అమెరికాలో దుండగుడి కాల్పుల్లో తెలుగు యువకుడు మృతి
న్యూయార్క్: అమెరికాలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. దుండగుడు జరిపిన కాల్పుల్లో ఓ తెలుగు యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లాకు చెందిన దాసరి గోపీకృష్ణ (32)గా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. కర్లపాలెం మండలం యాజలికి చెందిన గోపీకృష్ణ ఉపాధి కోసం 8 నెలల క్రితం అమెరికా వెళ్లాడు. ప్రస్తుతం ఆర్కెన్సాస్‌లోని ఓ సూపర్ మార్కెట్‌లో పని చేస్తున్నాడు. శనివారం మధ్యాహ్నం గోపీకృష్ణ కౌంటర్‌లో ఉండగా.. ఓ దుండగుడు నేరుగా వచ్చి తుపాకీతో అతడిపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు.

ఈ క్రమంలో తీవ్ర గాయాలపాలైన గోపీ కృష్ణ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అనంతరం దుండగుడు షాప్‌లోని ఓ వస్తువు తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ తర్వాత గోపీకృష్ణను స్థానిక ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మరణించారు.
ఈ విషయం తెలుసుకున్న అతడి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గోపీకృష్ణ స్వగ్రామం యాజలిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. ఇటీవల కాలంలో దుండగుల కాల్పుల్లో, ఇతర ప్రమాదాల్లో అమెరికాలో ప్రాణాలు కోల్పోతున్న తెలుగువారి సంఖ్య పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది.

కాగా, తాజా కాల్పుల ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దుండగుడు కాల్పులు జరిపిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వాటి ఆధారంగా పోలీసులు నిందితుడిని పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు.












Click it and Unblock the Notifications