తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే.. ఇకపై ప్రతి కుటుంబానికి..
తెలంగాణ కేబినెట్ సమావేశం కొద్దిసేపటి క్రితమే పూర్తయింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ కేబినెట్ భేటీ జరిగింది. పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి వివరించారు. తెలంగాణలో పెట్టుబడులను ఆకర్షించాలన్న లక్ష్యంతో డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో 'ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్' కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రపంచ దేశాలతో పోటీపడేలా రాష్ట్రంలో పారిశ్రామిక విధానాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. గ్లోబల్ సమ్మిట్ నిర్వహణకు సీనియర్ మంత్రులకు బాధ్యతలు అప్పగించినట్లు స్పష్టం చేశారు. గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా భారీగా పెట్టుబడులు పెడతారనే విశ్వాసం ఉందని మంత్రి పొంగులేటి వివరించారు.
అలాగే ఈ కేబినెట్ సమావేశంలో ప్రజా సంక్షేమం, అభివృద్ధి, ఎల్ నినో పరిస్థితులు, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, నూతన పథకాల అమలు, పరిపాలనా సంస్కరణలకు సంబంధించి పలు అంశాలపై చర్చించినట్లు తెలిపారు. ఇక దీపావళి పండగ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 'మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి' కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్న 2,25,000 ఇందిరమ్మ ఇళ్లలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు స్పష్టం అవుతోంది. ఈ మేరకు సంబంధిత మంత్రులు, ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొనాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
అలాగే ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా కల్పించే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారు అయింది. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా నవంబర్ 19న సిద్దిపేటలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా కల్పించే ఉద్దేశంతో 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకంతోపాటు అదే రోజున ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించనున్నట్లు సమాచారం అందుతోంది.

ఇక ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న ఎస్సీ, ఎస్టీ కమిషన్ ను రద్దు చేసి వాటి స్థానంలో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు వేర్వేరుగా కమిషన్లు ఏర్పాటు చేయాలని తెలంగాణ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. మరోవైపు రాష్ట్రంలోని పలు న్యాయస్థానాల్లో సిబ్బంది కొరత దృష్ట్యా మొత్తం 136 పోస్టుల మంజూరుకు మంత్రివర్గం ఆమోదం లభించింది.












Click it and Unblock the Notifications
