అయ్యప్ప సోసైటీలో అక్రమ నిర్మాణాలపై కవిత ఫైర్.. రేవంత్ సర్కారు నెల రోజుల డెడ్ లైన్
హైదరాబాద్ లోని ఖానామెట్ పరిధిలోని అయ్యప్ప సొసైటీలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై సమగ్ర సర్వే నిర్వహించాలని టీఆర్ ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. గ్రౌండ్ వాటర్ లేని ఆ ప్రాంతంలో ఒక్క ఇటుక కూడా పేర్చవద్దని హైకోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ దగ్గరుండి పర్మిషన్లు ఇప్పిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ నగర ప్రజలు సరైన రోడ్లు, నీళ్లు లేక ఇబ్బందులు పడుతుంటే ఆ సమస్యలను పట్టించుకోకుండా అక్రమ సంపాదనపైనే దృష్టి పెట్టారన్నారు.
అయ్యప్ప సోసైటీలో జరుగుతున్న అక్రమాలకు సంబంధించి గురువారం బంజారాహిల్స్ లోని పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అయ్యప్ప సోసైటీలోని గురుకుల ట్రస్ట్ కు సంబంధించిన భూముల్లో అక్రమంగా 500 నుంచి 700 వందల అక్రమ నిర్మాణాలు వచ్చాయన్నారు. వారందరికీ ముఖ్యమంత్రి సోదరులే పర్మిషన్లు ఇప్పిస్తూ కమీషన్లు తీసుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సమయానికి కూడా అక్కడ కొత్తగా 80 భవనాలు నిర్మాణంలో ఉన్నాయన్నారు.
సోసైటీకి చెందిన ఈ భూముల్లో రిజిస్ట్రేషన్ కు అవకాశం లేకపోవటంతో నోటరీల ద్వారా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారన్నారు. అక్రమంగా పది అంతస్తుల్లో భవనాలు నిర్మిస్తున్నారని.. పెద్ద ఎత్తున వాటిల్లో పీజీ హాస్టల్స్, కాలేజ్ లను నడుపుతున్నారని చెప్పారు. ఒక్కో భవనానికి మధ్యలో కనీసం అగరు బత్తి పట్టేంత సందు కూడా ఉండటం లేదని..ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరిదీ బాధ్యత అని ప్రశ్నించారు. ఇంత పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతుంటే ఎందుకు సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ పట్టించుకోవటం లేదో చెప్పాలని నిలదీశారు. ఎవరి ఒత్తిడి కారణంగా ఈ అక్రమాలను చూసి చూడనట్లు వదిలేస్తున్నారంటూ ప్రశ్నించారు. ఈ అక్రమాలపై ఏ రాజకీయ పార్టీ కూడా ఎందుకు మాట్లాడటం లేదని కవిత అడిగారు. కానీ తాము మాత్రం ఈ విషయాన్ని వదిలిపెట్టమని చెప్పారు.
అయ్యప్ప సోసైటీలోని ఖానామెట్ ప్రాంతంలో పూర్తిగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని కవిత చెప్పారు. ముఖ్యమంత్రి ఇంటికి సమీపంలో ఇంత పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతుంటే అధికారులు ఎందుకు పట్టించుకోవటం లేదని ప్రశ్నించారు. ఇక్కడ జరుగుతున్న అక్రమ నిర్మాణాలను జియో ట్యాగ్ ద్వారా ఓ న్యూస్ పేపర్ వాళ్లు రాస్తే కూడా ప్రభుత్వంలో చలనం లేదని మండిపడ్డారు. ఇక్కడి అక్రమాలపై కథనాలు ప్రసారం చేసేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులను ఇంటి ఓనర్లు బెదిరిస్తున్నారని చెప్పారు. మీడియానే బెదిరిస్తూ మా వెనుక పెద్దలు ఉన్నారని వాళ్లు చెబుతున్నారన్నారు. ముఖ్యమంత్రి సోదరుల అండతోనే మీడియాను బెదిరిస్తున్నారని.. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి ఉండటం బాధాకరమన్నారు.
కాంగ్రెస్ పార్టీ రౌడీ రాజ్యాన్ని నడుపుతోందని విమర్శించారు. మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రే పెద్ద పెద్ద బిల్డర్లకు సహకరిస్తున్నారని చెప్పారు. మూసీ గర్భంలో నిర్మాణాలు చేపట్టిన ఆదిత్య బిల్డర్స్ కు అదే మూసీలో మరో మూడు ప్రాజెక్ట్ లు చేపట్టిన పట్టించుకోవటం లేదన్నారు. మూసీలో ఆదిత్య బిల్డర్స్ నిర్మాణాలకు వ్యతిరేకంగా తాము ధర్నా చేసిన తర్వాత మూడు ప్రాజెక్ట్ లు కొత్తగా అదే మూసీలో నిర్మిస్తున్నారంటే ఎంతకు తెగించారో అర్థం చేసుకోవచ్చన్నారు. ఆదిత్య బిల్డర్స్ వాళ్లు ముఖ్యమంత్రి ఇద్దరు సోదరులకు చెరొక విల్లా ఇవ్వటంతోనే వారికి పర్మిషన్లు ఇచ్చారన్నారు. ఈ విధంగా అడ్డదిడ్డంగా దోచుకుంటున్న వారిని ప్రకృతి కూడా క్షమించదని హెచ్చరించారు.
