వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వొంక పెట్టలేని 'ఊరు' కథలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Karimnagar
విస్తృతంగా కథలు రాస్తున్నవారిలో కె.వి. నరేందర్‌ ఒక్కరు. కరీంనగర్‌ జిల్లా నుంచి కథాసాహిత్యం ఎక్కువగా వస్తున్నది. అలా రావడం యాదృచ్ఛికమేమీ కాదు. కొద్దిగానైనా 'కాలువ నీళ్లు' అందుబాటులోకి రావడం, రామగుండం, సింగరేణి వంటి పరిశ్రమల స్థాపన, ప్రజా రాజకీయోద్యమాల వల్ల మధ్యతరగతి తెలంగాణలోని మిగతా జిల్లాల్లో కన్నా తెలంగాణలో కాస్తా ఎక్కువగా ఎదిగింది. ఇదే కథా సాహిత్యం ఇక్కడి నుంచి ఎక్కువగా రావడానికి కారణం. అందువల్ల కథా సాహిత్యాన్ని విరివిగా రాస్తున్న కాలువ మల్లయ్య, కె.వి. నరేందర్‌, ఇప్పుడిప్పుడు పెద్దింటి అశోక్‌ కుమార్‌ ఈ జిల్లా నుంచే రావడం ఊహకందని విషయమేమీ కాదు. కె.వి. నరేందర్‌ పుంఖానుపుంఖంగా కథలు రాస్తుండడమే కాకుండా కథా సంకలనాలు కూడా అంతే వేగంగా వెలువరిస్తున్నారు. సింగిల్‌ కాన్సెప్ట్‌ కథల పేర కథా సంకలనాలు తీసుకొస్తున్నారు. ఒక ఇతివృత్తానికి దగ్గరగా ఉన్న కథలను ఒక దగ్గర చేర్చి సంకలనాలుగా వెలువరిస్తున్నారన్న మాట. ఆ వరసలోనే ఇటీవల 'ఊరు' కథా సంకలనం వెలువడింది.

'ఊరు' కథా సంకలనంలో 14 కథలు ఉన్నాయి. ఇవన్నీ వివిధ పత్రికల్లో అచ్చయినవే. అప్పుడే ఇవి చాలా మంది పాఠకులను చేరి ఉంటాయి. తెలంగాణ పల్లెలు శిథిలమవుతున్న తీరును, గ్రామాల్లో మారుతున్న మానవ సంబంధాలను, గ్రామీణ జీవితాల్లో వచ్చిన పరిణామాలను, సామాజిక సంబంధాలు తలకిందులవుతున్న వైనాలను, మారిన దోపిడీ రూపాలను ఈ కథల్లో నరేందర్‌ చిత్రించారు. ఈ కథలు చదువుతుంటే తెలంగాణ పల్లెల్లోని వివిధ కోణాలు తెలుస్తాయి. కంటికి కనిపించే దృశ్యాల వెనక అంతరార్థాలు అవగతమవుతాయి.

సమాజంలో తలకిందుల విలువలు చలామణిలో ఉన్నాయి. సంపద సృష్టికి ఉపయోగపడుతున్న శ్రామిక విలువలకు కాకుండా ఇతరత్రా విలువలకు గౌరవ స్థానం దక్కడం చూస్తూనే ఉన్నాం. బర్రె కథ ఇటువంటి సామాజిక విలువల పట్ల విమర్శనాత్మక దృష్టి కోణం నుంచి రాసింది. 'ఉసుల్లు' కథ సమాజంలో విలువలు తారుమారై కింది కులాలవాళ్లు గౌరవస్థానంలోకి రావడాన్ని చూస్తాం. వృత్తులు లాభసాటి వ్యాపారంగా మారేసరికి వాటి రూపం మారి, అగ్రకులాల చేతుల్లోకి మారిన విషయాన్ని కూడా ఈ ఉసుల్లు కథ తెలియజేస్తుంది. తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో జరిగిన ఉద్యమాలు తెచ్చిన మార్పును చాలా కథలు వివరిస్తాయి. ప్రత్యక్షంగా మోటు పద్ధతిలో సాగే దోపిడీ రూపాలు రంగు మార్చుకుని కొత్త రూపంలో ప్రత్యక్షం కావడం, అప్పుడూ ఇప్పుడూ దోపిడీదారులు ఒక్కరే కావడం 'దొర మల్లా వచ్చిండు', 'ముంపు' వంటి కథలు తెలియజేస్తాయి. 'నెమలికన్నుపై నెత్తుటి చుక్కలు' కథ విద్యాకమిటీల ఎన్నికల వల్ల రగులుతున్న రాజకీయ విద్వేషాలను వివరిస్తుంది. సాగునీటి సంఘాలు, విద్యాకమిటీల వంటివి వివిధ రంగాల్లో స్వయంపోషకత్వాన్ని, ప్రజల భాగస్వామ్యాన్ని పెంచే ఉద్దేశంతో గ్రామీణ ప్రాంతాల్లోకి వచ్చినప్పటికీ అవి నిర్వర్తిస్తున్న పాత్ర వివాదాస్పదంగానే ఉంది. అవి కొత్తరకం విద్వేషాలను, సంపాదన వ్యామోహాన్ని, ఆ సంపాదన కోసం పోటీని పెంచి పోషించి గ్రామీణ ప్రాంతాలను చీలుస్తున్నాయి. 'ముంపు' కథ సాగునీటి ప్రాజెక్టు నిర్వాసితుల ఇక్కట్లను విడమర్చి చెబుతుంది. ప్రపంచ బ్యాంక్‌కు, ప్రభుత్వానికి ఉన్న సంబంధాలను, దాని వల్ల గ్రామీణ ప్రజల జీవనోపాధులు కోల్పోతున్న వైనాన్ని తెలియజేసే కథలు ఉన్నాయి.

