నవలా సాహిత్యంలో మరీచిక
తెలుగు నవల నూట ఇరవై సంవత్సరాల క్రిందట (1872) సాంఘిక నవలగా పుట్టింది. ఆనాటి సాంఘిక సమస్యలను దృష్టిలో ఉంచుకుని వచ్చిన నవలలు శ్రీ రంగరాజు చరిత్రము, రాజశేఖర చరిత్రము, సత్యవతీ చరిత్రము మొదలైనవి. అలా పందొమ్మిదవ శతాబ్ది చివరి వరకు దాదాపు పాతికేళ్లు సాంఘికేతివృత్తాలు గల నవలలు వెలువడ్డాయి. ఇరవయ్యో శతాబ్ది ప్రారంభానికి తెలుగులో చారిత్రక నవలలు కూడా రాసాగాయి. ఈ దశలో ఎక్కువగా అనువాదాలే వచ్చాయి. ఈ కాలంలోనే అపరాధ పరిశోధక నవలలు మొదట అనువాదాలుగా, తర్వాత స్వతంత్రంగా రావటం మొదలయ్యాయి.
ఆ తర్వాత దాదాపు పాతిక సంవత్సరాలకు అంటే ఇరవయ్యో శతాబ్ది రెండో దశకంలో తెలుగు నవల సామాజిక సమస్యలను చిత్రించే సాధనంగా వికాసం చెందింది. మొట్టమొదటి సామాజిక నవల మాలపల్లి (1922). ఈ సామాజిక నవలలో సమాజమే కేంద్రం. మాలపల్లి తర్వాత పాతిక సంవత్సరాలలో స్వాతంత్ర్యోద్యమం తెలుగు నవలని ప్రభావితం చేసింది. జాతీయోద్యమాన్ని ప్రతిబంబిస్తూ ఎన్నో నవలలు వచ్చాయి. ఈ కాలంలో పేర్కొనదగ్గ రచయితలు చలం, విశ్వనాథ, బాపిరాజు మొదలైనవారు.
1940వ సంవత్సరం నుంచి తెలుగు నవలా సాహిత్య చరిత్రలో కొత్త శకం ప్రారంభమైంది. అంతవరకు వచ్చిన నవలల్లో మానవునికి, సమాజానికి మధ్య గల సంఘర్షణ, తనతో తనకు లేదా తన వాతావరణానికీ, తన ప్రవృత్తికీ మధ్య జరిగే సంఘర్షణ ప్రధాన ఇతివృత్తంగా నవలలు వచ్చాయి. ఈ పద్ధతిలో రాసిన నవలలను మనోవైజ్ఞానికి నవలలు అన్నారు. సంఘంలో వ్యక్తి, కుటుంబం, పరస్పర ప్రభావాలను చిత్రించే తవలలు గోపీచంద్ రచించారు. గడచిన, గడుస్తున్న సాంఘిక వ్యవస్థాత్మక విలువల మధ్య వ్యక్తి జీవితంలో ఎలాంటి మార్పులు కలుగుతున్నాయో ఆయన తన నవలల్లో చిత్రించారు. ఆయన రచించిన అసమర్థుని జీవ యాత్ర, పరివర్తన, గడియ పడని తలుపులు, మెరుపుల మరకలు, పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా మొదలైనవన్నీ సమాజాన్ని ఆయన దర్శించిన తీరును స్పష్టం చేస్తాయి. బుచ్చిబాబు రచించిన చివరకు మిగిలేది సాంఘిక విలువల, కట్టడుల మధ్య వ్యక్తి ఎదుర్కొనే మానసిక సంఘర్షణలను, బాధలను, ఉద్వేగాలను చిత్రించే నవల. మానవ జీవితంలో సున్నిత మనస్కుడు, ఆదర్శ ప్రియుడు, జీవిత పరమార్థ గవేషి ఎదుర్కోవలసిన ఆంక్షలు, కాంక్షలు బుచ్చిబాబు ఈ నవలలో చాలా ప్రతిభావంతంగా చిత్రించారు.
స్వాతంత్ర్యానంతరం తెలుగు నవలల్లో ఇతివృత్త వైవిధ్యం ఎక్కువైంది. వైయక్తికమైన సమస్యలు, రాజకీయ సిద్ధాంత వాహకాలూ అయిన ఇతివృత్తాలూ, మనో విశ్లేషణాత్మకాలూ, శిల్పసంబంధమైన ప్రయోగాలూ (చైతన్యస్రవంతి) నవలా రచనలో చోటు చేసుకోవడం మొదలైంది. చివరకు మిగిలేది, కీలుబొమ్మలు, అసమర్థుని జీవయాత్ర, అల్పజీవి వంటి నవలల్లో క్రమానుసారంగా ఈ నవ్య ధోరణులు వ్యక్తమవుతూ వచ్చాయి.
