బిడ్డలాలా

చేతులు జోడిస్తున్న
నా తోడే
మిమ్మల్ని మీరు చంపుకోకుండ్రి
ఏడ్సెతందుకు నీల్లు లేవు నా కంట్ల
మొత్తుకునేతందుకు సత్తువ లేదు నా ఒంట్ల
బరిసెలు గావల్సినోల్లు
నా కండ్ల ముందె
కట్టెలవుతుంటే
వశపడుత లేదు
నిప్పులసుంటి కొడుకులు
నట్టింట్ల బూడిదైతుంటె
పానమాగుత లేదు
ఎండిన రొమ్ములకెల్లి
జీవం పిండి పోసిన
సేతికందకుంటనే
ఎల్లిపోతర
బాంచెననిపించుకున్నోన్ని
బండకు కొట్టందే
బతుకు సాలిస్తర
బిడ్లలాల
మీరెందుకు సావాలె
బతికెటందుకు హక్కు లేనోల్లు
బాజాప్త తిరుగుతుంటె
లేత మోదుగాకు కులసుంటోల్లు
మీరెందుకు ఎండిపోవాలె
పచ్చని మామిడి పిందెలసుంటోల్లు
మీరెందుకు రాలిపోవాలె
నీల్ల మీద వెలుగసుంటోల్లు
మీరెందుక మాయమవాలె
బిడ్డలాల
ఆశ విడువొద్దు
బతుకు మీద బరోస ఇడువొద్దు
నేల మీద కాల్లు గట్టిగుండాలె
నా పెయ్యి మీద తేలిన నరాలు చూడుండ్రి
ఉబ్బిన నరాలల్ల పొంగిన పోరాటం చూడుండ్రి
గన్నుల తోటి కొట్లాడి గెల్చిన
మనోల్ల రేషం చూడుండ్రి
మీరెందుకు బిడ్డా
కోడెనాగులసుంటి మీ వయసుని
పానం లేని కట్టెను జేస్తరు
ఎర్రటి కొలిమసుంటి మీ కోపం మీద
సావు నీల్లు జల్లుతరు
బిడ్డలాలా
తాల్లు పేనింది
మీ కుతికెలకెసుకనేటందుకు గాదు
మనని తొక్కే మదపునేన్గుల్ని
కట్టి నేలక్కొట్టేందుకు
గాసు నూనె డబ్బాలు
మీ మీద పోసుకుని
నిండుపానం తీసుకునేటందుకు గాదు
మనకున్నదంత ఊడ్సుకుని
బడాచోర్లను నడి బజార్ల
నిలబెట్టి భగ్గుమనిపిచ్చెటందుకు
రాండ్రి బిడ్డలాల
ఒక్కటవుదాం
ఒక్కటిగుందాం
చేతులొక్కటి చేసి
చప్పట్లు కొడదాం
జీవితం జిందాబాదని
మాటలొక్కటి జేసి
మంటిని మింటిని ఒక్కటి చేద్దాం
చరిత్ర మనదేనని