అమెరికా రోడ్డు ప్రమాదంలో తెలంగాణ యువతి మృతి
వాషింగ్టన్: అమెరికాలో విషాద ఘటన చోటు చేసుకుంది. అగ్రరాజ్యంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ యువతి చనిపోయింది. మృతురాలు యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన గుంటిపల్లి సౌమ్యగా స్థానిక పోలీసులు గుర్తించారు. ఈ విషయాన్ని ఆమె కుటుంబసభ్యులకు తెలియజేశారు.
బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం.. సౌమ్య రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో అతివేగంతో వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే ఆమె మృతి చెందింది. సౌమ్య ఉన్నత చదువులు చదివేందుకు అమెరికా వెళ్లిందని కుటుంబసభ్యులు తెలిపారు.

చదువుతో పాటు పార్ట్‌టైం జాబ్ కూడా చేస్తుందని చెప్పారు. ఉన్నతస్థాయికి ఎదుగుతుందనుకున్న తమ కూతురు.. ఇలా రోడ్డు ప్రమాదంలో దూరం కావడంతో తల్లిదండ్రులు కోటేశ్వరరావు, బాలమణి, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతదేహాన్ని వీలైనంత త్వరగా ఇక్కడకు తీసుకొచ్చేందుకు సహకరించాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఇటీవల ఆస్ట్రేలియాలో తెలంగాణ యువకుడు అనుమానాస్పద మృతి
ఆస్ట్రేలియాలో రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌కు చెందిన అరటి అరవింద్ యాదవ్ (30) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. షాద్‌నగర్ బీజేపీ అరటి కృష్ణ ఏకైక కుమారుడు అరవింద్.. ఉద్యోగరీత్యా ఆస్ట్రేలియాలోని సిడ్నీలో స్థిరపడ్డాడు. ఐదు రోజుల క్రితం కనిపించకుండా పోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్వదేశానికి వచ్చేందుకు కుటుంబసభ్యులతో అరవింద్ ఏర్పాట్లు చేసుకున్నారని బంధువులు తెలిపారు.
ఆస్ట్రేలియాలో వాతావరణం పడకపోవడంతో ఇటీవలే తల్లి ఉషారాణి షాద్ నగర్ వచ్చింది. గత సోమవారం అరవింద్ కుటుంబంతో కలిస స్వగ్రామానికి వచ్చేందుకు విమాన టికెట్లు కూడా బుక్ చేసుకున్నాడు. అతడి భార్య గర్భిణి. కారు వాష్ చేయించుకుని వస్తానని చెప్పిన అరవింద్ తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలో సముద్రంలో ఓ యువకుడి మృతదేహం లభ్యమైందని స్థానిక పోలీసులు గుర్తించారు. డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి ఆ మృతదేహం అరవింద్ దేనని తేల్చారు. అతడిది హత్యా? లేక ఆత్మహత్యా అనేదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications