కవిస్వరం: అరుణ నారదభట్ల కవిత
సంఘటనలను కవిత్వీకరించడం కష్టమైన పని. సంఘటనలకు స్పందించి కవిత్వం ఎలా రాస్తారని అడిగేవారున్నారు. ఓ సంఘటన జరిగినప్పుడు కవిలో కలిగే భావనలు కవిత్వరూపం ధరిస్తాయి. సాధారణ ప్రజలు కూడా విషాద సంఘటనలకో, వినోద సంఘటనలకో ప్రతిస్పందించారు. కానీ, వారికి ఆ సంఘటనలను కవిత్వీకరించే నేర్పు ఉండదు. అక్కడే కవి ప్రత్యేకంగా నిలబడుతాడు.
విషాద సంఘటనలు కలిగించే ఆందోళనను, అలజడిని కవిత్వీకరించాలని ప్రయత్నించినప్పుడు చాలాసార్లు వచమైన తేలిపోవడం చూస్తుంటాం. కానీ, కొంత మంది చాలా ప్రతిభావంతంగా వాటిని కవిత్వీకరించగలరని చెప్పడానికి అరుణ నారదభట్ల రాసిన కాలం కవితే సాక్ష్యం. బియాస్ నది వరదల్లో కొట్టుకుపోయిన తెలుగు విద్యార్థుల విషాద సంఘటనను అరుణ నారదభట్ల అత్యంత ప్రతిభావంతంగా కవిత్వీకరించారు.

సంఘటనలను కవిత్వీకరించినప్పుడు, అందునా విషాద సంఘటలను కవిత్వీకరించినప్పుడు దానికి తగిన వాతావరణాన్ని సృష్టించడం అవసరం. అకస్మిక మరణాలకు, పెను విషాదాలకు మనిషి వైరాగ్యంలోకి వెళ్లిపోతాడు. ఆ వైరాగ్య స్థితిని బియాస్ ప్రమాదం గురించి రాసిన కవితలో అరుణ నారదభట్ల చాలా నైపుణ్యంతో చిత్రిక కట్టారు. "నిన్న వెంట రాదు/ రేపు ఏంటో తెలియదు/ కేవలం ఈ క్షణం మాత్రమే" అంటూ జీవన పరమార్థంతో కవితను ప్రారంభించారు. ఆ తర్వాతి స్టాంజాల్లో బియాస్ నది విషాద సంఘటనకు సంబంధించిన వాతావరణాన్ని సృష్టించారు.
ఉత్తరాదిన గతంలో జరిగిన కేదార్‌నాథ్ పెను విషాదాన్ని కూడా ఆమె తడిమారు. ప్రకృతికి దూరంగా మనిషిని నెట్టేస్తున్న వైనాన్ని ఆమె ఆ కవితలో తలుచుకున్నారు. ఈ కవితను విడమర్చి చెప్పే కన్నా చదివి ఆనుభూతి చెందితేనే బాగుంటుంది. ఒక సంఘటనను ఏ విధంగా సార్వజనీనం చేయవచ్చునో, కవిత పలుచబడకుండా ఎలా రాయవచ్చునో తెలియజేస్తుందీ కవిత.
- కాసుల ప్రతాపరెడ్డి
కాలం
నిన్న వెంట రాదు
రేపు ఏంటో తెలియదు
కేవలం ఈ క్షణం మాత్రమే
ఈ గుప్పిట్లో దాగుంది!
పడి లేచే కెరటంలా
ఎన్ని ఉదయాలు చీకటిలో చిక్కుతున్నాయి!
గాలి సవ్వడిలో గంభీర రాగం
పరుగెత్తే మేఘం
రాలుతున్న ఆకులకేసి చూస్తూ
భయం దొసిలిలోకి వెలుగు!
ఆ మట్టి ఎందుకో బలి కోరుతుంది
నది మంచు ముక్కలకు బదులుగా
మనుషుల్ని మోస్తుంది!
హిమపాతంతో నిండుకోవాల్సిన కొండలు
శవాలను కప్పుకుంటున్నాయి!
చేతివేళ్ళు....
నిద్రపోయిన తుఫానును లేపినందుకేమో
విహారంపై విహారం
నీరు గొంతు తడపడమే కాదు....
పీక నొక్కుతుందని తెలియదు...పాపం!
ఇప్పుడు కొట్టుకుపోయింది దేహాలే కాదు
ఆకాశానికి ఎగరాల్సిన గొంతుల గుండెకోత...జాతి భవిత !
ఉత్తరాన పచ్చదనం
చల్లగా ప్రశాంతంగా పరవళ్ళు తొక్కుతుందనుకుంటే
ఉరుముతున్న ఆకాశంలా ఆ భూమి
ఎరుపు రంగునద్దుకుంటుంది!
గత జూన్ అక్కడ డేంజర్ జోన్
ఇప్పుడూ అంతే....
అప్పుడు కేదారం
ఇప్పుడు బియాస్ ద్వారం!
ముంచేయడం బాగా నేర్చిన నేల
ప్రకృతికి దూరంగా మరోసారి
మనిషిని తరిమి కొట్టడం!
మర మనిషిలా జీవితానికి
నాలుగు కరెంటువైర్లు చుట్టుకోవడమే
చివరికి మిగిలింది!
- అరుణ నారదభట్ల
10-6-2014
కవిసంగమం కోసం ఇక్కడ క్లిక్ చేయండి












Click it and Unblock the Notifications