Mayonnaise: మరో ఏడాదిపాటు మయోనైజ్ బ్యాన్.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పచ్చిగుడ్లతో చేసే మయోనైజ్ పై ప్రభుత్వం మరో ఏడాది నిషేధం విధించింది. మయోనైజ్ ఉత్పత్తితోపాటు నిల్వ అలాగే విక్రయాలపై ఏడాది పాటు పూర్తి స్థాయి నిషేధం విధిస్తూ రాష్ట్ర ఆహార భద్రతా కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. పచ్చి గుడ్ల వాడకం వల్ల సాల్మొనెల్లా వంటి బ్యాక్టీరియా చేరి ఫుడ్ పాయిజనింగ్ కేసులు పెరుగుతున్నాయని ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పష్టం చేస్తున్నారు.
ఈ మేరకు నిబంధనలు అతిక్రమిస్తే కఠిన క్రిమినల్ చర్యలు తీసుకోవడమే కాకుండా లైసెన్సులను రద్దు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం హెచ్చరించింది. ఇక గతంలో హైదరాబాద్ లో మోమోలు తిని మహిళ మృతి చెందడంతోపాటు పలువురికి అస్వస్థత కావడంతో ప్రభుత్వం మయోనైజ్ ఉత్పత్తులను ఏడాది పాటు బ్యాన్ చేసింది. తాజాగా నిషేధాన్ని మరో ఏడాది పొడిగిస్తూ గెజిట్ విడుదల చేసింది.
ఇక ఆహార భద్రత అండ్ ప్రమాణాల చట్టం, 2006 లోని సెక్షన్ 30(2)(ఎ) ప్రకారం సంక్రమించిన అధికారాలను వినియోగించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు వెల్లడించారు. ఈ గెజిట్ ఉత్తర్వులు అక్టోబర్ 30 నుంచే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. ఇక పచ్చిగుడ్లతో తయారు చేసిన మయోనైజ్ వినియోగం ఆరోగ్యానికి శ్రేయస్కరం కాదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీన్ని తీసుకోవడం కారణంగా ఫుడ్ పాయిజనింగ్ కావడంతో పాటు తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఈ మేరకు ప్రజల ఆరోగ్యం దృష్ట్యా గతంలోనే విధించిన ఏడాది బ్యాన్ ను మరో ఏడాది పాటు పొడిగిస్తూ ఉత్తర్వూలు జారీ చేసింది.

సాధారణంగా ఈ మయోనైజ్ ను ఎక్కువగా మండి బిర్యానీ, కబాబ్ లు, పిజ్జాలు, బర్గర్లు, శాండ్ విచ్ లు.. ఇతరత్రా ఆహార పదార్థాల్లో చెట్నీలా వేసుకుని తింటారు. అయితే ప్రస్తుతం మార్కెట్ లో గుడ్లతో చేయని వెజ్ మయోనైజ్ పై ఎలాంటి నిషేధం లేదు. కేవలం రెస్టారెంట్స్.. స్ట్రీట్ ఫుడ్ సెంటర్లలో అప్పటికప్పుడు పచ్చి గుడ్లను పగలకొట్టి తయారు చేసే మయోనైజ్ పైనే నిషేధం ఉంది.












Click it and Unblock the Notifications
