పట్టాలెక్కిన కొత్త ఎక్స్‌ప్రెస్- జెండా ఊపిన మోదీ: ఎక్కడానికి కావాల్సిన అర్హతలు ఇవే
Pravasi Bharatiya Express: మరో ఎక్స్‌ప్రెస్ పట్టాలెక్కింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా పచ్చ జెండా ఊపి ఈ రైలును ప్రారంభించారు. ప్రవాస భారతీయుల కోసం ఉద్దేశించిన ప్రత్యేక రైలు ఇది. ప్రవాసీ భారతీయ ఎక్స్‌ప్రెస్‌గా దీనికి నామకరణం చేసింది రైల్వే మంత్రిత్వ శాఖ.
జాతిపిత మహాత్మా గాంధీ 1915 సంవత్సరంలో ఇదే తేదీన స్వదేశానికి తిరిగి వచ్చిన జ్ఞాపకార్థంగా మోదీ ఈ రైలును ప్రారంభించారు. 45 నుంచి 65 సంవత్సరాల వయస్సు గల పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్ (PIOs) మాత్రమే ఈ రైలులో ప్రయాణించగలరు. వారికి మాత్రమే ఇందులో ట్రావెల్ చేసే ఈ అవకాశం ఉంది.

భారతీయ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ సహకారంతో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ రైలును అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రవాసీ తీర్థ దర్శన్ యోజన కింద ప్రవాస భారతీయులు వారి మూలాలను గుర్తు చేయాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా ప్రవాసీ భారతీయ ఎక్స్‌ప్రెస్ సర్వీస్‌ను ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం.
అయోధ్య, పాట్నా, గయ, వారణాసి, మహాబలిపురం, రామేశ్వరం, మధురై, కొచ్చి, గోవా, ఏక్తా నగర్ (కేవాడియా- గుజరాత్), అజ్మీర్, పుష్కర్, ఆగ్రాకు ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది.
రైల్ టూరిజానికి సంబంధించిన అన్ని ఖర్చులను భారత ప్రభుత్వం భరిస్తుంది. అలాగే అర్హులైన పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్లు భారత్‌కు తిరిగి రావడానికి 90 శాతం మేర విమాన ఛార్జీలను భరిస్తుందని రాయబార కార్యాలయం తెలియజేసింది.
ప్రపంచవ్యాప్తంగా 35.4 మిలియన్ల మంది ప్రవాస భారతీయులు ఉన్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి అరుణ్ కుమార్ ఛటర్జీ చెప్పారు. వారిలో 19.5 మిలియన్ల మంది పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్లు ఉన్నారని, మిగిలిన 15.8 మిలియన్ల మంది ప్రవాస భారతీయులని అన్నారు.












Click it and Unblock the Notifications