రెక్కలు
మనసుకు రెక్కలు మొలిచాయి
వినీలాకాశంలో ఎగరడానికి
ఎంత ఎగిరినా అంబరం అందడం లేదు
అందిందాకా ఎగరాలని ఆశ
రారమ్మని సేద తీరమని
వృక్షాలు కొమ్మల చేతులు సాచి పిలుస్తున్నాయి
పైన నీలాకాశం
కింద హరితావని
ఎటూ తేల్చుకోలేని మనసు
ఎప్పటికీ చిక్కని వియత్తలం కన్నా
పదిలంగా ఉండే అవనీతలం మిన్న
మనసుకు మొలిచిన రెక్కలు
ముడుచుకొన్నాయి దిగులుగా
పాదాలకు చల్లగా తగిలింది నేల
తల్లి ఆశ్వాసంలా
ఎగిరెగిరి పడిన మనసు
మెల్లగా మెత్తగా సేద తీరింది
ఆకాశం నవ్వుతుంది
కవ్విస్తుంది అందుకోమని
రెక్కలు విప్పి ఎగరేశాను
వినువీధిలోకి
అలా అలా ఎగిరిపోయాయి
దూదిపింజల్లా ధూళిరేణువుల్లా
ఆకాశం తెల్లబోయింది
మబ్బు తునకలై చెదిరిపోయింది
మనసు పదిలమైంది ఎప్పటిలా












Click it and Unblock the Notifications
