారు.

2013 సంవత్సరానికి తెలుగు సాహిత్యవేదిక నూతన సమన్వయ కర్తగా బాధ్యతలు స్వీకరించిన శ్రీమతి సింగిరెడ్డి శారద గారిని జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం సభకు పరిచయం చేసారు. భాషా సాహిత్యాలకు పెద్దపీట వేస్తున్న సాహిత్య వేదిక కార్యవర్గాన్ని అభినందిస్తూ, 2013 సంవత్సరంలో సేవలందించడానికి ఆసక్తి ఉన్న స్వచ్చంద సేవకులను శ్రీమతి సింగిరెడ్డి శారద ఆహ్వానించారు. టాంటెక్స్ కార్యవర్గ సభ్యులు వీర్నపు చినసత్యం, సంయుక్త కార్యదర్శి ఉప్పలపాటి కృష్ణారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

తెలుగు సాహిత్య వేదిక కార్యవర్గ బృందం వందన సమర్పణ చేస్తూ ముఖ్య అతిథి డాక్టర్. వైవి రావుకి, విచ్చేసిన డా.రాఘవేంద్ర ప్రసాద్‌కి, తానా అధ్యక్షులు తోటకూర ప్రసాద్‌కి, ఎం.వి.ఎల్. ప్రసాద్‌కి, వివిధ సాహితీ ప్రియులకు, శ్రమించి సాయం చేసిన స్వచ్చంద సేవకులైన పున్నం సతీష్ కు అభినందనలు తెలిపారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telugu Association of North Texas (TANTEX) has organised talk on Karunasri literature at Dallas of USA.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more