పార్ట్-40
ఆఫీసులో అడుగు పెట్టాడో లేదో సీనియర్ జర్నలిస్టు రమాకాంత్ వ్యంగ్యంగా పలకరించాడు.
''మీ దళిత బహుజన నాయకుడు కాన్షీరామ్ ఏం చేశాడో తెలుసా?'' అని అడిగాడు.
రాంరెడ్డి ఏమీ మాట్లాడలేదు. ''నువ్వు పొడిచాస్తారనుకున్న శివుడు, మరికొంత మంది పార్టీకి రాజీనామా చేశారు. ఇదేమన్నా ఉత్తరప్రదేశ్ అనుకున్నావా? బీహార్ అనుకున్నావా? ఇక్కడ కమ్యూనిస్టులకు కూడా కులం ఉంది తెలుసా?'' అని అన్నాడు.
కాన్షీరామ్ ప్రతిపక్ష నాయకుడ్ని కలవడం, తదనంతర పరిణామాలన్నీ రాంరెడ్డికి అర్థమవుతూనే ఉన్నాయి. అందుకే శివుడ్ని ఆ పార్టీలో చేరవద్దని హెచ్చరించింది.
రాంరెడ్డికి చాలా పిచ్చిగా ఉంది. మనసంతా వికలమైంది. ఈ దేశంలో విప్లవం రాదు. సామాజిక పరిణామ దశలు వెర్రితలలు వేస్తాయి.
ఆ ఉద్యమాలను అడ్డుపెట్టుకుని కొంత మంది కెరీర్ కోసం, తాజాగా ఎన్‌జివోలతో డబ్బులు దండుకుంటారు. సమాజం గురించి ఆలోచించడం, దానికి సరైన దారి వెతకడం తెలుగు సమాజంలో కత్తి మీద సాములాంటిది. నోరు తెరిస్తే, చేయి పెట్టి రాస్తే కనిపించని ఇనుప సంకెళ్లు పడతాయి. మాట్లాడకూడదు, రాయకూడదు. ముఖ్యంగా ఆలోచించకూడదు.
ఆలసిపోయిన రాంరెడ్డి కుర్చీలో కూర్చొని అసెంబ్లీ రిపోర్టు రాయడం మొదలు పెట్టాడు.












Click it and Unblock the Notifications
