వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాది ప్రేమచంద్‌ మార్గం

By Staff
|
Google Oneindia TeluguNews

బి.యస్‌. రాములు బతుకుపోరు నవల వెలువరించారు. పలు కథా సంపుటాలు వెలువరించారు. కథా సాహిత్య విమర్శనా గ్రంథాన్ని వెలువరించారు. తెలుగు సాహిత్యంలోని వివిధ ప్రక్రియలపై విరివిగా వ్యాసాలు రాశారు. 'బహుజన తత్వం' అనే సామాజిక శాస్త్ర గ్రంథాన్ని వెలువరించారు. ఆయనను తోటి కథారచయిత కాలువ మల్లయ్య ఇంటర్వ్యూ చేశారు. తెలంగాణ కథా సాహిత్యంపైనే ఈ విమర్శ సాగింది. ఆ ఇంటర్వ్యూను ఇక్కడ అందిస్తున్నాం.

తెలుగు కథా సాహిత్యంలో తెలంగాణ కథల పాత్ర ఏమిటి?
తెలుగు కథా సాహిత్యంలో తెలంగాణ కథల పాత్ర చాలా చిన్నది. కథా సాహిత్యం తెలంగాణా సాహిత్యం మొత్తం సాహిత్యంలో నిర్వహించిన పాత్ర బహుకొద్ది. ఆధునిక తెలుగు కథ పుట్టిన నుంచి ఈ వందేల్లలో సుమారు 2 లక్షలు కథలు వెలువడ్డాయి. ఇందులో ఐదు శాతం కూడా తెలంగాణ కథలు లేవు. పత్రికలు తెలంగాణ భాషను, జీవితాన్ని ప్రచురించకపోవడం ప్రధాన కారణం. అయితే తెలంగాణ కథ ప్రాధాన్యత చారిత్రకంగా, సామాజిక చరిత్రపరంగా ఎంతో ఉంది. ఇది రాశిలో తక్కవైనా వాసిలో గొప్పదిగా భారతీయ సాహిత్య ఆకాశంలో సమున్నతంగా తన విశిష్టతను ఎగరేస్తుంది. ప్రేమ్‌చంద్‌ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న తెలంగాణ ఇప్పటికీ అదే ఆదర్శవంతమైన మార్గాన్ని కొనసాగించడం తెలంగాణ ప్రజలందరూ గర్వించాల్సిన విషయం. మార్కెట్లో అమ్మకం సరుకుగా తెలంగాణ కథ ఎప్పుడూ దిగజారిపోలేదు. వందేండ్ల తెలంగాణ కత వందేండ్ల మొత్తం తెలంగాణ సామాజిక పరిణామాల్ని మన ముందు ఉంచలేకపోయినా సామాజిక పరిణామాలను, మానవసంబంధాల పరిణామాలను చరిత్రగా రికార్డు చేసి పెడుతున్నది. అదే దాని విశిష్టత.