'ఊరు' సంకలనంలోని కథలన్నీ భారత గ్రామీణ వ్యవస్థలో వచ్చిన ఒక పెనుమార్పుకు అద్దం పడుతున్నాయి. అది యాంత్రీకరణ తెచ్చిన మార్పు. ఈ యాంత్రీకరణ వల్ల మనుషులు ఉపాధి కోల్పోతున్న వైనాన్ని ఈ కథలు తెలియజేస్తాయి. ఆధునిక వ్యవసాయ పద్ధతులు వనరుల సద్వినియోగం, సాగు విధానాల్లో కాకుండా మనషులను జీవనోపాధి నుంచి బేదఖల్‌ చేసేందుకు ఉపయోగపడుతున్నాయనే విషయాన్ని నరేందర్‌ తన కథల ద్వారా సమర్థంగా చెప్పారు. హార్వెస్టర్‌ వంటి నూతన యంత్రాలు గ్రామీణ ప్రాంతాల్లోకి ప్రవేశించాయి. ఈ యాంత్రీకరణకు ముందు తరం వారు వ్యతిరేకంగా ఉండటం, వర్తమాన తరం దాన్ని ఆహ్వానించడం ఈ కథల్లో కనిపించే సాధారణాంశం. ఈ రకమైన సంఘర్షణ సహజమే. యాంత్రీకరణను వ్యతిరేకించే వర్గాన్ని అభివృద్ధి నిరోధకులుగానూ, ఆహ్వానించేవారిని అభివృద్ధి కాముకులుగానూ చూడటం అతి సాధారణ విషయంగా మనకు కనిపించే అంశం. అయితే ఏదైనా మొత్తం సమాజానికి ఉపయోగపడే విధంగా, మానవ సంబంధాల్లోని నిమ్నోన్నతాలను తగ్గించే విధంగా ఉండాలి. కానీ యాంత్రీకరణ వల్ల ఆ మేలు జరుగుతోందా? అభివృద్ధి అనేదానికి కేవలం యాంత్రీకరణ కొలబద్ద కాకూడదనేది, మానవ సంబంధాలను తెంపడం నీతి కాకూడదనేది, వ్యవస్థను ఛిన్నాభిన్నం చేయడం ఫలితం కాకూడదనేది నరేందర్‌ కథలు వివరిస్తాయి. అక్కడక్కడా ఈ వినాశకరమైన తలకిందుల అభివృద్ధిపై గ్రామీణ ప్రజల తిరుగుబాటును కూడా రచయిత చిత్రిస్తారు. ఈ రకంగా నరేందర్‌ కథలు తెలంగాణ గ్రామీణ వ్యవస్థలో చోటు చేసుకుంటున్న సామాజిక మార్పులకు, తిరుగబడుతున్న విలువలకు అద్దం పడుతున్నాయి. నరేందర్‌ కథరచనలో వచ్చిన మార్పును 'ఊరు' కథా సంకలనం తెలియజేస్తుంది. తెలంగాణ భాషను, నానుడులను, సంభాషణావిధానాన్ని ఆయన ఈ కథల్లో సమర్థంగా వాడుకున్నారు. తెలంగాణ అస్తిత్వ ఉద్యమం తెచ్చిన మార్పును ఇవి తెలియజేస్తున్నాయి.

నరేందర్‌ కథలకు వొంక పెట్టడానికి ఏమీ ఉండదు. ఆయనకు కథారచన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అలవోకగా కథలు రాసే విద్యను ఆయన సొంతం చేసుకున్నారు. కథారచనలో నైపుణ్యం సాధించి, ఎడతెరిపి లేకుండా రాస్తున్న రచయిత నేర్చుకోవాల్సింది ఏం ఉంటుంది? అయితే ఒక్కో కథ రచయితకు ఒక్కో కాన్పు వంటిది. నరేందర్‌ కథలు నాలుగు కూడళ్ల వద్ద జరిగే పంచాయతీల వంటివి. ఇవి పనగట్ల కథలు. తెలంగాణ గ్రామీణ వ్యవస్థలో కుల హెచ్చుతగ్గుల ఆచరణకు మించిన పరస్పర మానవ సంబంధాల సంస్కృతి ఉంది. దీన్ని అత్యంత సమర్థంగా, అతి సహజంగా చిత్రించిన కథలే. సామాజిక, వ్యక్తిగత సంఘర్షణలను రూపు కట్టిన కథలే. కానీ కథలన్నీ చదివిన తర్వాత ఏదో ఒక అసంతృప్తి మిగిలే వుంటుంది. అనుభూతి చెందడంలో ఉన్న తేడా కూడా అందుకు కారణమై ఉండవచ్చు. ఈ విషయాన్ని పక్కన పెడితే నరేందర్‌ కథలు పాఠకులను హాయిగా చదివిస్తాయి.

- కాసుల ప్రతాప రెడ్డి

English summary
KV Narendar is one of the perfect short story writers in Telugu literature. The collection of his Ooru (Village) stories prove that.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X