వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అర్ధశతాబ్దం మరుగున పడి ఉన్న అలనాటి అతి నవీనకవి శిష్‌ట్లా

By Staff
|
Google Oneindia TeluguNews

'ఆరిపోయే దీపాన్ని రగుల్పుతుంది. పరుగెత్తే పామరుణ్ణి నిలేస్తుంది'-తను ప్రతిపాదించిన ప్రాహ్లాద కవిత్వ లక్షణమేమిటో ప్రకటిస్తూ శిష్‌ట్లా ఉమామహేశ్వరరావ్‌ అన్న మాటలివి. 'వ్యాకరణంతో వ్యభిచరించటము కూడదు కానీ పొయిట్రీలో కొంత స్వేచ్ఛ అవసరం! న్యాయం!' అని కూడా అన్నాడు శిష్‌ట్లా. ఈ శతాబ్ది తొలి దశాబ్ది చివర్లో పుట్టి నడివయసులో-నలభయ్యయిదో ఏట-అత్యంత విషాదకరమైన, విస్మయకరమైన పరిస్థితుల్లో చనిపోయిన ఈ కవి గురించి జరిగినంత చర్చ మరెవరి విషయంలోనూ సాగలేదనే చెప్పాలి. దాదాపు అర్ధ శతాబ్దకాలం పాటు అతగాడి కథ తెలుగు సాహిత్యోపజీవుల పాలిట అంతు చిక్కని మిస్టరీగానే ఉంటూ వచ్చింది. శిష్‌ట్లా పట్ల వ్యక్తమయిన ఈ అసాధారణాసక్తి, అభిరక్తి, అనురక్తి - ఇవే ఆయనకు తెలుగు జాతి అర్పించుకున్న ఆదరాంజలులు.

విమర్శకులు, పండితులు చాలామంది కవులకు సంబంధించి పరస్పర విరుద్ధమయిన అభిప్రాయాలు ప్రకటించడం కనీవినీ ఎరుగనిదేమీ కాదు. అయితే శిష్‌ట్లా విషయంలో జరిగింది మరీ విడ్డూరంగా అనిపించే విపరీతపు పోకడ. కొందరతన్ని నెత్తికెక్కించుకుని ఊరేగించాలని చూశారు. మరికొందరు తిట్టిపోసి తీసిపారేశారు. ఈ 'అతి' తనం శిష్‌ట్లాలో ఉండడం వల్లనే ఆయన ప్రశంసకుల్లోనూ అభిశంసకుల్లోనూ కూడా అది ప్రతిఫలించిందనిపిస్తుంది. అయితే బ్యాలెన్స్‌డ్‌గా శిష్‌ట్లా కవిత్వాత్మను ఖరీదు కట్టిన షరాబులు లేనేలేరనడానికి వీల్లేదు. ఉమామహేశ్వరరావు ఆప్తమిత్రుడు దేశిరాజు కృష్ణశర్మ ఈ కోవకే చెందుతారు.

అబ్బూరి రామకృష్ణారావులాంటి కవి పండిత విమర్శకుడు శిష్‌ట్లా ధోరణిని ''కవిత్వంలో రౌడీవేషం''గా లెక్కగట్టి తీసిపారేశారని వరద రాజేశ్వరరావు రాశారు. అయితే, అలనాడు సభాపతిస్థానాన్ని అలంకరించి, అనేకమంది ఆధునిక కవుల రెక్కలు సవరించి, విశాల విహాయసవీధుల్లో విహరింపచేసి పుణ్యం కట్టుకున్న ఉద్యమశీలి తల్లావజ్ఘల శివశంకర శాస్త్రి మాత్రం ''అతి నవీనమార్గంలో అన్నివిధాలా వెళ్ళుతున్నవాడు ఇతనే''నని తీర్మానించారు. ''ఈ కవికి అనంతమైన కవితాశక్తి ఉం''దని వెన్నుతట్టి ప్రోత్సహించారు విశ్వనాథ సత్యనారాయణ. శిష్‌ట్లాను భావకవిత్వం మీద విప్లవం తీసుకొస్తున్న వైతాళికుడిగా పరిగణించిన గోపీచంద్‌ ''పూర్వ వాసనలను పోగొట్టుకుంటే గాని సిసలైన ప్రోలిటేరియన్‌ కవిత్వం రాదు. వినాయక పండితులను ఈ విషయం గమనించగోరుతా''నని మృదువుగా హెచ్చరించారు. కానీ, ముద్దా విశ్వనాధంలాంటి సౌమ్యుడు ''తెలుగులో బాగా ప్రవేశం వున్న తెలుగువాళ్ళకి కూడా ఇందులోని (విష్ణుధనువు) విషయం అగమ్యగోచరంగా వుండేటట్లు తోస్తుం''దని అభ్యంతరం చెప్పడం గమనార్హం.

