డల్లాస్‌లో రాష్ట్ర విభజనపై పిఎఫ్‌ఎల్ సమావేశం

రాష్ట్ర విభజనపై మూడు ప్రాంతాల ఎన్నారై నేతలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. సమావేశంలో ప్రధానంగా హైదరాబాద్‌పై చర్చించారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండాలా లేక వేరే ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయా అనే దానిపై వారి అభిప్రాయాలు తెలిపారు. ఉద్యోగ, ఆస్తుల భద్రత, విద్యా సంస్థలు పంచుకోవడం, సహజ వనరులు, విద్యుత్, నీటి పంపిణీ వంటి అంశాలపై సమస్యలు తలెత్తే అవకాశం ఉందని కొందరు నేతలు తెలిపారు. విభజనతో వచ్చే సమస్యలను పరిష్కరించే బాధ్యత ఎవరూ తీసుకుంటారు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పరిస్థితులపై ఎన్నారైల పాత్ర ఎలా ఉండాలనేదానిపై చర్చించారు.
విభజన తర్వాత రెండు రాష్ట్రాలకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ఉండాలన్న అంశంపై ఎన్నారై నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. కొందరు నేతలు ఆంధ్రా ప్రాంతానికి ప్రత్యేక రాజధాని ఉండాలని కోరగా, మరికొందరు హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని అన్నారు. హైదరాబాద్ ఆదాయాన్ని జనాభా ఆధారంగా పంచుకోవాలని, అప్పులను ఏ ప్రాంతంలో ప్రాజెక్టులకు వెచ్చించారో ఆ ప్రాంతానికి చెందేవిధంగా చూడాలన్నారు. అందరికీ ఉద్యోగ, వ్యక్తిగత ఆస్తుల రక్షణ కల్పించాలని కోరారు.
విద్యా సంస్థలలో విద్యార్థుల సంఖ్య ఆధారంగా కోటా ఉండాలని, సహజ వనరులైన నీటి పంపిణీ కోసం నిబంధనలుండాలని, అవి కేంద్రం నియంత్రణలో ఉండాలని కోరారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా అధికార వికేంద్రీకరణకు మద్దతు పలుకుతున్నట్లు తెలిపారు. పీపుల్స్ ఫర్ లోక్ సత్తా ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంపై పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. సమావేశం ఏర్పాటు చేయడాన్ని కొందరు సమర్థించగా మరికొందరు వ్యతిరేకించారు. సమావేశంలో డల్లాస్ పిఎఫ్ఎల్ సభ్యులు రజనీకాంత్ ఎర్రబెల్లి, రమణ జువ్వాడి పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications