అమెరికాలో ప్రమాదం: తెలుగు విద్యార్థి మృతి
న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్ నగరంలో మరో విషాద ఘటన చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బీలం అచ్యుత్ అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. న్యూయార్క్ స్టేట్ యూనివర్సిటీలో అచ్యుత్ విద్యనభ్యసిస్తున్నట్లుగా గుర్తించారు. బుధవారం సాయంత్రం ఈ ప్రమాద ఘటన చోటు చేసుకున్నట్లు అమెరికాలోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది.
న్యూయార్క్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థి అచ్యుత్ బైక్ ప్రమాదంలో బుధవారం మధ్యాహ్నం మృతి చెందాడని భారత కాన్సులేట్ జనర్లల్ ఎక్స్(ట్విట్టర్) వేదికగా వెల్లడించారు. అతడి అకాల మరణం గురించి తెలిసి చాలా బాధపడ్డామని తెలిపారు. బాధిత కుటుంబం, స్థానిక ఏజెన్సీలతో సంప్రదింపులు జరుపుతున్నామని పేర్కొన్నారు.

అచ్యుత్ మృతదేహాన్ని తిరిగి భారతదేశానికి పంపించేందుకు ఆ కుటుంబానికి సహాయ సహకారాలు అందిస్తామని కాన్సులేట్ జనరల్ పేర్కొన్నారు. ఉన్నత చదువుల కోసం వెళ్లిన కుమారుడు ఇలా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో అతని కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
కాగా, ఇటీవల కాలంలో అమెరికాలో పలువురు భారతీయ యువతీ, యువకులు వివిధ ప్రమాద ఘటనల్లో ప్రాణాలు కోల్పోవడం ఆందోళక కలిగిస్తోంది. కొద్ది రోజుల క్రితం అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. మృతులు శ్రీయ అవసరాల, ఆర్యన్ జోషి, అన్వీ శర్మగా గుర్తించారు.
అమెరికాలోని జార్జియా రాష్ట్రంలోని అల్ఫారెట్టాలో జరిగిన కారు ప్రమాదంలో ముగ్గురు భారతీయ సంతతికి చెందిన అమెరికన్ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రుల్ని ఆస్పత్రిలో చేర్పించారు. బాధితులంతా 18 ఏళ్ల వయసు గలవారు. జార్జియాలోని అల్ఫారెట్టాలోని మాక్స్‌వెల్ రోడ్‌కు ఉత్తరాన వెస్ట్‌సైడ్ పార్క్‌వేలో మే 14న ఈ ప్రమాదం జరిగింది. కాగా, గత ఏప్రిల్‌లో అమెరికాలో జరిగిన కారు ప్రమాదంలో గుజరాత్‌లోని ఆనంద్‌కు చెందిన ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. రేఖాబెన్ పటేల్, సంగీతాబెన్ పటేల్, మనీషాబెన్ పటేల్ మృతిచెందారు.












Click it and Unblock the Notifications