అయ్యప్ప సోసైటీలో ఇటుక కూడా పేర్చవద్దని హైకోర్టు ఆర్డర్ ఉందని కవిత చెప్పారు. అయిన సరే కాంగ్రెస్ ప్రభుత్వం కోర్టు ఆదేశాలను లెక్క చేయకుండా కొత్తగా 7 వందల నిర్మాణాలకు పర్మిషన్ ఇచ్చిందన్నారు. పైగా నోటరీ ద్వారా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారన్నారు. ఇవి చెల్లవని, ఇక్కడ భూములు, ఫ్లాట్లు కొనవద్దని ప్రజలకు సూచించారు. అక్రమంగా ఇళ్లు నిర్మిస్తున్న వాళ్లు, నోటరీ తో రిజిస్ట్రేషన్ చేస్తున్న వాళ్లు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరించారు. అయ్యప్ప సోసైటీలో సమగ్ర సర్వే నిర్వహించి అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. అక్రమార్కులపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వానికి నెల సమయం ఇస్తున్నామని..ఈ లోపు చర్యలు తీసుకోకపోతే తామే అక్రమ నిర్మాణాల వద్దకు వెళ్లి రెడ్ మార్క్ వేస్తామన్నారు. ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యుల దోపిడీని ఎట్టి పరిస్థితుల్లో సాగనివ్వమని చెప్పారు.
రాష్ట్రంలో ఆర్టీఐ ఉండి ప్రయోజనం లేకుండా పోయిందని కవిత అన్నారు. ఏ దరఖాస్తుకు సమాచారం ఇవ్వటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తంగా 18 వేల అర్జిలు పెండింగ్ లో ఉన్నాయన్నారు. దీనిపై పెద్ద ఎత్తున ఒత్తిడి వస్తే ఒక్క జిల్లాలోనే ఒక్క రోజులో 8 వందల అప్లికేషన్లకు సమాధానం ఇవ్వలేమని చేతులేత్తేశారన్నారు. అలాంటప్పుడు ఆర్టీఐ ఉండి ఏం లాభమని ప్రశ్నించారు. అయ్యప్ప సోసైటీకి సంబంధించి సమాచారం కోసం తాను అప్లికేషన్ పెడతానని వెంటనే సమాధానం ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో 320 మండలాలు కరువులో ఉంటే హైదరాబాద్ కు వచ్చిన కేంద్రమంత్రి అమిత్ షా పైసా సాయం ప్రకటించలేదని కవిత మండిపడ్డారు. కాంగ్రెస్ ఢిల్లీలో ధర్నా చేస్తే హైదరాబాద్ వచ్చి అమిత్ షా కౌంటర్ రాజకీయాలు చేశారే తప్ప తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు. పైగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుస్తామంటూ ఆ పార్టీ నాయకులు బీరాలు పోతున్నారని విమర్శించారు. నగరానికి ఏమీ చేయని బీజేపీ నాయకులు నీళ్లు లేని బావిలో దూకాలన్నారు. దేశంలో 13 కోట్ల మంది విదేశీయులున్నారంటూ అమిత్ షా పచ్చి అబద్దాలు చెబుతున్నారన్నారు. 13 కోట్ల మంది విదేశీయులుంటే బీజేపీ రెండుసార్లు విదేశీయులు వేసిన ఓట్లతోనే గెలిచిందా చెప్పాలని నిలదీశారు. ఇలాంటి అబద్దాలు చెప్పి ఎన్ని రోజులు ప్రజలను మోసం చేస్తారంటూ విమర్శించారు.
తన వద్ద ఇంచు అసైన్డ్, ఇనాం భూములు ఉన్న సరే ప్రభుత్వానికే రాసిస్తా అని కవిత చెప్పారు. తన భూములకు సంబంధించి ఎలాంటి విచారణకైనా సిద్దమన్నారు. రాష్ట్రంలో ప్రజలు విద్యుత్ కోతలతో అల్లాడుతున్నారని.. దీనిపై ప్రభుత్వం స్పందించాలని కోరారు. ముఖ్యమంత్రి ఓ వైపు రైతులను పంటలు వేయవద్దని చెబుతుంటే మంత్రి తుమ్మల మాత్రం మేము అలా చెప్పలేదంటున్నారన్నారు. ముఖ్యమంత్రి, మంత్రి మధ్య సయోధ్య లేకపోవటం కారణంగా రైతులు ఆగమయ్యే పరిస్థితి వచ్చిందన్నారు.

గోదావరి, కృష్ణాలో నీటిని ఎత్తిపోసే అవకాశాన్ని వదిలేసి ఇప్పుడు నీళ్లు లేవంటూ ముఖ్యమంత్రి చేతులెత్తేశారని విమర్శించారు. రానున్న గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున మహిళ ఓటర్లు ఓటు నమోదు చేసుకోని తమకు అండగా ఉండాలన్నారు. టీఆర్ఎస్ పార్టీ మహిళల కోసం మహిళల చేత నడుపుతున్న పార్టీ అని ఈ పార్టీకి మీ అండ ఉండాలని మహిళ గ్రాడ్యుయేట్లను కవిత కోరారు.












Click it and Unblock the Notifications