తెలంగాణలో వచ్చిన కథా ధోరణుల గురించి వివరించండి.
సాహిత్యంలో వస్తుశిల్ప పరిణామం వచనకవిత, సాహిత్య విమర్శ, ప్రసంగం, సంపాదకీయ ప్రక్రియల్లో ఉన్నంత వేగం ఇతర ప్రక్రియల్లో సాధ్యం కాలేదు; కాదు. అందువల్ల వార్తాపత్రికల్లో ఉన్నంత వైవిధ్యం సంపాదకీయం, వచనకవిత, భావజాల రంగాల్లో కనిపిస్తుంది. కాని కథ నవల ప్రక్రియల్లో కనబడదు. ఇందుకు మరో కారణం కూడా ఉంది. కవిత, ప్రసంగం, సంపాదకీయం భావాల మీద, ఆశలు, ఆరాటాలు, ఊహల మీద ఆధారపడి వస్తువును, శిల్పాన్ని నిర్ణయించుకుంటుంది. పోస్ట్‌మార్టం, ప్రిడిక్షన్‌ రెండూ వాటిలో సాధ్యమవుతాయి. కథా సాహిత్యంలో ఈ రెండూ సాధ్యం కావు. ఒకవేళ వాటిని కృత్రిమంగా కథకులు సాధిస్తే ఈ కథలు వెలసిపోతాయి. వెలవెలా పోతాయి. ఉద్యమ సాహిత్యం ఇందువల్లనే తొందరంగా కాలంతో పాటు పాతబడుతుంది. ఉద్యమ కవిత్వం, పాట కూడా ఇలాగే పాతబడిపోయాయి. వాటిని ఇప్పుడు రాసినవాళ్లు కూడా చదవరనుకుంటాను. కత అలా కాకుండా కలకాలం నిలుస్తుంది. కథలో వస్తుశిల్ప వైవిధ్యం జీవితాన్ని పునాదిగా చేసుకొని ముందుకు సాగుతుంది. అంటే పోస్ట్‌మార్టం, ప్రిడిక్షన్‌, రిజల్ట్‌, జడ్జ్‌మెంట్‌ రెండు కాకుండా ప్రాసెస్‌ను, కథను, నవలను జీవిత పరిణామక్రమం వాస్తవికంగా ఉన్న తీరును చిత్రీకరించడం ద్వారా సాధ్యపడుతుంది. జీవితంలో మార్పులు వేగవంతమయ్యే తీరులోనే కథ, వస్తుశిల్పం పరిణామం చెందుతుంది అంతేగాని ఇతరదేశాల్లో ఉన్న వస్తుశిల్ప వైవిధ్యాన్ని కవిత, ప్రసంగం, పాటల్లో, సంపాదకీయంలో అనువదించుకున్నట్లుగా కథా సాహిత్యంలో అనువదించుకోవడం సాధ్యం కాదు. అయినప్పటికీ వస్తుపరంగా శిల్పపరంగా అద్భుతమైన ప్రయోగాలు తెలంగాణ కథలో దర్శనమిస్తాయి. మొదట గ్రామీణ జీవితాలు, తర్వాత మధ్యతరగతి, అటు తర్వాత బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజల జీవితాలు కథావస్తువులయ్యాయి. కొందరు ఉద్యమ భావజాలంతో ఉద్యమాలను, అందులో పాల్గొన్న ప్రజలను చిత్రీకరించే క్రమం తీసుకున్నారు. ప్రధానంగా మార్క్స్‌వాద, బహుజనవాద, మానవీయవాద, సాంప్రదాయక హిందూవాద ధోరణులు తెలంగాణ కథను తీర్చి దిద్దాయి. బీసీ, ఎస్సీ దృక్పథం, తెలంగాణ భాషాసాంస్కృతిక దృక్పథం తెలంగాణ కథను మరింత నిగ్గు దేర్చింది.

కథంటే సమగ్ర సామాజిక చిత్రీకరణ అనే మాటపై మీ అభిప్రాయం....
నా దృష్టిలో కథంటే సమగ్ర సామాజిక చిత్రణగా ఉండాలి. జీవితంలో, సమాజంలో వ్యక్తులు, కులాలు, వయసు గ్రూపులు, ఆర్థిక వ్యత్యాసాలు, సంఘర్షణ, వైరుధ్యాలు, వైవిధ్యాలు, భిన్నత్వంలో ఏకత్వం, ప్రజల ఆశలు, ఆశయాలు అన్నీ ఒక సమగ్రతలో జీవితంలో ఏ పార్శ్వాన్ని తీసుకున్నా చెప్పగలగాలి. మరో మాటలో చెప్పాలంటే ఏం జరిగిందో, ఎలా జరిగిందో, ఎందుకు జరిగిందో అది ఎందుకు అనివార్యమైందో దాన్ని రూపం, అంతస్సారం చిత్రిస్తూనే కథ, కథకులు ప్రజలకు జీవితం పట్ల ఆశను, విశ్వాసాన్ని, నైతిక ధైర్యాన్ని, మద్దతును ఇవ్వగలగాలి.

