‘రైతన్నలూ.. ఆత్మహత్యలు వద్దు’: టిపిఏ(ఫొటోలు)
ఫిలడెల్ఫియా: తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కాలంలో పెరుగుతున్న రైతు ఆత్మహత్యలపై ఫిలడెల్ఫియా తెలంగాణ సంఘం సభ్యులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వం రైతుల ఆత్మహత్యల నివారణకు వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు.
దేశ ప్రజలందరికీ అన్నం పట్టే అన్నదాతకు అందరూ అండగా నిలబడాలని అన్నారు. రైతులందరూ ధైర్యంగా ఉండాలని, ఎవ్వరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. తామందరం అమెరికాలో ఉంటున్నప్పటికీ గ్రామీణ ప్రాంతాలకు చెందినవారమేనని చెప్పారు.

రైతు సంక్షేమం పట్టని ప్రభుత్వాల విధానాలు, వాతావరణం అనుకూలించకపోవడంతో రైతులు యాచకులుగా మారిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత వారం రోజుల్లోనే 9మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. ఈ సమయంలో రైతులకు మద్దతుగా నిలవాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు.
రైతులెవ్వరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరుతున్నట్లు తెలిపారు. కేంద్రం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు రైతుల ఆత్మహత్యలు నివారించేందుకు కృషి చేయాలని కోరారు. వారికి అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.

ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలకు ఆర్థికంగా సాయమందించాలని కోరారు. దేశానికి వెన్నెముకగా ఉన్న రైతులను ఆదుకునేందుకు ప్రవాసులందరు కూడా ముందుకు రావాలని ఈ సందర్భంగా ఫిలడెల్ఫియా తెలంగాణ సంఘం నేత రవి మేరెడ్డి విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ రైతు జేఏసి ఆధ్వర్యంలో ఫిలడెల్ఫియాలో సెప్టెంబర్ 19న ‘రైతు సంఘీభావ ప్రదర్శన' నిర్వహిస్తున్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications