చంద్రుడిపై శాశ్వత గుడారం- నాసా బిగ్ ప్లాన్
నాసా అత్యంత ప్రతిష్ఠాత్మక ఆర్టెమిస్ 2 మిషన్‌కు సిద్ధమవుతోంది. 54 ఏళ్ల తర్వాత మానవులను చంద్రునికి సమీపంలోకి తీసుకెళ్లే ఈ మిషన్‌ను 2026 ఏప్రిల్ 1న ఫ్లోరిడాలోని కెనడీ అంతరిక్ష కేంద్రం నుండి ప్రయోగిస్తారు. నలుగురు వ్యోమగాములు ఓరియన్ క్యాప్సూల్‌లో భారీ ఎస్ఎల్ఎస్ రాకెట్‌తో అంతరిక్షంలోకి బయలుదేరి వెళ్తారు. భారత కాలమానం ప్రకారం గురువారం తెల్లవారు జామున 3:54 నిమిషాలకు ఈ రాకెట్ చంద్రుడి వైపు దూసుకెళ్తుంది.
సుమారు 10 రోజుల పాటు ఈ రాకెట్ చంద్రుని చుట్టూ ప్రదక్షిణలు చేసి భూమికి చేరుతుంది. చంద్రునిపై ల్యాండింగ్ ఉండదు. భూమికి అత్యంత దూరం ప్రయాణించడం, అత్యంత వేగంగా తిరిగి రావడం అనేది దీని ముఖ్య ఉద్దేశం. ఆర్టెమిస్ 2 వ్యోమగాములు భూమి నుండి సుమారు 4,02,000 కిలోమీటర్లు ప్రయాణించి అత్యధిక దూరాన్ని చేరుకుంటారు. ఇది అపోలో 13 మిషన్ కంటే 2,414 కిలోమీటర్లు ఎక్కువ. ఈ మిషన్ ఫ్రీ రిటర్న్ ట్రాజెక్టరీ విధానంలో సాగుతుంది.

1972 తర్వాత చంద్రుని సమీపానికి మానవులు వెళ్లే తొలి మిషన్ ఇదే. ఈ యాత్ర చంద్రునిపై దిగకుండా దాని చుట్టూ ప్రయాణించి తిరిగి వస్తుంది. 2028లో మానవులను చంద్రుని ఉపరితలంపై దించేందుకు నాసా ప్రణాళికలు రచిస్తోంది. చంద్రునిపై శాశ్వత మానవ ఉనికి కోసం నాసా దీర్ఘకాలిక ప్రణాళికను ఆవిష్కరించింది. వచ్చే దశాబ్దంలో వ్యోమగాములు తరచుగా చంద్రుడి వద్దకు వెళ్లేలా, అక్కడ ఎక్కువ కాలం ఉండేలా దీనిని రూపొందించింది నాసా.
దీనికి ఆర్టెమిస్ 2 కీలకం. 2022లో ఆర్టెమిస్ 1 మానవరహిత మిషన్‌ను చంద్రుని చుట్టూ పరీక్షించారు. ఇప్పుడు ఆర్టెమిస్ 2లో వ్యోమగాములు ఇదే మార్గంలో వెళ్తారు. దీని తర్వాత మరో టెస్ట్ మిషన్ 2028లో ఉండబోతోంది. చంద్రుడిపై మనిషి అడుగు పెట్టనున్నాడు. దీంతో పాటు నాసా ప్రతి ఆరు నెలలకు ఒకసారి మూన్ మిషన్ చేపట్టాలని నిర్ణయించింది. అంతర్జాతీయ భాగస్వాములు, ప్రైవేట్ కంపెనీలతో కలసి ఈ జాయింట్ మిషన్లు ఉంటాయి.
ఆర్టెమిస్ 2 నాసా అత్యంత శక్తివంతమైన స్పేస్ లాంచ్ సిస్టమ్ (SLS) రాకెట్‌ను ఉపయోగిస్తుంది. అపోలో మిషన్లు చరిత్రలో అత్యంత శక్తివంతమైన సాటర్న్ వీ వాడాయి. ఎస్ఎల్ఎస్ రాకెట్, ఓరియన్ వ్యోమనౌక కొత్తవి. 2022లో జరిగిన 25 రోజుల మానవ రహిత ఆర్టెమిస్ 1 మిషన్‌లో వీటిని తొలిసారిగా పరీక్షించారు. వ్యోమగాములతో కూడిన చంద్ర యాత్రకు ఈ వ్యవస్థల వినియోగం ఆర్టెమిస్ 2తో ఇదే మొదటిసారి.
ఆర్టెమిస్ II మిషన్ చంద్రుని వైపు బయలుదేరే ముందు భూమి చుట్టూ రెండుసార్లు కక్ష్యలో తిరుగుతుంది. ఇది చంద్రుని చుట్టూ ప్రదక్షణం చేసి, దాని సుదూర ప్రాంతాన్ని దాటి 6,500 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. మానవులు అంతరిక్షంలో చేరిన అత్యంత దూరం ఇదే. గతంలో అపోలో మిషన్లు చంద్రుని ఉపరితలం నుంచి కేవలం 110 కిలో మీటర్ల ఎత్తులో వరకు మాత్రమే పరిభ్రమించాయి. 2028 చంద్రుని ల్యాండింగ్‌కు ముందు వ్యవస్థల పరీక్షకు ఈ మిషన్ కీలకం.












Click it and Unblock the Notifications