అమెరికాలో కాల్పులు: తెలుగు యువకుడు మృతి, కేంద్రమంత్రి విచారం
అమెరికాలో మరో తెలుగు యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాకు చెందిన యువకుడు మరో విద్యార్థి కాల్పుల్లు మృతి చెందాడు. చికాగో పెట్రోల్ పంప్‌లో ఖమ్మం జిల్లాకు చెందిన సాయితేజ నూకారపు(22)ను కాల్చి చంపారు. విషయం తెలుసుకున్న ఆయన కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాయి.
ఖమ్మం జిల్లా రామన్నపేటకు చెందిన సాయితేజ నాలుగు నెలల క్రితమే ఎంఎస్ చదివేందుకు అమెరికా వెళ్లాడు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత పైచదువుల కోసం సాయితేజ అమెరికాలో ఉంటున్నాడు. కాగా, పార్ట్‌టైమ్ జాబ్‌గా పెట్రోల్ బంకులో పనిచేస్తున్నాడు. కాల్పులు జరిపినప్పుడు మాత్రం డ్యూటీలో లేడు. తన స్నేహితుడికి సాయం చేస్తున్నాడు. ఆ సమయంలో కాల్పులు చోటు చేసుకున్నాయి.

అయితే, కాల్పులకు మాత్రం కారణాలు ఇంకా తెలియరాలేదు. సాయితేజ మరణవార్తతో శోకసంద్రంలో మునిగిపోయిన బాధిత కుటుంబసభ్యులను బీఆర్ఎస్ నాయకుడు మధుసూదన్ పరామర్శించారు. సాయితేజ మృతదేహాన్ని భారత్ తీసుకొచ్చేందుకు అధికారులతో మంతనాలు జరుపుతున్నారు. ఈ విషయంలో సహాయం కోసం తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(తానా) సభ్యులతో కూడా మాట్లాడినట్లు మధుసూదన్ తెలిపారు.
కేంద్రమంత్రి జైశంకర్ విచారం
సాయితేజ హత్య ఘటనపై విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. నిందితులపై వెంటనే చర్యలు తీసుకోవాలని షికాగోలోని భారత దౌత్య కార్యాలయం డిమాండ్ చేసింది. బాధిత కుటుంబానికి, స్నేహితులకు భారత కాన్సులేట్ అన్ని విధాలా సాయం అందజేస్తుందని ఎక్స్ వేదికగా వెల్లడించింది. కాన్సులేట్ ట్వీట్ కు స్పందిస్తూ.. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు కేంద్రమంత్రి జైశంకర్. భారత కాన్సులేట్ అన్ని విధాలా అండగా నిలుస్తుందని కేంద్రమంత్రి పేర్కొన్నారు.
కాగా, ఈ ఏడాది ప్రారంభం నుంచి అమెరికాలో దాడులు, కాల్పులు, ఇతర ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన ప్రవాస భారతీయులు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందినవారు ఎక్కువగా ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ వాసి మృతి చెందాడు. కాగా, ఈ ప్రమాద ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమబెంగాల్‌కు చెందిన రాం ఆశీశ్ కుటుంబం గత కొన్ని సంవత్సరాల క్రితం బతుకుదెరువు నిమిత్తం హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధి పద్మానగర్ ఫేజ్-2లో నివసిస్తోంది.
రాం ఆశీశ్‌కు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు సంతోష్ కుమార్ యాదవ్(27) రెండేళ్ల క్రితం ఎమ్మెస్ చేయటానికి అమెరికాలోని ఓహియో వెళ్లాడు. అయితే, నవంబర్ 17న రాత్రి సంతోష్ కుమార్ యాదవ్ తన స్నేహితుడితో కలిసి మరో స్నేహితుడిని కలవటానికి కారులో బయల్దేరారు. వీరు ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వచ్చిన మరో కారు బలంగా ఢీకొట్టడంతో సంతోష్ అక్కడికక్కడే మృతి చెందాడు. అతని స్నేహితుడికి స్వల్ప గాయాలు కావడంతో ప్రాణాలతో బయటపడ్డాడు.












Click it and Unblock the Notifications