వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
షాజహానా కవిత చమ్కీ

దారాలు దారాలుగా జీవితం
నాలుగ్గోడలకు రోజులను బిగించి
పట్టి పట్టి చేస్తున్న కలల కార్చోప్
రాత్రి చిక్కటి చీకటి మీద
మెరుపులుగా మెరుస్తున్న
కట్ దానా కుందన్‌లను
ఆలోచనల జరీతో కలబోసి చేస్తున్న కార్చోఫ్
సాదా చమ్కీ ... దేవదాసి చమ్కీ..
రకరకాల రంగుల మెరుపు కలలు
సాదా జీవితానికి
అరబ్ దీనార్ల రంగుల కలలు
రాకుమారుడి రాక కోసం
ఆకాశం తానులో నేసిన నక్షత్రాల స్వాగతం
అన్ని చమ్కీలు చీర మీదకు చేరవు
దారి తప్పి కింద పడి - ఊడ్పలో మాసి -
బజారులో ఎండకు మెరసి -
ఏ గాలి వేగానికో
బురద గుంటల్లో ఆత్మహత్య చేసుకుంటాయి
బతుకు చీరకు వేసిన కట్‌దానాలానో
బజారున పడ్డ చమ్కీలానో
ఏ ఎగుమతిలో ఎక్కడి దాకా వెళ్తుందో తెలియదు
ఏ బురద గుంట వడిలో మునుగుతుందో తెలియదు
కానీ మెరవడం దాని జీవలక్షణం
పాత బస్తీ నిండా మెరుస్తున్న చమ్కీలే