భారతీయులకు స్కెంజెన్ వీసాలను నిలిపివేయలేదు: స్విట్జర్లాండ్ ఎంబసీ క్లారిటీ
న్యూఢిల్లీ: వీసాల అపాయింట్‌మెంట్‌లు నిలిపివేశారంటూ జరుగుతున్న ప్రచారంపై స్విట్జర్లాండ్ స్పష్టతనిచ్చింది. ఐరోపా సమాఖ్య దేశాల్లో వీసా ఆంక్షలు లేకుండా పర్యటించేందుకు జారీ చేసే వీసాల అపాయింట్‌మెంట్‌లు అక్టోబర్ వరకు నిలిపివేశారనే వార్తల్లో నిజం లేదని భారతదేశంలోని స్విట్జర్లాండ్ రాయబార కార్యాలయం వెల్లడించింది.
భారత పర్యాటక గ్రూపులకు స్కెంజెస్ వీసా(Schengen visa)లను నిలిపివేయలేదని.. కరోనా కంటే ముందుస్థాయిని దాటిందని తెలిపింది. భారత్-స్విస్ పౌరుల మధ్య బంధం ఎంతో ప్రధానమైందన్నారు. కాగా, భారత పర్యాటక బృందాలకు వీసా అపాయింట్‌మెంట్లను భారత్‌లోని స్విట్జర్లాండ్ ఎంబసీ నిలిపివేయలేదన్నారు.

సెప్టెంబర్ 2023 వరకు నిత్యం దాదాపు 800 అపాయింట్‌మెంట్‌లు ఉన్నాయని, ఇందులో 22 బృందాలు ఉన్నాయని తెలిపారు. 2019తో పోలిస్తే 2023లో ఇప్పటి వరకు అత్యధిక వీసాలను జారీ చేశామన్నారు. జనవరి నుంచి జూన్ వరకు 1.29 లక్షల దరఖాస్తులను పరిశీలించామని తెలిపారు. కోవిడ్ ముందుతో పోలిస్తే 7.8 శాతం ఎక్కువ అని పేర్కొంది. ఈ మేరకు భారతదేశంలోని స్విట్జర్లాండ్ ఎంబసీ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.
అంతేగాక, భారతీయుల వీసాల ప్రక్రియను ఈ ఏడాది మరింత సులభతరం చేసేందుకు ఎన్నో చర్యలు తీసుకున్నామన్నారు. ఇందులో మొదటిది.. ప్రయాణానికి ఆరు నెలల ముందుగానే వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. గతంలో ఇది కేవలం నెల మాత్రమే ఉండేది. లక్నోలో దరఖాస్తు కేంద్రాన్ని త్వరలోనే ఏర్పాటు చేస్తామని, దీంతో భారతదేశంలో ఈ కేంద్రాల సంఖ్య 13కు చేరుకుంటుందని స్విస్ ఎంబసీ పేర్కొంది. అంతేగాక, తమ భాగస్వామ్య విభాగం వీఎఫ్ఎస్ నుంచి దరఖాస్తు వచ్చిన తర్వాత గరిష్టంగా 13 రోజుల్లోనే వీసాపై ఎంబసీ నిర్ణయం వెలువడుతుందని తెలిపింది.
కాగా, ఐరోపా దేశాల మధ్య 90 రోజుల వరకు పర్యటించేందుకు వీలుగా స్కెంజెస్ వీసాలను జారీ చేస్తుంటారు. ఐరోపా సమాఖ్యలోని ఏదైనా సభ్యదేశం దీనిని జారీ చేస్తే.. దానిపై ఇతర యూరప్ దేశాల్లో పర్యటించేందుకు కూడా అనుమతి లభిస్తుంది. అందుకే ఈ వీసాలకు పర్యాటకుల నుంచి మంచి డిమాండ్ ఉంటుంది.












Click it and Unblock the Notifications