• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కవిస్వరం: నిర్మలారాణి తోట కవిత

By Pratap
|

అమ్మ గురించి రాయని కవి బహుశా ఉండకపోవచ్చు. నాన్న గురించి రాసిన కవితలు కూడా ఉన్నాయి. అయితే, భౌతిక ప్రపంచంలోనే కాకుండా మానసిక ప్రపంచంలో కూడా సర్వనామంగా తండ్రి పీడితుడిగా గుర్తింపు పొందాడు. పురుషస్వామ్యాన్నికి ప్రతీకగా తండ్రి విగ్రహం రూపు దిద్దుకుంది. అవును నిజమే, పురుషాధిక్యాన్ని ఎదిరించాల్సిందే, నిరసించాల్సిందే.

కానీ, తండ్రి భుజాల మీద ఎన్ని బరువులూ బాధ్యతలూ ఉన్నాయనే విషయాన్ని పట్టించుకున్నవారు తక్కువ. ఆ బరువును మోయడంలో అతను పడే యాతన చెప్పనలవి కానిది. పురుషుడు ఏడ్వకూడదు, కన్నీరు కార్చకూడదు. ఈ సమాజం పెట్టిన ఆంక్ష. ఆ ఆంక్ష అతన్ని కరుగుగట్టిన విగ్రహంగా తయారు చేసిందా, ఓదార్పునకు కూడా నోచుకోని వ్యధాభరితుడిని చేసిందా అనే ఆలోచించడానికి నిర్మలారాణి తోట రాసిన కవిత అవకాశం కల్పిస్తున్నది.

ఒక మహిళ తండ్రి గురించి ఆర్ద్రమైన కవిత ఇది. తండ్రి పట్ల సానుభూతి, సానుకూలత కనబరిచే కవితాభివ్యక్తి ఇది. కవిత అతి సాధారణంగా కనిపిస్తున్నది. కానీ, అందులోని ఆర్ద్రమైన భావనలు మంచి కవితగా రూపుదిద్దాయి. పురుషుడికీ మనసు ఉంది, పురుషుడికీ ప్రేమ ఉంది అని తెలియజెప్పే కవిత. నాన్నలందరికీ ఆమె సమర్పించిన కవిత ఇది.

"కన్నతండ్రిని కూడా హత్తుకోలేని నా వయసునూ, ఆడతనాన్ని మరచి/ ఒక్క సారి.. ఒక్క సారి నీ చేతుల్లో ఒదిగిపోయి/ కడుపారా ఏడ్వాలని ఉంది నాన్నా..!" అనే వాక్యాల సారాన్ని విడమరిచి చెప్పాల్సిన అవసరం లేదు. అది అనుభవానికి అందుతుంది. ఇలాంటి కవితాత్మకమైన వాక్యాలు ఈ కవితలో చాలా ఉన్నాయి.

 Kavisangamam poet: Niramala Rani Thota

శీర్షిక లేదు

చిన్నప్పుడు ఏం పండివంటలు చేసినా

నాన్న రానీ.. అని అమ్మ అంటుంటే

అర్ధం కాక అల్లరిచేసే పసితనం..

కాస్త పెరిగాక క్లాసు ఫస్టు రాలేదని

కోప్పడుతుంటాడని ప్రోగ్రెస్ కార్డు దాచేసి

తప్పించుకు తిరిగే అలవాటైన భయం

కాలేజీలో చేరాక అంతులేని ఆంక్షలు పెడుతుంటే

ఐదు నిమిషాలు ఆలస్యంగా ఇల్లు చేరితే

అంతెత్తున నన్నూ అమ్మను కలిపి తిడుతుంటే

హిట్లరును చూసినట్టు లోలోపలి అసహనం..

ఎప్పుడూ నువ్వు నాకు అర్ధం కాలేదు..

విసుర్లు, కసుర్లు తప్ప నాకేమీ కనిపించలేదు..

కరుడు గట్టిన గాంభీర్యం రాతి విగ్రహంలాగానే తోచేది

నిన్ను పూజించే అమ్మను చూస్తే జాలి వేసేది..

ఎందుకింత మౌనం నీకు?

ఎందుకంత దూరం మాకు..?

ఎన్ని సార్లు పొంగుకొచ్చే ఉత్సాహాన్ని

పెద్దరికం పెదవి చాటున దాచావో..

ఇంకెన్ని సార్లు తన్నుకొచ్చే ఉద్వేగాన్ని

గొంతు నొక్కి పట్టి ఎద లోతుల్లో ఆపేసావో . . .

నీ ప్రావిడెంటు ఫండంతా మా పెళ్ళిళ్ళకు ధారబోసి

పెన్షన్ డబ్బుల్లోంచి లాంఛనాలన్ని తీర్చేసి

అడపాదడపా చేసిన అప్పులన్నీ కడుపుగట్టుకొని తీర్చేసి

గుండె కలుక్కుమన్నప్పుడు గుట్టుగా దాచుకున్నావే..

అప్పుడైనా చెప్పాల్సింది నాన్నా..!

నోరు విప్పాల్సింది నాన్నా . .

ఒక్క సారి ఏడ్వాల్సింది నాన్నా..!

ఒక్క సారి నిన్ను తాకాలని ఉంది నాన్నా..!

కన్నతండ్రిని కూడా హత్తుకోలేని నా వయసునూ, ఆడతనాన్ని మరచి

ఒక్క సారి.. ఒక్క సారి నీ చేతుల్లో ఒదిగిపోయి

కడుపారా ఏడ్వాలని ఉంది నాన్నా..!

నీ గుండెల్లో ఘనీభవించిన యుగాల దుఖ్ఖాన్ని

కన్నీరుగా కరిగించాలని ఉంది నాన్నా..!

నీ ప్రతి ఆఙ్ఞ నా భవిష్యత్ సోపానానికి సంఙ్ఞ అని

నీ ప్రతి ఆంక్ష నన్ను పదిలంగా పొదువుకోవాలనే ఆకాంక్ష అని తెలుసుకోలేక

జీవితాన్ని తీర్చిదిద్దిన నీ తీర్చుకోలెని ఋణానికి ...

నిన్ను గుర్తించలేని అవివేకానికి ప్రతిగా

నీ పాదాలపై ప్రణమిల్లి కన్నీటి జల్లుతో ప్రక్షాళన చేయాలనుంది..

నన్ను క్షమించు నాన్నా..!

అమ్మంటే ఆది దేవతని అహరహమూ ఆరాధించే మేము

అమ్మకు ఆరాధ్య దైవమైన నీ అంతరంగపు విశ్వరూపాన్ని చూడలేని

అవిటితనాన్ని మన్నించి మాతో మనసు విప్పి మాట్లాడు నాన్నా..!

మా గుండెల్లోనే మీకు చోటు.. దరికి రానీయము ఇక ఏ గుండె పోటు. . ! !

- నిర్మలారాణి తోట

31.05.2014

కవిసంగమం కోసం క్లిక్ చేయండి

English summary

 Kavisngamam poet Nirmal rani Thota expressed and paid tribute to a father with her emotional feelings
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X