అమెరికాలో తెలుగు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి
అమెరికాలో మరో తెలుగు వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి బుచ్చిబాబు (40) అమెరికాలో మృతి చెందారు. ముండ్లమూరు గ్రామానికి చెందిన దొద్దాల కోటేశ్వరరావు కుమారుడు బుచ్చిబాబు కాలిపోర్నియాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. వీకెండ్ కావడంతో శనివారం సాయంత్రం ఫ్యామిలీతో కలిసి సరదాగా బీచ్ కు వెళ్లారు.
ప్రమాదవశాత్తు బీచ్‌లో నీటమునిగి బుచ్చిబాబు మృతి చెందాడు. కుమారుడి మరణ వార్త విషయం తెలిసి అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. బుచ్చిబాబు మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు.

ఇటీవలే అమెరికాలో ఓ తెలుగు విద్యార్థి మృతి
తెలంగాణ రాష్ట్రంలోని హన్మకొండ జిల్లాకు చెందిన రాజేష్ ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. ఈ క్రమంలోనే అతడు ఐదు రోజుల క్రితం ప్రాణాలు కోల్పోయాడు. దీంతో రాజేష్ కుటుంబంతోపాటు ఆయన స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
వివరాల్లోకి వెళితే.. హన్మకొండ జిల్లా ఆత్మకూరుకు చెందిన ఏరుకొండ రాజేష్ ఉన్నత చదువుల కోసం తొమ్మిదేళ్ల క్రితం అమెరికాకు వెళ్లాడు. 2015లో ఎమ్మెస్ ట్రైనింగ్ చేసేందుకు వెళ్లిన రాజేష్.. ఐదు రోజుల క్రితం మృతి చెందినట్లు అతని స్నేహితులు కుటుంబసభ్యులకు తెలియజేశారు. దీంతో రాజేష్ కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
అయితే, రాజేష్ ఎలా మృతి చెందారనే విషయం తెలియాల్సి ఉంది. తమ ఆర్థిక పరిస్థితి బాగోలేదని.. రాజేష్ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు సాయం చేయాలని ప్రభుత్వానికి కుటుంబసభ్యులు విజ్ఞప్తి చేశారు. కాగా, తొమ్మిది నెలల క్రితం రాజేష్ తండ్రి మృతి చెందారు.
ఇటీవల కాలంలో భారతదేశం నుంచి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లిన పలువురు విద్యార్థులు, ఉద్యోగులు వివిధ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. ఉన్నత చదువులు, మంచి ఉద్యోగాల కోసం అమెరికాకు వెళ్లినవారు విగత జీవులుగా తిరిగి రావడంతో వారి కుటుంబాల్లో తీరని విషాదం నెలకుంటోంది.












Click it and Unblock the Notifications