హార్డ్ వేర్
పల్లె ముసలిదైందని కాదు
పల్లెలో ముసలోల్లే మిగిలారు
యువత భవితను వెతుక్కుంటూ
ఎటో వెళ్లిపోయింది
కాలం మారుతున్న వేగంగా మారలేక
వెర్రి మొగాల్తో వలసలు.
చదువు రాకున్నా బాగుండేది
వచ్చినాక అవి పూర్తిగా మారిపోయాయి.
ఇవి బొంబాయి వలసలు కాదు
బొంబాయే నలుమూలలకు పారిపోయింది.
నిరుద్యోగి నడుస్తుంటే
చెట్లు కూలుతున్నాయన్నాడో కవి
ఇప్పుడు కూలడానికేమున్నాయి
బతుకులు తప్ప
చైనా బూట్లలో
పాదాలను కుక్కినట్లు
అన్నీ అమెరికావేర్ లో అమరిక.
ఇంతకు ముసలోల్లెలా వున్నారు
ఊరిపైన
ఒక కనిపించని రాబందు తిరుగుతున్నట్లు
ఊరి నిండా నిశ్శబ్దం
కమురు కంపు కొడుతున్నట్లు
ఇక్కడ బతుకే బరువైతే
అక్కడ అడుగడుగునా పోరాటం.












Click it and Unblock the Notifications
