భూమికి అవతల
తొలకరి పులకరింతకే తనువెల్లా తివాచీ పరిచి
ఆరుద్రలు కెంపులు పగడాల ముత్యాలరాశియై స్వాగతించే
భూమి దేహమిప్పుడు కమురు వాసనల బినామీ శవం కంపై
దేశం దేశమంతా దాహార్తితో నాలుకలు చాపితే
పిచ్చిపిచ్చిగా విచ్చుకుంటూ గుచ్చుకుంటూ
జాతి గుండెల నిండా దిగుమతైనా విదేశాభిమానం
నగ్నంగా డాలరు కౌగిట్లో మత్తిల్లిన
జీవం కోల్పోయి మొలకెత్తని టెర్మినేటర్ విత్తనం
క్రమంగా మెదడొక హార్డ్ వేర్ ఫజిలై
మెకానికల్ గా సాఫ్ట్ వేర్ పై నర్తించే చేతి వేళ్ల మధ్య
ప్రకృతిచ్చిన ఆకృతికే అందమైనా మరణశాసనం రాస్తే
కళ్ల ముందు కురుస్తున్న కాసుల ముందే
దగ్ధమై కూలుతున్న వూసుల రాశులు
మళ్లీ మొదటికే వచ్చి భూమి మాత్రమే కాదు
మేధోతనం కూడా గుండ్రంగా వుందని తేల్చిన చక్రభ్రమణంలో
రింగు రోడ్డు ఫ్లైవోవర్ డోసుల కల్లోల శిల్పులమైతే
పరిశ్రమ నెలకొల్పినా కళాశాల స్థాపించినా
సైనిక స్థావరమైనా విమానకేంద్రమైనా
రాష్ట్రాలు విడిపోయినా ఎవరికి వారైనా
పుకార్లు పుకార్లుగా షికార్లు షికారు చేసినా
మనం ఒక్కరం ఒక్కరంగా సామ్రాజ్య స్వార్థ కేంద్రాలమైనప్పుడు
రాబోయే కాలంలో రోదసీ మీద కూడా మురిపించే రోడ్డంటూ
ధనార్జనే ధ్యేయంగా భూమికావల కూడా హద్దులు గీస్తూ
సప్తవర్ణాల జీవితానికి సప్తపది ఇదేనని
భ్రమల లోకపు స్వర్గానికి నిచ్చెనలు వేస్తూ
బతికినంత కాలం బొక్కేందుకు
బలవంతుల చేతిలో చిక్కేందుకు
మాటలున్న మనిషే సిద్ధమైనప్పుడు
ముక్కలు ముక్కలుగా గెట్టు గెట్టుగా చీలుతున్న సందర్భంలో
సహనశీలి ఒంట్లో ఒక అనుకంప.... ఒక భూకంపం...
చివరికంతా ధ్వంసం... విధ్వంసం...
అనంతరం మళ్లీ...
ఒక సువిశాల భూప్రపంచం












Click it and Unblock the Notifications