అమెరికాలో రాష్ట్ర విభజనపై సమావేశం
న్యూయార్క్: అమెరికాలోని ప్రవాసాంధ్రులు పీపుల్ ఫర్ లోక్‌సత్తా ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆంధ్రా, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలకు చెందిన పలువురు ప్రవాసాంధ్రులు హాజరయ్యారు. పీపుల్ ఫర్ లోక్ సత్తా డల్లాస్, బే ఏరియా, చికాగో ప్రాంతాల్లో రాష్ట్ర విభజనపై రౌండ్ టేబుల్ సమావేశాలు విజయవంతంగా నిర్వహించినట్లు లోక్ సత్తా నాయకులు తెలిపారు.
షాంబార్గ్‌లో ఏర్పాటు చేసిన ఈ రౌండ్ సమావేశంలో రాష్ట్రం సమైక్యంగా ఉండడం ఎంత ముఖ్యమైన అంశమనేది తెలియడజేయడం జరిగిందని తెలిపారు. శ్రీనివాస్ గుళ్లపల్లి, నాగ మెల్లింపూడిల ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి కమ్యూనిటీ నాయకుడు డా. చౌదరి జంపాల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రజల్లో అవగాహనక కల్పించి ముందుకు తీసుకువెళ్లేందుకు రాష్ట్రంలో సరైన నాయకుడు లేడని ఆయన అన్నారు. సామాన్య ప్రజల అభిప్రాయాన్ని రాష్ట్ర నాయకులు మంత్రుల బృందానికి తెలియజేయడం లేదని అన్నారు.

హైదరాబాద్‌ను కేంద్ర పాలితంగా చేయడాన్ని సమావేశం అంగీకరించలేదు. ఒక వేళ విభజన అనివార్యం అయితే జాతీయ స్థాయి కమిటీ నియమించి రెండు రాష్ట్రాల మధ్య వనరుల పంపకాలు జరగాలని సభ్యులు అభిప్రాయపడ్డారు. రాష్ట్రానికి చెందిన ప్రవాసాంధ్రులను ఒక్కచోట చేర్చి రాష్ట్ర విభజనపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేసేందుకు అవకాశం కల్పించిన పిఎఫ్ఎల్ చికాగో సభ్యులు నాగ మెల్లింపూడి, శ్రీధర్ మ్యాన, శ్రీను బత్తిన, శ్రవంతి యెలమంచిలి, కౌశిక్ ఇళ్లను ఎన్నారైలు అభినందించారు. సమావేశానికి హాజరైన ప్రవాసాంధ్రులకు, మీడియాకు పిఎఫ్ఎల్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
ఎన్నారైలకు ఓటింగ్ కల్పించేందుకు తాము చేసిన కృషిని, దండి మార్చ్-2, వారు చేపట్టిన ఇతర కార్యక్రమాల గురించి పిఎఫ్ఎల్ లాస్ ఏంజెల్స్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రాంతీయ అధ్యక్షుడు శ్రీపాల్ రెడ్డి వివరించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్ర ప్రాంతానికి కొత్త రాజధాని ఏర్పాటు చేస్తుందా అనే సందేహాన్ని సభ్యులు వ్యక్తం చేశారు. కొత్త రాజధాని ఏర్పడే వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండే అవకాశం ఉందని శ్రీకాంత్ కోమటిరెడ్డి తెలిపారు.
మరో సభ్యుడు ప్రసాద్ రాని మాట్లాడుతూ.. భౌగోళిక ప్రతికూలతల కారణంగా తెలంగాణ ప్రజల మాదిరిగా హైదరాబాద్‌ను తమ రాజధానిగా కోస్తా ప్రజలు భావించే అవకాశం ఉండకపోవచ్చని అన్నారు. రమేష్ కోటమూర్తి, ప్రసాద్ పాపుదేసిలు మాట్లాడుతూ.. విభజనతో రాయలసీమలో ఏర్పడే ఉద్యోగ, నీటి సమస్యల గురించి ప్రస్తావించారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికను పరిగణలోకి తీసుకుని విభజన సమయంలో వనరుల పంపకాన్ని చేపట్టాలని సభ్యులు అభిప్రాయపడ్డారు.
భవిష్యత్‌లో వచ్చే సమస్యలను వారు ప్రస్తావించారు. అశ్విని కుమార్ మెతుకు మాట్లాడుతూ.. మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్రా రాష్ట్రం ఏర్పడిన సమయంలో, తెలంగాణతో కలిపి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు జరిగిన తప్పులు ఇప్పుడు కాకుండా చూడాలని అన్నారు. ప్రాణహిత-చేవెళ్ల, ఇతర అసంపూర్తి ప్రాజెక్టులపై నందన్ పొట్లూరి ప్రస్తావించారు. మంచి వ్యక్తులు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని విజయ్ భాస్కర్ నెక్కంటి అభిప్రాయపడ్డారు. రెండు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాలకు అధికార వికేంద్రీకరణ, అభివృద్ధి జరగాలని చంద్ర నంగినేని అన్నారు.
పిఎఫ్ఎల్ తన 7వ వార్షికోత్సవం సందర్భంగా సమావేశంలో సభ్యులు కేక్ కట్ చేశారు. నాయకులు రమణ మొకిళ్ల, అమీర్ పట్టెం, శ్రీహరి అట్లూరి, ప్రవీణ, విజయ్ కసనగొట్టు, జవహర్ కంభంపాటి, వీరబాబు, రాజా ఐసోల, శ్రీకాంత్ కోచర్లకోట, వర్మ దంతులూరిలు హాజరయ్యారు. కాగా రజనీకాంత్ రావు యెర్రబెల్లి, రవీంద్ర నందం డల్లాస్, బే ఏరియాలో నిర్వహించిన సమావేశాలకు అధ్యక్ష వహించారు.












Click it and Unblock the Notifications