ఇరవయ్యవ శతాబ్ది ఉత్తరార్థ ప్రవేశంతో తెలుగు నవల కుటుంబ సమస్యల పట్ల ఆకర్షితమైంది. శారద రాసిన మంచీ - చెడూ, అపస్వరాలు, ఇందుకు ఉదాహరణలు. మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి వ్యక్తుల జీవితం, పెట్టుబడిదారీ వ్యవస్థలో డబ్బు ప్రభావం ముందు మానవతా విలువలన్నీ ఎలా ఛిద్రమై పోతున్నాయో చెప్పే నవలలు ఇవి. బలివాడ కాంతారావు, కొమ్మూరి వేణుగోపాలరావు మొదలైన రచయితలు కుటుంబ సమస్యలను ఇతివృత్తంగా తీసుకొని మంచి నవలలు రాశారు.
ఈ శతాబ్ది ఆరవ దశకంలో వచ్చిన నవలల్లో చైతన్య స్రవంతి అసాధారణ శిల్ప విశేషంగా ఏర్పడిపోయింది. అలాగే పాత్రచిత్రణలో మనో విశ్లేషణ కూడా సామాన్యమై పోయింది. ఇవి రెండూ మనస్తత్వ శాస్త్రం ఆధునిక నవలా సాహిత్యానికి ఇచ్చిన వరాలు. రానురాను రచయితలు మనస్సులో నిత్యమూ జరుగుతున్న సంఘర్షణలకు అక్షర రూపం ఇవ్వసాగారు. ఈ కాలంలో చారిత్ర నవలలు కూడా ఎక్కువే వచ్చాయి. వీటిలో నోరి, తెన్నేటి సూరి మొదలైనవారి నవలలు చెప్పుకోదగ్గవి. ఈ కాలంలో వచ్చిన రాజకీయ నవలల్లో చెప్పుకోదగ్గవి - మృత్యుంజయులు, ప్రజల మనిషి మొదలైనవి. చదివే పాఠకుల సంఖ్య ఎక్కువ కావడం వల్ల వారపత్రికలు, మాస పత్రికలు విరివిగా వెలువడుతూ నవలా వికాసానికి దోహదం చేశాయి. ఎందరో కొత్త రచయితలు కూడా ముందుకు వచ్చారు.
ఈ కాలంలో నవలా రచనలో మహిళలు ముందంజ వేయడం తెలుగు నవలా చరిత్రలో ఒక విలక్షణ విషయం. ఇల్లిందల సరస్వతీ దేవి, మాలతీ చందూర్, లత, రంగనాయకమ్మ, కొడూరి కౌసల్యాదేవి, యద్దనపూడి సులోచనా రాణి, ద్వివేదుల విశాలాక్షి, ఆనందారామం ప్రభృతులు ఈ కాలంలోని రచయిత్రులలో ముఖ్యులు.
ఈ దశకంలోనే నవలా రచయిత్రిగా స్థిరపడి వాసి గాంచినవారిలో వాసిరెడ్డి సీతాదేవి ఒకరు. ఈ శతాబ్దంలో ఏడవ దశకం ఎంతో ప్రధానమైంది. స్వాతంత్ర్యం వల్ల సామాన్యునికి ఏమీ జరగలేదనే అసంతృప్తి దేశంలో వ్యాపించింది. ఆ కారణంగా ఈ కాలంలో తిరుగుబాటు మొదలయ్యింది. నక్సలైట్ ఉద్యమం ప్రారంభమై యువతరాన్ని కదిలించింది. ఈ దశకంలో వచ్చిన నవలల్లో సమత, మట్టి మనిషి, హేంగ్ మీ క్విక్, రాజు - మహిషి, ముళ్లపొదలు, చీకటి రోజులు, మరీచిక వంటివి ముఖ్యమైనవి. మరీచికలో నక్సలైట్ ఉద్యమం వైపు ఆకర్షింపబడే యువతరం గురించి చిత్రించబడింది. ఈ దశకంలోనే పాశ్చాత్య ప్రభావం వలన హిప్పీ కల్చర్ మన దేశంలో కూడా వ్యాపించి యువతరంలో అలజడిని కలిగించింది. యువతరం ఆ వ్యామోహంలో పడి తమ నిండు జీవితాలను బలి చేయటం జరిగింది.
సమాజంలో యువతరం అనుసరిస్తున్న ఈ రెండు మార్గాలను (హిప్పీయిజం, నక్సలిజం) ఇతివృత్తంగా తీసుకొని ఆ మార్గాలు మరీచికలని యువతరాన్ని మేల్కొలుపటానికి వాసిరెడ్డి సీతాదేవి వ్రాసిన ఆలోచనాత్మకమైన చక్కని నవల మరీచిక.
ఈ రెండు భిన్నమైన సమస్యలను తీసుకొని వాటి ద్వారా యువతరంలో చెలరేగిన అశాంతిని, అలజడిని సీతాదేవి ఈ నవలలో చిత్రించారు. సామాజిక సమస్యలను మాత్రమే కాక పాత్రల మనోభావాలను కూడా ఈ నవలలో చక్కగా చిత్రించగలిగారు రచయిత్రి.
తెలుగు నవలా చరిత్రలో ఈ విధంగా మరీచిక ఒక స్థానాన్ని అలంకరించింది.
(వాసిరెడ్డి సీతాదేవి మరీచిక - సామాజిక మనో విశ్లేషణ నుంచి)












Click it and Unblock the Notifications