ఫిలిప్పీన్స్‌లో రోడ్డు ప్రమాదం: తెలంగాణ యువకుడు మృతి
ఫిలిప్పీన్స్ దేశంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లాకు చెందిన అక్షయ్ అనే విద్యార్థి మృతి చెందారు. ఫిలిప్పీన్స్‌లో ఎంబీబీఎస్ చదువుకుంటున్నాడు అక్షయ్. అయితే, అతడు బైక్ పై వెళ్తుండగా.. మరో వాహనం రాంగ్ రూట్‌లో వచ్చి ఢీకొట్టింది. దీంతో అక్షయ్‌కు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు.
మరో 6 నెలల్లో ఎంబీబీఎస్ పట్టా అందుకోనున్న తరుణంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో అతని కుటుంబంతోపాటు స్వగ్రామం వేల్పూరులో విషాదం నెలకొంది. అక్షయ్ మరణవార్త విని అతని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

అమెరికాలో గుండెపోటుతో ఏపీ విద్యార్థి మృతి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన విద్యార్థి ముత్తిన రమేశ్ అమెరికాలో గుండెపోటుతో మృతి చెందారు. రమేశ్ యూఎస్ లో ఎమ్మెస్ చేస్తున్నారు. మృతుడు నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలెంకు చెందినవాసిగా గుర్తించారు. రమేశ్ మృతి వార్త విని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. రమేశ్ మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకొచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని కోరారు.
గడిచిన నాలుగు నెలల్లోనే ఒకే నియోజకవర్గానికి చెందిన ముగ్గురు ఎమ్మెస్ విద్యార్థులు మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఇటీవల వివిధ కారణాలతో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. రోడ్డు ప్రమాదాలు, అక్కడి దేశస్థులు దాడులు చేయడంతో కొందరు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు నీటి సరస్సులలో పడి ప్రాణాలు వదిలారు.
మరోవైపు, కెనడా టొరంటోలో ఇటీవల తన పుట్టిన రోజునే సరస్సులో మునిగి ప్రవీణ్ అనే యువకుడు ప్రాణాలుకోల్పోయాడు. దీంతో అతడి మృతదేహాన్ని స్వస్థలం తీసుకురావాలని తల్లిదండ్రులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలని కోరాయి. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ 23న హైదరాబాద్ కు ప్రవీణ్ మృతదేహాన్ని తీసుకురానున్నారు.












Click it and Unblock the Notifications