స్కాట్లాండ్‌లో ట్రెక్కింగ్ కోసం వెళ్లి ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి
ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు యువకులు ఊహించని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. స్నేహితులతో కలిసి సరదాగా ట్రెక్కింగ్ కు వెళ్లిన యువకులు.. ప్రమాదవశాత్తు నీటిలో జారిపడి మృతి చెందారు. ఈ విషాద ఘటన స్కాట్లాండ్‌లో చోట చేసుకుంది.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. జితేంద్రనాథ్ కరుటూరి (26), చాణక్య బొలిశెట్టి (22) స్కాట్లాండ్‌లోని డూండీ యూనివర్సిటీలో మాస్టర్స్ చదువుతున్నారు. బుధవారం సాయంత్రం మరికొందరు భారత స్నేహితులతో కలిసి పెర్త్‌షైర్‌లోని 'లిన్ ఆఫ్ తమ్మెల్' కి వెళ్లారు. రెండు నదులు కలిసే ప్రాంతంలో వీరు ట్రెక్కింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు జారి నీటిలో పడి కొట్టుకుపోయారు.

ఘటనపై సమాచారం అందుకున్న సహాయక బృందాలు వెంటనే అక్కడకు చేరుకుని గాలింపు చేపట్టాయి. ఘటన జరిగిన ప్రదేశానికి కొద్ది దూరంలో వీరి మృతదేహాలను గుర్తించారు. ఈ ప్రమాదంపై లండన్‌లోని భారత హైకమిషనర్ స్పందిస్తూ.. మృతుల కుటుంబాలకు సమాచారం అందించామన్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను భారత్ కు పంపించే ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు.
తమ వర్సిటీ విద్యార్థులు మృతి చెందడం పట్ల డూండీ యూనివర్సిటీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. కాగా, జితేంద్రనాథ్ గతంలో అమెరికాలోని కనెక్టికట్ యూనివర్సిటీలో చదివినట్లు సమాచారం. మరో విద్యార్థి చాణక్య 2022లో హైదరాబాద్ జేఎన్టీయూలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications