నిరాడంబరతనే నిలువెల్లా ధరించి, ధ్వనించే అస్తిత్వం
నిజమయిన సాహిత్య జీవులందరి మాదిరే అతను కూడా అంకెలను కాక, అక్షరాలను ప్రేమిస్తాడు.
చతురోక్తులూ, ఛలోక్తులను చెలా'మనీ' చేసుకోక, సిసలైన కవులందరి తరహాలోనే అతను కూడా చేదునిజాలే చెబుతుంటాడు.
అసలైన సమాజ ప్రేమికులందరి తీరునే అతను సైతం పిడికెడుమంది మేధావుల పుస్తకాలను కాక అసంఖ్యాక (అ)సామాన్య జనం మస్తకాలను ప్రామాణికంగా పరిగణిస్తుంటాడు.
అచ్చమైన యథార్థ వాదులందరి ధోరణిలోనే అతనూ, మెచ్చుకోళ్ళ మచ్చుమందు చల్లకుండా అప్రియ సత్యాలనే వచిస్తుంటాడు.
ఇన్ని మాటలు అనవసరం- ప్రస్తుతం కవిత్వం మాత్రమే రాస్తూ, జీవిస్తున్న అత్యల్ప సంఖ్యాకుల్లో అతనొక్కడంటే సరిపోతుంది.
''ఆకులందున అణగి మణగి కవిత కోకిల పలుకవలెనోయ్'' అన్న మహాకవి వాక్యానికి అక్షరాలా నిర్వచనప్రాయంగా ఉంటాడతను.
అంతా అతన్ని ఉండవల్లి సూర్యచంద్ర రావు అంటారు.
అతను మాత్రం తనను తాను ''వి- రాగి'' అని పిల్చుకుంటాడు.
క్రీస్తు శకం 1959కి తెలుగు సాహిత్య చరిత్రలో ఏం ప్రాముఖ్యంఉందో నాకు వెంటనే గుర్తు రావడంలేదు. అయితే అదే సంవత్సరం 'వి-రాగి' పుట్టాడు కనక, అలాటిదేమన్నా ఉండేఉండాలి మరి. పశ్చిమ గోదా'వరి' జిల్లా తణుకు పట్టణం శివారు గ్రామం వేల్పూరు. ఆఊరు అనేక కారణాల చేత ప్రచుర్యంలోకి వచ్చింది. వాస్తవానికి వి-రాగి జన్మస్థలంగా ఆగ్రామానికి ప్రాశస్థ్యం లభించాలని నాలాంటి వాళ్లు కోరుకుంటారు.
"ఏటిపట్టుల్లో
తాటితోపుల్లో
అమాయక, మూర్ఖ, ( అ)సామాన్య జనాలమధ్య--
ఉభయసంధ్యల మధ్య
మార్మికసౌందర్యం విసిరే ఆశ్చర్యకరమైన సవాళ్ల మధ్య
ఆటలతోపాటే అన్వేషణ
నీతులతోపాటే పచ్చి బూతులూ నేర్చిన
పల్లెటూరి బాల్యం నాది!" అంటాడు వి-రాగి.
"ఇక బాల్యానంతరం అంతా అరాచక, పలాయనవాదాల పథాల్లోనే....." అని ధైర్యంగా అంగీకరించగల నిజాయితీ విరాగికే సొంతం!
"నా తొలి కవిత బహుశా 1978లోనో, 1979లోనో రాసిఉంటా''నని విరాగి గుర్తు చేసుకున్నారు. 19ఏళ్ల ప్రాయం పెన్ను పట్టుకోడానికి అన్ని విధాలా అనువైన సమయం!
అంచేతనే ఎక్కువమంది అక్షరారాధన ఆ వయసులోనే ప్రారంభిస్తారు. అయితే, రెండు దశాబ్దాల కాలంలో కేవలం నూరు కవితలు మాత్రమే రాసి ఊరుకోగల నిగ్రహం మాత్రం విరాగిలాంటి కొద్ది మందికి మాత్రమే ఉంటుంది.
"ఈ లోకంలో బేషరతుగా ప్రేమించదగ్గ వాళ్లు పిల్లలు మాత్రమే" నంటాడు విరాగి. "అన్ని రంగాలనూ, వ్యవస్థలనూ, పార్శ్వాలనూ ఆశించినట్లే వాణిజ్య వైరస్ కుటుంబ వ్యవస్థనూ చుట్టుముట్టింది.ఈవ్యవస్థ సమీప భవిష్యత్తు మరింత సుస్తీగా ఉండే చిన్నెలు కనిపిస్తున్నా"యని ఆయన ఆందోళన ప్రకటించారు. "సహజత్వాన్ని ఎంతోకొంతయినా నిలుపుకుని ఉన్న ఏ పల్లెటూరయినా నాకిష్టమయిన చోటే"నంటాడువిరాగి. "పుస్తకాలంటే ఇష్టమే"నంటున్న విరాగి" అభిమాన రచయితలు- శ్రీశ్రీ, డాక్టర్ కేశవరెడ్డి".
సోవియెట్ యూనియన్ ముక్కచెక్కలై దాదాపు దశాబ్దం కావస్తూన్నా ఇప్పటికీ "నా అభిమాన , ఆదర్శ నేత లెనిన్ "అనగలగడం విరాగి గుండె ధైర్యానికి నిదర్శనం! తన ఐడియాలజీ గురించి వివరిస్తూ "మార్క్సిజం అంటే ఇష్టం" అన్నారాయన.
"సాహిత్యం జర్నలిజానికి తాతముల్లె'' లాంటిదంటాడువిరాగి. ఆవ్యాఖ్యానంలో కాంప్లిమెంట్ కన్నా, కంటెంప్టే ఎక్కువ ధ్వనిస్తోంది!" ఇక జర్నలిజం వల్ల సాహిత్యానికేమన్నా మంచి జరిగి ఉంటే అది శోభి మచ్చలాంటిది మాత్రమే''నని విరాగి తేల్చేశారు.
"అందరిలాగానే తమలోనూ మురికి కూపాలే ప్రవహిస్తున్నప్పటికీ, కొందరు మనుషులు మరిదేన్నో మథించి తీసే - రంగూ, రుచీ, వాసనా కలిగిఉండే అమృతమే కవిత్వ"మని విరాగి నిర్వచించారు. అందుకు ఆయన కవిత్వమే నిదర్శనం.
నిరాడంబరతనే నిలువెల్ల ధరించి, ధ్వనించే అస్తిత్వం, కవిత్వం వి- రాగివి. వాటిగురించి అధిక ప్రసంగం చెయ్యడంకన్నా అసంబధ్ధతవేరేఉంటుందా?












Click it and Unblock the Notifications
