డెట్రాయిట్‌లో తెలంగాణ వేడుక
డెట్రాయిట్: అమెరికాలోని తెలంగాణ ఎన్నారైలు సంబరాల్లో మునిగి తేలారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమవుతుందని తేలడంతో వారు వేడుకలు జరుపుకున్నారు. దాదాపు 300 మంది ఎన్నారైలు సంబరాల్లో తేలియాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాకారం కాబోతున్న తరుణంలో డెట్రాయిట్ తెలంగాణ కమ్యూనిటీ వేడుకలను ఏర్పాటు చేసింది.
శుక్రవారం 2వ తేదీన తెలంగాణకు చెందిన పలువురు ఎన్నారైలు వివిధ ప్రాంతాల నుంచి నోవీకి వచ్చారు. దాంతో పండుగ వాతావరణం నెలకొంది. రామగోపాల్ ఉప్పుల స్వాగతం చెప్పారు. తెలంగాణ అమర వీరులకు సంతాపం తెలియజేస్తూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.

వీక్షిత, విఖ్యాతి పల్లెర్ల జయ, జయ జయహో తెలంగాణ పాటను ఆలపించి, సభికులను ఆకట్టుకున్నారు. తమ సంస్థ పుట్టుక గురించి, అది నిర్వహించిన కార్యకలాపాల గురించి డిటిసి చైర్మన్ భరత్ మాదాడి వివరించారు. డిటిసి అధ్యక్షుడు నాగేందర్ ఐతా త్వరలో జరిగే బతుకమ్మ పండుగను విజయవంతం చేయాలని కోరారు.
గత 60 ఏళ్లుగా జరుగుతున్న తెలంగాణ ఉద్యమం గురించి హరి మారోజు వివరించారు. సాయి వైష్ణవి జై బోలో తెలంగాణ పాటను ఆలపించారు. తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ ఫోన్ ద్వారా సభను ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందుతుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ పునర్నిర్మాణంలో చురుకైన పాత్ర పోషించాలని ఆయన ఎన్నారైలను కోరారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) మహిళా విభాగం రాష్ట్రాధ్యక్షురాలు తుల ఉమ కూడా మాట్లాడారు.
డిటిసి బోర్డు సభ్యులు భరత్ మాదాడి, నాగేంద్ర ఐతా, వెంకట్ మంతెన, రామ్‌గోపాల్ ఉప్పుల, భుజంగరావు, శైలేంద్ర సానం, హరి పరాంకుశం, కాశీ కోట, రాజు బ్రహ్మాండభేరీ, తిరు వెంగంటి, సునీల్ మర్రి, వెంకట్ దేవర, శ్రీధర్ బండారు, మురళీ బొమ్మనవేని, విజయ్ భాస్కర్ పల్లెర్ల, శ్రీనివాస్ రాజు తదితరులు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేశారు.












Click it and Unblock the Notifications