ఒక దశలో నవ్యకవిత్వ ప్రవక్త పదవికి జరిగిన 'ఎన్నిక'ల్లో శిష్‌ట్లాకు ప్రత్యర్ధిగా రంగంలోకి దిగిన శ్రీరంగం నారాయణబాబు మాత్రం తర్వాతికాలంలో తన అభ్యర్ధిత్వాన్ని ఉపసంహరించుకుని 'ఉమా'కు మద్దతు పలికారు. 'బోర విరుచుకు తిరుగుతున్న అతి నవీనులకు కూడా నవీను''డని ఆయన శిష్‌ట్లాను అభివర్ణించారు. తెలుగు'వాడి'కి శాశ్వత చిరునామా, అభినవవాగనుశాసనుడు, పాతఃస్మరణీయుడు, అన్నివర్గాల చేత మహాకవిగా ఆరతులందుకున్నవాడు శ్రీరంగం శ్రీనివాసరావు శిష్‌ట్లా పట్ల తన వైరభావాన్ని కడదాకా కొనసాగిస్తూనే వచ్చారు. ఉమ్మాయ్‌కి ఉన్న డజన్లాది మారుపేళ్ళను గుర్తు చేసే పద్ధతిలో అతగాడిని 'దయా రసార్ణవ దవానలం'గానూ, 'నిషా విహామృత మశూచికం' గానూ, 'కళాపరాయణ పలాయనం'గానూ అభివర్ణించారు. ఒకప్పుడు శ్రీశ్రీకి ప్రథమ శిష్యుడుగానూ ప్రత్యక్ష అంతేవాసిగానూ ఉండి, అటు తర్వాత ఆయనతో విభేదించిన ఆరుద్ర శిష్‌ట్లాకు చరిత్రలో జరిగిపోయిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు ఎంతో శ్రమించారు. ఉమామహేశ్వరరావ్‌ది 'సొంత గొంతుకే కానీ వింత గొంతుక' అన్నది ఆరుద్ర తీర్పు. అతని కవిత్వాన్ని అతగాడికి సైతం లొంగని 'పెంకిరెక్కల గుర్రం'గా ఆరుద్ర అభివర్ణించారు.

ఆచార్య కురుగంటి సీతారామ భట్టాచార్యులవారూ, పిల్లలమర్రి వేంకటహనుమంతరావుగారూ ఉమ్మడిగా నిర్మించిన 'నవ్యాంధ్ర సాహిత్యవీధు'లలో శిష్‌ట్లాకి ప్రత్యేక ప్రాముఖ్యం లభించింది. ''అతి నవ్వులలో శిష్‌ట్లా అసాధ్యు''డని తీర్మానించడంతో ఆగక ''ఉమామహేశ్వర్‌ ప్రచ్ఛన్న ప్రవక్తృత్వాన్ని ఎవరింకా కాదనగలరు?'' అని నిలదీశారు కూడా. దేశిరాజు కృష్ణశర్మ తన ఆత్మీయమిత్రుడైన శిష్‌ట్లా సాహిత్యమూర్తిమత్వాన్ని మనకు వివరిస్తూ ''ఉమా విష్ణుధనువులో దేశంలోని సమ్యక్‌ దృక్పథానికి దూరమై, నిద్రాణమై, నిర్వేదరూపమైన అశాంతిని అసంతృప్తిని నిశీధ సౌందర్యమూర్తిగా దర్శించా''డని పేర్కొన్నారు. అవసరాల సూర్యారావు దృష్టిలో శిష్‌ట్లా ''రానున్న మార్పునకు అంకురార్పణ చేసిన ప్రథము''డని లెక్కగట్టగా ఒక సమీక్షకుడు దాన్ని తప్పు బట్టారు. ''శిష్‌ట్లా కవిత చాలావరకు ప్రయోగాత్మకంగానే ఉండిపోయింది గానీ స్వచ్ఛమైన అభివ్యక్తి అంతరువు అందుకోలేకపోయిం''దని సదరు సమీక్షకుడు స్పష్టం చేశారు. వచన కవితా పితామహుడనిపించుకున్న కుందుర్తి ఆంజనేయులు మాత్రం ''వచన కవితకు ఆద్యుడుగా శిష్‌ట్లానే చెప్పుకోవా''లన్నారు.

దాదాపు యాభయి సంవత్సరాలపాటు సాగిన ఈ చర్చలో ఎక్కువమంది పరోక్ష సాక్ష్యాల ఆధారంగానే వాదోపవాదాలు సాగించడం గమనార్హం. ప్రముఖ కవి డాక్టర్‌ ఆవంత్స సోమసుందర్‌ కష్టపడి సేకరించి, జాగ్రత్తపెట్టిన 'విష్ణుధనువు' కాపీని ఎనభయిదశకం చివర్లో ఒకానొక పత్రికకు అందచేస్తే తప్ప శిష్‌ట్లా కవిత రూపరేఖావిలాసాలు తిలకించే భాగ్యం ఈ తరం పాఠకులకు దక్కనేలేదు. ఇప్పుడు శ్రీశ్రీ స్మారకసంస్థ, ఆంధ్రపదేశ్‌ అభ్యుదయ రచయితల సంఘం ఉమ్మడిగా 'శిష్‌ట్లా ఉమామహేశ్వరరావ్‌ కవిత్వం ః సమాలోచనం' పేరిట 'విష్ణుధనువు - నవమిచిలుక' కావ్యాలు రెండింటినీ పాఠకులకు అందించారు. విశాలాంధ్ర పుస్తకాలయాలన్నింట్లో ఈ పుస్తకం లభిస్తుంది. నా దృష్టికొచ్చిన శిష్‌ట్లా 'పరిశిష్ట కవిత'నొకదాన్ని ఇక్కడ ఇస్తున్నాను. చిత్తగించగలరు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X