NRI News: చంద్రమోహన్‍కు సంతాపం తెలిపిన ఎన్నారైలు..
ప్రముఖ నటుడు చంద్రమోహన్ ఇటివల కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన తెలుగు, తమిళ సినిమాల్లో నటించి గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన మరణం పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలియజేయగా.. తాజాగా వంశీ ఇంటర్నేషనల్, శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్ సంస్థల ఆధ్వర్యంలో వర్చువల్ గా సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు, చంద్రమోహన్ కుటుంబసభ్యులు, వివిధ దేశాల తెలుగు సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
చంద్రమోహన్‌తో 21 సినిమాలకు దర్శకత్వం వహించిన ప్రముఖ సినీ దర్శకులు రేలంగి నరసింహారావు, చంద్రమోహన్ మేనల్లుడు, ప్రముఖ సినీ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్, కళాతపస్వి కె. విశ్వనాథ్ తనయుడు కాశీనాధుని నాగేంద్ర సహా పలువురు చంద్రమోహన్‌తో తమకున్న బంధాన్ని వివరించారు. చంద్రమోహన్ తో కలిసి పని చేయడం ఆనందంగా ఉందన్నారు.

వీరితో పాటు హైదరాబాద్ నుంచి హాస్యబ్రహ్మ శంకర నారాయణ, ప్రముఖ రచయిత్రి కేవీ కృష్ణకుమారి, అమెరికా నుంచి ప్రముఖ గాయని శారద ఆకునూరి, కువైట్ నుండి తెలుగు సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు సుధాకర్ కుదరవల్లి, సౌదీ అరేబియా తెలుగు సమాఖ్య నుండి మల్లేష్, అనిల్ కడించర్ల, ఉమామహేశ్వరరావు, మలేషియా నుంచి సత్య దేవి మల్లుల వర్చువల్ గా సభకు హాజరయ్యారు. చంద్రమోహన్‌కు ఘన నివాళులు అర్పించారు.
చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖరరావు ఆయన సినిమాల్లోకి వచ్చిన తర్వాత చంద్రమోహన్ గా పేరు మార్చుకున్నారు. చంద్రమోహన్ కృష్ణాజిల్లా పమిడిముక్కలలో 1945 మే 23న జన్మించారు.మేడూరు, బాపట్లలో చదువుకున్నారు. డిగ్రీ వరకు చదువుకున్న చంద్రమోహన్ ఏలూరులో వ్యవసాయ శాఖ ఉద్యోగిగా పనిచేశారు. ఆ తర్వాత సినీ రంగ ప్రవేశం చేశారు.












Click it and Unblock the Notifications