కవి స్వరం: పూర్ణిమా సిరి కవిత

నిజానికి, కవిత అందమైన ప్రతీకతో ప్రారంభమైంది. "నడుస్తున్న దారిలో నక్షత్రాలను చల్లి/ ఎవరో నెలవంకగా ముస్తాబు చేయరని.." అంటూ కవిత ప్రారంభమైనప్పుడు మన జీవిత గమనం అంత సుఖమయమైంది కాదనీ మరొకరు మన జీవితానికి దారులు వేయరనే అర్థం స్ఫురిస్తుంది. కవిత చదువుతూ పోతే జీవితంలోని అసంబద్ధత అర్థమవుతూ ఉంటుంది.
జీవితంలో మనం మోదాన్నే ప్రేమిస్తాం కానీ ముళ్లు గుచ్చడం వల్ల కారిన నెత్తటితోనే జీవితం అసలు రంగు బయటపడుతుందని కవయిత్రి జీవితం పరమార్థాన్ని విప్పి చెప్పారు. చివరగా ఖేదమూ మోదమూ, ముందడుగూ వెనకంజా మనం అనుకునే భావనలే తప్ప అది సత్యం అది కాదని పూర్ణిమా సిరి చెబుతారు. జీవితమంతా వలయంలోనే సాగుతుందనే సత్యాన్ని ఆమె కవితాత్మకంగా చెబుతారు. వివిధ ప్రతీకల ద్వారా దాన్ని చెబుతారు.
తాళం చెవి, వలయం వంటి ప్రతీకల ద్వారా ఆమె దాన్ని పాఠకుడికి అర్థం చేయించే ప్రయత్నం చేశారు. అయితే, మనకు జీవిత దాహం తీరేది కాదు. జీవితం అసంబద్ధమని తెలిసీ దేని కోసమో చూస్తూనే ఉంటాం. ఆ ఎదురుచూపులో, ఆ తండ్లాటలో, ఆ వలయంలో గిర్రున తిరగడంలో, తాళం తీయడంలో మనిషి తన ఉనికినే కోల్పోతున్నాడనే విషయాన్ని ఆమె తెలియజెప్పారు. ఆలా చూసినప్పుడు జీవిత పరమార్థానికి సంబంధించిన పరిణతి ఈ కవితలో కనిపించినట్లు నాకు అనిపించింది. "వలయ గమనం" అనే శీర్షిక ద్వారానే జీవితం వలయంలో మాత్రమే సాగుతుందని, ముందుకూ వెనక్కూ సాగని చెప్పారు.
- కాసుల ప్రతాప రెడ్డి
వలయ గమనం
నడుస్తున్న దారిలో నక్షత్రాలను జల్లి
ఎవరోవచ్చి నెలవంకగా ముస్తాబు చేయరని
అప్పుడప్పుడు
మీమాంసల మనోగతం నుండి
మరో అడుగు ముందుకు వేస్తాం
కాల పదకేళిలో పద్దతిగా కూసింత పరిణితితో
సాఫల్యాలతో పాటు సంకెళ్ళనీ గుర్తించ సాహసిస్తాం
తెరిచిన తాళంచెవి మరో తాళాన్నికూడా బిగిస్తుందని
అర్థంచేసుకోలేక మరో తాళంచెవికై పరుగుతీస్తాం
ఎప్పటికప్పుడు వృత్తపరిధి పెరుగుతుందనుకుంటామే కాని
వృత్తానికావల మరో వృత్తాన్ని గీస్తున్నామని స్పురణకురాదు
ఇంతకుముందు ఎన్ని గొంతుకలలో
మన స్వరం కలిసి నినదించిందో
ఎన్ని నిశ్శబ్ద ఖేదాలకు
మౌన ఆమోదం తెలిపామో
సుగంధం వెదజల్లిన పువ్వు కన్నా
గుచ్చిన ముల్లు చిందించిన రుధిరం తో
జీవితపు అసలు రంగు తెలిసొచ్చినా
మళ్ళీ మళ్ళీ కేవలం పువ్వులనే మోహిస్తాం
బలిపీఠంపై జీవితమో
జీవితమే ఒక బలిపీఠమో
తేల్చుకునే ప్రయాసలో
మనని ఎంతోకొంత
నిక్కచ్చిగా తెలుసుకుంటాం
అసాధారణంగా ఆలోచిస్తూనే
సాధారణ వలయాల్లో భ్రమించే
అతిసాధారణ ఉనికి మనదని
ఎంత చెప్పినా, ఎన్ని తెలిసినా
నమ్మలేకపోతాం, ఒప్పుకోలేకపోతాం
ఇంకా దేనికోసమో ఎదురుచూస్తూ
మననుండి మనని తరిమేస్తాం
-పూర్ణిమా సిరి
22.4.14

కవి సంగమం కోసం ఇక్కడ క్లిక్ చేయండి












Click it and Unblock the Notifications