తెలంగాణ కథకు లేదా సాహిత్య విమర్శకు మీ కాంట్రిబ్యూషన్‌ ఏమిటి?
తెలంగాణ కథకు, సాహిత్య విమర్శకు నేను చేసిన కృషి నేను చెప్పడం కాకుండా మీలాంటి వాళ్లు అధ్యయనం చేసి విశ్లేషిస్తే బాగుంటుంది. తెలంగాణకత, సాహిత్య విమర్శ అభివృద్ధి కోసం రచయితగా, సామాజిక కార్యకర్తగా, రచయితల సంఘ నిర్మాతగా, తత్వవేత్తగా గత 25 యేళ్లుగా జీవితాన్ని అంకితం చేసిన విషయం మీకు తెలిసిందే. తెలుగు కథా సాహిత్యాన్ని, సాహిత్య విమర్శను, భారతీయ సాహిత్యంలో, ప్రపంచ సాహిత్య చరిత్రపటంలో సముచితంగా నిలబెట్టడమే నా లక్ష్యం. అందుకు మాకు స్ఫూర్తి, ప్రేరణ ఠాగూర్‌, ప్రేమ్‌చంద్‌, గోర్కీ, టాల్‌స్టాయ్‌, కిషన్‌చందర్‌, వట్టికోట ఆళ్వారుస్వామి మొదలైనవారు.

తెలంగాణ నుంచి వస్తున్న కథాసంపుటాలపై మీ అభిప్రాయం?
గత 20 యేళ్లుగా తెలంగాణ నుంచి అద్భుతమైన కథా సాహిత్యం వస్తున్నది. ఆళ్వారుస్వామి, దాశరథి రంగాచార్య, అంపవయ్య నవీన్‌ మొదలైనవారు ప్రధానంగా నవలలే రాసినప్పటికీ వాళ్లు తెలంగాణ కథా సాహిత్యానికి ఇచ్చిన స్ఫూర్తి గొప్పది. తెలంగాణలో చాలాకాలం దాకా కథను, నవలను, వేరువేరు ప్రక్రియలుగా చూడలేదు. నవలను కూడా కథగానే స్వీకరించారు. ఇది అర్థం కాకపోతే తెలంగాణ సాహిత్యాన్ని అర్థం చేసుకోవడంలో విఫలం అవుతారు. మా తరం వచ్చేసరికి కతలు ఎక్కువ రాసి, నవలలు తక్కువ రాయడం ప్రారంభమైంది. ఇది కూడా పత్రికలు సమాజం విధించిన పరిమితే. తెలంగాణ పత్రికలు, తెలంగాణా వాళ్లు కీలకస్థానంలో ఉన్న పత్రికలు తగ్గిపోవడం వల్ల తెలంగాణకథ కొంత కాలం తెరచాటుకు వెళ్లిపోయింది. ఇటీవల 20 యేళ్లుగా తెలంగాణ నుంచి సుమారు వంద కథా సంపుటాలు వెలువడ్డాయి. అయితే తెలంగాణ నుంచి రచయితలు ఎక్కువగా ఉన్నా రచనలు తక్కువ వచ్చాయి. ఉదాహరణకు మీలాగా అంత వేగంగా, అంత వైవిధ్యంతో రాశిలో వాసిలో ఒక 20 మంది కథకులు రాసినా ప్రపంచ సాహిత్య దృష్టిని మనం ఆకర్షించగలుగుతాం. అందువల్ల విస్తృతంగా రాయడం, కథా సంపుటాలను వెలువరించడంతో పాటు ఇతర భాషల్లోకి అనువాదం అయ్యేట్టు చూసుకోవాలి. అందుకు కేరళలో లాగా రచయితల సహకార ఉద్యమం నిర్మించాలి. ప్రతి కథా సంపుటి మళయాలం, తమిళంలో లాగా 50 వేల కాపీలు కాకపోయినా కనీసం పది వేల కాపీలయినా అమ్మేటట్టు చేయగలగాలి. అప్పుడు రచయితలు పూర్తి కాలపు రచయితలుగా మారడం సాధ్యమవుతుంది. అందుకు ఇంటింటా గ్రంథాలయాల ఉద్యమాన్ని వేగవంతం చేయాలి.

