అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మృతి..
అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మృతి చెందాడు. తెలంగాణ రాష్ట్రంలోని హన్మకొండ జిల్లాకు చెందిన రాజేష్ ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. ఈ క్రమంలోనే అతడు మూడు రోజుల క్రితం ప్రాణాలు కోల్పోయాడు. దీంతో రాజేష్ కుటుంబంతోపాటు ఆయన స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
వివరాల్లోకి వెళితే.. హన్మకొండ జిల్లా ఆత్మకూరుకు చెందిన ఏరుకొండ రాజేష్ ఉన్నత చదువుల కోసం తొమ్మిదేళ్ల క్రితం అమెరికాకు వెళ్లాడు. 2015లో ఎమ్మెస్ ట్రైనింగ్ చేసేందుకు వెళ్లిన రాజేష్.. మూడు రోజుల క్రితం మృతి చెందినట్లు అతని స్నేహితులు కుటుంబసభ్యులకు తెలియజేశారు. దీంతో రాజేష్ కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

అయితే, రాజేష్ ఎలా మృతి చెందారనే విషయం తెలియాల్సి ఉంది. తమ ఆర్థిక పరిస్థితి బాగోలేదని.. రాజేష్ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు సాయం చేయాలని ప్రభుత్వానికి కుటుంబసభ్యులు విజ్ఞప్తి చేశారు. కాగా, తొమ్మిది నెలల క్రితం రాజేష్ తండ్రి మృతి చెందారు.
ఇటీవల కాలంలో భారతదేశం నుంచి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లిన పలువురు విద్యార్థులు, ఉద్యోగులు వివిధ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. ఉన్నత చదువులు, మంచి ఉద్యోగాల కోసం అమెరికాకు వెళ్లినవారు విగత జీవులుగా తిరిగి రావడంతో వారి కుటుంబాల్లో తీరని విషాదం నెలకుంటోంది.












Click it and Unblock the Notifications