తెలంగాణ కథా భవిష్యత్తు ఎలా వుంటుంది?
తెలంగాణ కథా భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. ఆరేళ్లలోపే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా రూపు దిద్దుకుంటుంది. తెలంగాణ భాషాసంస్కృతి పత్రికల్లో, రేడియోలో, పాఠ్యపుస్తకాల్లో, టీవీల్లో, సినిమాల్లో విరివిగా వ్యాప్తిలోకి వస్తుంది. తద్వారా ఇప్పటి దాకా అణచివేయబడిన లేదా ఫెమినిస్టులు చెప్పినట్టు ఇంతదాకా 'భావాలే పుట్టనిదశ'కు నెట్టివేయబడ్డ తెలంగాణ ప్రజల్లోంచి ఉవ్వెత్తున స్వేచ్ఛాతరంగాలు, స్వాతంత్ర్య పిపాస, జాతీయ స్థాయిలో ఎదగాలనే పోటీ పెరుగుతుంది. తెలంగాణా రచయితలే పాఠ్య పుస్తకాల్లో, సినిమాల్లో, టీవీల్లో, పత్రికల్లో కనబడితే వేలు లక్షలుగా ప్రజలు కవులు, కళాకారులు, సాహిత్యకారులుగా ఉత్తమశ్రేణి పాఠకులుగా ఎదుగుతారు. ఎప్పుడైతే తెలంగాణ భాష, జీవితం, సంస్కృతి పాఠ్యపుస్తకాల ద్వారా ప్రజలకు చేరువవుతుందో అప్పుడు ప్రజలకు తమ జీవితం పట్ల, తమ భాష పట్ల, తమ రచయితల పట్ల గొప్పభావం, గొప్ప ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. అది మరెందరికో స్ఫూర్తినిచ్చి కొత్త సాహిత్యాన్ని సృష్టించే వారిని సృష్టిస్తుంది.

తెలంగాణ బహుజన దళిత కథా సాహిత్యం పరిస్థితి ఎలా వుంది? మహారాష్ట్రలో లాగా దళిత సాహిత్యం వస్తున్నదా? అంబేడ్కర్‌ ప్రభావం ఏమిటి?
తెలంగాణ కథా సాహిత్యంలో ఉద్యమం సాహిత్యం ప్రభావం ఎక్కువ. భావజాలాల సంఘర్షణ ఇతర ప్రాంతాలలో కన్నా తెలంగాణలో ఎక్కువ. అందువల్ల ఆంధ్ర మహాసభ, తెలంగాణ రైతాంగ పోరాట కాలంలో దళిత కథలు ఎక్కువ రాలేదు. ఆ తర్వాత 1990 దాకా కూడా దళిత కథ ఒక ఉద్యమంగా లేదు. 1990 నుంచి బీసీ, ఎస్సీ, ఎస్టీల జీవితాలు ఎక్కువగా చిత్రించబడుతున్నాయి. 1993లో దళిత రచయితల కళాకారుల మేధావుల ఐక్య వేదిక ఏర్పడిన తర్వాత తెలుగునాట దళిత కత, నవల, వచనకవిత, పాట, తత్వశాస్త్రం, సాహిత్య విమర్శ రంగాల్లో పుంజుకున్నాయి. మార్క్సిజం ప్రభావం నుంచి నిర్దిష్ట దేశీయ స్థలకాల కుల పరిణామాలను చిత్రీకరించడంలో బౌద్ధ అంబేడ్కర్‌ భావధారలు ఎంతో స్ఫూర్తినిచ్చాయి. మరాఠీ దళిత సాహిత్యాన్ని రాశిలో వాసిలో తెలుగు దళిత సాహిత్యం అందుకోవలసి ఉన్నప్పటికీ వస్తు విశ్లేషణలో, గాఢతలో తెలంగాణ సాహిత్యాన్ని అధ్యయనం చేసి మరాఠీతో పాటు భారతీయ సాహిత్యం స్వీకరించవలసింది ఎంతో ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X